Begin typing your search above and press return to search.

అయ్యో! ఒక్క పిట్ట‌యినా రాలేదే!!

By:  Tupaki Desk   |   12 Dec 2019 7:49 AM GMT
అయ్యో! ఒక్క పిట్ట‌యినా రాలేదే!!
X
ఆరుగాలం శ్ర‌మించి రైతన్న‌ పండించిన పంట నేల‌మ‌ట్టం అయితే ఆ బాధ ఎలా ఉంటుంది? ప్ర‌కృతి వైప‌రీత్యాల వ‌ల్ల గంగ పాలైతే ఎట్టా ఉంట‌ది! అలానే అయ్యిందిట ఆర్జీవీ పండించిన పంట ప‌రిస్థితి. ఎంత బాగా వండాం అన్న‌ది అటుంచితే తినేందుకు ఎవరైనా ఉంటే క‌దా? అన్న‌ట్టే ఉందిట సీను!

అస‌లింత‌కీ ఇదంతా ఏ సినిమా గురించి అంటే `అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డలు` సినిమా గురించే. గ‌త నెల‌రోజులుగా ఈ సినిమా ప్ర‌చారాన్ని వివాదాల‌తోనే కానిచ్చేసిన ఆర్జీవీ చివ‌రికి కోర్టులు.. సెన్సార్.. రివైజింగ్ క‌మిటీ ముందు పోరాడి నేడు థియేట‌ర్ల‌లోకి తెచ్చాడు. అయితే మోర్నింగ్ షోలకు జ‌నం లేక క్యాన్సిల్ చేయ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

అస‌లింత‌కీ ఏమైంది? అని ఆరాతీస్తే.. ర‌క‌ర‌కాల వివాదాల వ‌ల్ల ఈ సినిమా రిలీజ‌వుతోందా లేదా? అన్న సందిగ్ధ‌త‌తో జ‌నాలు అస‌లు థియేట‌ర్ల వైపే చూడ‌లేద‌ట. ప‌ర్య‌వ‌సానంగా ఉద‌యం ఆట వ‌ర‌కూ జ‌నం లేక చాలా థియేట‌ర్లు క్లోజ్ చేశారు. ఆరు గాలం శ్ర‌మించిన ఆర్జీవీకి ఇది నిజంగానే ఇబ్బందిక‌ర‌మైన స‌న్నివేశ‌మే. సినిమాలో కంటెంట్ ఎంత‌? వివాదాల ప‌ర్సంటేజీ ఎంత‌? అన్న‌ది మ‌రో గంట‌లో రివ్యూల రూపంలో తెలిసిపోతుంది. స‌మీక్ష‌ల్ని బ‌ట్టి.. జ‌నాల్లో మౌత్ టాక్ ని బ‌ట్టి ఇక‌నైనా థియేట‌ర్ల‌కు వెళ్లాలా వ‌ద్దా? అన్నది జ‌నం నిర్ణ‌యించుకుంటారు. బావుంది అన్న టాక్ వ‌స్తే ఫ‌స్ట్ షో పుంజుకునే ఛాన్సుంటుంది. లేదంటే వ‌ర్మ త‌న కెరీర్ లో మ‌రో డిజాస్ట‌ర్ అందుకోవ‌డం గ్యారెంటీ. క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు టైటిల్ ని అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లుగా మార్చి నేడు (గురువారం) థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఏపీలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు .. మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అండ్ కోని విల‌న్లుగా చూపిస్తున్న నేప‌థ్యంలో ఏపీలో అల్ల‌ర్ల‌కు ఆస్కారం ఉంద‌ని ఇంత‌కుముందు రివైజింగ్ క‌మిటీ... సెన్సార్ గ‌డ‌ప ముందు వాగ్వాదం న‌డిచింది. కోర్టు కూడా ఈ విష‌యాన్ని ప‌రిగ‌ణించి సెన్సార్ వాళ్లకే వ‌దిలేశారు. చివ‌రికి మ్యూట్ లు క‌ట్ ల‌తో ఈ చిత్రం రిలీజైంది. మ‌రి ఏమేర‌కు ఆక‌ట్టుకోనుంది? అన్న‌ది చూడాలి.