అవతార్ 2 తో మన ఆర్‌ఆర్ఆర్ పోటీ పడే 'ఆస్కారం'

Tue Dec 06 2022 12:45:41 GMT+0530 (India Standard Time)

Competition With Our RRR Movie Avatar 2 Standing In Oscar Nominations

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్‌ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు బరిలో నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇండియా తరపున అధికారికంగా ఆస్కార్ నామినేషన్స్ ను దక్కించుకోలేక పోయిన ఆర్ఆర్‌ఆర్ సినిమా ను ఎట్టిపరిస్థితుల్లో ఆస్కార్ బరిలో నిలిపేందుకు రాజమౌళి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.దేశం తరపున కాకుండా స్వయంగా ఆస్కార్ నామినేషన్ పరిశీలన కోసం ఆర్ ఆర్ ఆర్ సినిమాను రాజమౌళి పంపించాడు. అంతర్జాతీయ మీడియా సంస్థల్లో వస్తున్న కథనాలు మరియు పలు విభాగాల్లో అంతర్జాతీయ అవార్డులు దక్కించుకుంటున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా కచ్చితంగా ఆస్కార్ నామినేషన్స్ ను దక్కించుకునే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.

తాజాగా ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ఒక కథనంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా వీఎఫ్‌ఎక్స్ కేటగిరీలో ఆస్కార్ అవార్డకు నామినేట్ అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా యొక్క వీఎఫ్‌ఎక్స్ కు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కిన విషయం తెల్సిందే.

వీఎఫ్‌ఎక్స్ కేటగిరీతో పాటు మరో కేటగిరీలో కూడా ఈ సినిమా నామినేషన్స్ ను దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని సదరు కథనం లో పేర్కొన్నారు. ఒక వేళ వీఎఫ్‌ఎక్స్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ ఆస్కార్ నామినేషన్స్ ను దక్కించుకుంటే అవతార్ 2 సినిమా తో పోటీ పడాల్సి వస్తుంది.

విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో టాలీవుడ్ జక్కన్న గతంలో ఎన్నో సార్లు జాతీయ అంతర్జాతీయ అవార్డులను దక్కించుకున్నాడు. అయితే ఆస్కార్ అవార్డు ల్లో కనీసం నామినేట్ అయినా కూడా చాలా గొప్ప విషయం.. అద్భుతమైన విజయం అన్నట్లుగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచి మన ఆర్ ఆర్ ఆర్ సినిమా అవతార్ 2 తో పోటీ పడితే అదే గొప్ప గౌరవం.