Begin typing your search above and press return to search.

ఆశ్చర్యపోవడమే అందరి వంతు చేసిన ఆర్జీవీ!

By:  Tupaki Desk   |   27 May 2020 11:10 AM GMT
ఆశ్చర్యపోవడమే అందరి వంతు చేసిన ఆర్జీవీ!
X
వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కరోనా వైరస్ చిత్ర ట్రైలర్ మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం నెట్టింట మిలియన్ల వ్యూస్ తో రికార్డులు బద్దలు కొడుతుంది. ఇదివరకే 1.5 మిలియన్లకు దగ్గరలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ట్రైలర్ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు డైరెక్టర్ వర్మ. కరోనా మహమ్మారి కారణంగా మన దేశం మాత్రమే కాదు, ప్రపంచ దేశాలు సైతం నిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో పరిస్థితి ఎలా ఉంది అనేది కరోనా వైరస్ నేపధ్యంలో తెరకెక్కించే ప్రయత్నం చేశారు రామ్ గోపాల్ వర్మ. అంతేకాక చివర్లో మా సినిమానీ ఎవరూ ఆపలేరు అని నిరూపించడానికి ఈ ట్రైలర్ విడుదల చేశాం అని వ్యాఖ్యానించారు.

ఆర్జీవీ తీసిన ప్రతి సినిమా వెనుక ఓ వివాదం ఖచ్చితంగా ఉంటుందన్నది అందరికి తెలిసిందే. అయితే తాజాగా 'కరోనా వైరస్'పై సినిమా తీసి షాక్ ఇచ్చాడు. ఆయన వివాదం వెనుక పబ్లిసిటీ స్టంట్ దాగి ఉందన్న ప్రచారం నడుస్తుంది. ఇప్పుడు తాజాగా ఆయన రేపిన వివాదం కూడా చిత్రం ప్రమోషన్ కోసం చేశారా..? అనేది తెలియాల్సి ఉంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. వ్యాపార, వాణిజ్యాలు అన్నీ బంద్ అయ్యాయి. జనం ఇళ్ల నుంచి బయటకు రావట్లేదు. చిత్ర పరిశ్రమలోనూ షూటింగ్ లు, థియేటర్లు అన్నీ బంద్ అయ్యాయి. అయితే కరోనా వైరస్ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదల చేసిన తర్వాత వర్మ.. ఇవాళ (బుధవారం) ఉదయం ఓ ట్వీట్ చేశారు. అదే ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపుతోంది. కరోనా వైరస్ సినిమాను లాక్ డౌన్ పీరియడ్ లో చిత్రీకరించామని ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఐతే ప్రభుత్వం విధించిన నిబంధనలు కూడా పాటించామని ట్విట్టర్లో తెలిపాడు. అంతే కాదు ఈశ్వర్, అల్లా, జీసస్, గవర్నమెంట్ పై ఒట్టేసి చెబుతున్నా.. అంటూ ఆయన రాయడం విశేషం. ప్రస్తుతం ఆశ్చర్యపోయి చూడటం జనాల వంతు అయింది.