వర్మ మాములుగా వదలడం లేదు

Wed Jan 23 2019 14:00:01 GMT+0530 (IST)

ఎన్టీఆర్ కథానాయకుడు దెబ్బకు మహానాయకుడు టైంకి వస్తుందా రాదా అనే అనుమానాలు కొనసాగుతూ ఉండగానే తన లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రమోషన్ వేగాన్ని వర్మ అమాంతం పెంచేసాడు. ట్విట్టర్ ని వేదికగా పెట్టుకుని సినిమాలోని కొన్ని కీలకమైన షాట్స్ ని షేర్ చేస్తూ ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. చూస్తుంటే విడుదల టైంకంతా మహానాయకుడు కంటే దీనికే బజ్ ఎక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదు అనేలా ఉంది వర్మ వ్యవహారం. ఇవాళ పోస్ట్ చేసిన మూడు ఫోటోలలో అందరిని ఆకట్టుకున్నవి రెండు.ఒకదాంట్లో లక్ష్మి పార్వతి పాత్రధారిణి భుజం మీద చేయి వేయడం రెండోది ఎన్టీఆర్ కళ్ళు మూసుకుని ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ ఉండగా వెనుక వైపు బాబు వేషంలో ఉన్న ఆర్టిస్ట్ ని కాస్త  బ్లర్ గా చూపిస్తూ అతని మనసులో వేరే ఏదో ఆలోచన ఉన్నట్టు ఫ్రేమ్ సెట్ చేసారు. ఇక మూడో పిక్ కీలకమైన పార్టీ మీటింగ్ లో అందరు టిడిపి జెండాలు వేసుకుని కుర్చీలలో కూర్చోగా ఎన్టీఆర్ ఏదో చెబుతున్నట్టు ఉంది. నిన్న ఒక రెండు ఇవాళ ఒక మూడు ఫోటోలతో ఫుల్ పబ్లిసిటీ తెచ్చేసుకుంటున్నాడు వర్మ. ఏ ఉద్దేశంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ తీస్తున్నాడో దాన్ని ఈ రూపంలో డైరెక్ట్ గానే బయట పెట్టేస్తున్నాడు.

లక్ష్మి పార్వతితో పెళ్ళయ్యాక ఎన్టీఆర్ రాజకీయ జీవితం ఏం జరిగింది అనే పాయింట్ మీద సినిమా తీస్తున్న వర్మ ఇందులో అన్నీ నిజాలే చూపిస్తానని చెబుతూనే ఉన్నాడు. మరోవైపు సోషల్ మీడియాలో వీటి మీద పెద్ద చర్చే జరుగుతోంది. ఒకవేళ వర్మ మహానాయకుడు కంటే ముందే ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసుకొస్తే ఇబ్బందులు తప్పేలా లేవు. ఎంత కాదనుకున్నా మహానాయకుడులో కొన్ని వాస్తవాలను దాచి చూపక తప్పదు. వాటినే ఎక్స్ పోజ్ చేస్తాను అంటున్నాడు వర్మ. మరి ఇప్పుడీ ఫోటోలతో వర్మ చేయబోయే రచ్చ చిన్న టీజర్ తరహాలో కనిపిస్తోంది కదా.