'అల్లు'పై ఆ కాంపౌండ్ లో టెన్షన్ లేదా?

Mon Aug 03 2020 13:40:28 GMT+0530 (IST)

RGV announces his next web film: Allu

ప్రముఖుల్ని టార్గెట్ చేస్తూ స్క్రిప్టులు తయారు చేయడం వాటిని ఆర్జీవీ వరల్డ్ థియేటర్- ఏటీటీలో రిలీజ్ చేయడం ఇదో నిత్య వ్యాపకంగా మారింది వర్మకు. ఏటీటీ సినిమా అనగానే చాలా సులువైపోయింది ఆర్జీవీ పని. పరిమిత బడ్జెట్ లో తనకు నచ్చిన టాపిక్ ఎంచుకుని అవతలి వాళ్లపై సెటైర్లు వేస్తూ.. వ్యంగ్యంగా పంచ్ లు వేస్తూ జనాల్ని నవ్వించాలన్న అతడి తపనకు ఊపు పెరిగింది.ఇంతకుముందు జనసేనాని పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేస్తూ `పవర్ స్టార్` తీశాడు. పవన్ రాజకీయ జీవితాన్ని అపహాస్యం పాలు చేసే ప్రయత్నమే చేశాడు. కానీ ఆశించిన రిజల్ట్ ని అందుకోలేకపోయాడు. ఈసారి అల్లు అంటూ అదే మెగా కుటుంబానికి చెందిన అగ్ర నిర్మాత అల్లు అరవింద్ నే టార్గెట్ చేస్తున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్జీవీ ఎలాంటి బెరుకు భయం అన్నదే లేకుండా టాలీవుడ్ ప్రముఖుల్ని కెలుకుతున్నాడు.

ఈసారి అల్లు అన్న ప్రకటనతోనే మెగా అల్లు కాంపౌండ్ లో హీట్ మొదలైంది. ఆర్జీవీ ఈసారి కూడా వెకిలి వ్యంగ్యం ఎగతాళి లేదా కామెడీ.. ఇంకేదైనా తెరపై చూపించే ప్రయత్నమే చేస్తున్నాడు. అయితే నిజానికి అల్లు చిత్రం మరొక స్పూఫ్ లఘు చిత్రంగా ఉంటుందనే భావిస్తున్నారు. ఇంతకీ అల్లు జీవితంలో ఏ పార్ట్ ని ఎంపిక చేసుకుంటాడు? అంటే.. చిరంజీవి `ప్రజారాజ్యం` పార్టీ పెట్టినప్పుడు అల్లు అరవింద్ పాత్ర ఏమిటి? అన్నదానినే టార్గెట్ చేస్తాడని అంచనా వేస్తున్నారు.

అయితే అల్లు టైటిల్ తో తనని టార్గెట్ చేయదలిచిన వర్మను టాలీవుడ్ నుంచి సదరు అగ్ర నిర్మాత నిషేధిస్తారా? అంటూ ఆసక్తికర చర్చ మొదలైంది. నిజానికి వర్మ `పవర్ స్టార్` మూవీ చేసినప్పుడు ఆ కాంపౌండ్ వాళ్లు స్పందించకపోయినా.. ఈసారి `అల్లు` ప్రకటనతో ఖంగు తిన్నారట. ప్రస్తుతం వారిలో ఆందోళన మొదలైందని తెలుస్తోంది. అయితే వర్మ ఎలాంటి సినిమా తీసినా దాని గురించి కంగారు పడొద్దని చెప్పారట. తమ అనుచరులకు ఈ చిత్రం గురించి పెద్దగా చింతించవద్దని సలహా ఇచ్చారని అది వారి ఇమేజ్‌కి హాని కలిగించదని అన్నారట. పైగా ప్రేక్షకులకు నచ్చాలి కదా! అన్న వ్యాఖ్యలు చేశారట. అంటే ఆర్జీవీ అంత గొప్ప సినిమా తీయడనేది సదరు కాంపౌండ్ వ్యక్తుల ధీమా అన్నమాట.