Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడేనా...?

By:  Tupaki Desk   |   10 July 2020 4:00 PM GMT
పవర్ స్టార్ సినిమా రిలీజ్ అయ్యేది అప్పుడేనా...?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు నటించిన చిత్రాల్లో 'తొలిప్రేమ' సినిమాకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రంతోనే పవన్ కళ్యాణ్ స్టార్ హీరో ఇమేజ్ సంపాదించుకున్నాడు. పవన్ కళ్యాణ్ కెరీర్‌ లోనే బెస్ట్ మూవీస్ లో ఒకటిగా.. మైలురాయి మూవీగా 'తొలిప్రేమ' ని చెప్పుకోవచ్చు. 1998 జూలై 24న విడుదలైన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. అందుకే ‘తొలిప్రేమ’ సినిమాని.. ఆ రిలీజ్ డేట్ ని ప్రత్యేకంగా భావిస్తుంటారు మెగా అభిమానులు. ఇప్పుడు అదే డేట్ కి పవర్ స్టార్ సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్స్ చేస్తున్నారట. అయితే ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా అనుకుంటే పొరపాటే.. ఇది సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న 'పవర్ స్టార్' సినిమా కావడం విశేషం.

ఇప్పటికే 'పవర్ స్టార్' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసిన వర్మ త్వరలోనే ఈ సినిమాని ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలో 'తొలిప్రేమ' విడుదల తేదీ అయిన జూలై 24న 'పవర్ స్టార్' సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రామ్ గోపాల్ వర్మ ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారట. ఇప్పటికే మేజర్ పార్ట్ చిత్రీకరణ కంప్లీట్ కాగా కేవలం 10 శాతం షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఓ రిసార్ట్ ని తీసుకొని వర్మ షూటింగ్ చేస్తున్నారట. దీనికి సంభందించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా లొకేషన్ లోనే వెంటనే పూర్తి చేస్తున్నారట.

ఈ క్రమంలో 'పవర్ స్టార్' సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి డైలీ ఏదొక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు వర్మ. ఈ సినిమా నిజ జీవితంలోని ఏ వ్యక్తిని ఉద్దేశించి తీస్తుంది కాదని.. పొలిటికల్ పార్టీ స్థాపించి ఎన్నికలలో ఓడిపోయిన ఓ స్టార్ హీరో స్టోరీ అని.. ఏ వ్యక్తికైనా దగ్గర పోలికలు ఉంటే అది యాదృచ్చికంగా జరిగింది మాత్రమేనని చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ ఆర్జీవీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. మరి వివాదాస్పద దర్శకుడు తీసిన 'పవర్ స్టార్' సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకెన్ని వివాదాలకు తెర తీస్తుందో చూడాలి.