Begin typing your search above and press return to search.

నాగబాబుకు ఆర్జీవీ మద్దతు.. గాడ్సేపై మూవీ తీస్తారట

By:  Tupaki Desk   |   20 May 2020 3:50 PM GMT
నాగబాబుకు ఆర్జీవీ మద్దతు.. గాడ్సేపై మూవీ తీస్తారట
X
భారత జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణించిన మెగా బ్రదర్ నాగబాబు... విమర్శలు వెల్లువెత్తేసరికి తనను తాను తమాయించుకుంటూ క్షమించాలని వేడుకుంటున్న కీలక తరుణంలో నాగబాబుకు బలమైన సపోర్ట్ దొరికింది. మంగళవారం నాగబాబు చేసిన ట్వీట్ పై ఇప్పటికే పెద్ద ఎత్తున రచ్చ సాగుతుండగా... నాగబాబుకు మద్దతుగా నిలిచేందుకు ఎంట్రీ ఇచ్చిన సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ.. .అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తూ ఏకంగా గాడ్సేపై తాను ఓ సినిమాను కూడా తీస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో నాగబాబుపై వెల్లువెత్తుతున్న విమర్శలు ఇప్పుడు వర్మపైకి మళ్లుతాయేమో చూడాలి.

నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణిస్తూ నిన్న సోషల్ మీడియా వేదికగా నాగబాబు చేసిన ప్రకటన పెను కలకం రేకెత్తించింది. నాగబాబు నుంచి ఈ ప్రకటన రాగానే... అందరూ ఆయనపై విరుచుకుపడ్డారు. జాతిపితను హత్య చేసిన గాడ్సే దేశభక్తుడెలా అవుతారంటూ నాగబాబుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలకు జడిసిపోయిన నాగబాబు.. తనను తాను ఈ వివాదం నుంచి రక్షించుకునేలా మరో ప్రకటన విడుదల చేయక తప్పలేదు. గాడ్సే చేసిన నేరాన్ని తాను సమర్థించలేదని, తనను అపార్థం చేసుకోవద్దంటూ నాగబాబు ప్రకటించారు. ఈ క్రమంలో ఈ వివాదం సద్దుమణుగుతుందిలే అనుకుంటున్న తరుణంలో వర్మ ఎంట్రీ ఇచ్చి ఈ వివాదాన్ని అప్పుడప్పుడే ముగించేది లేదన్నట్లగా సంచలన ప్రకటన చేశారు.

అయినా నాగబాబుకు మద్దతుగా నిలుస్తూ వర్మ ఎలాంటి కామెంట్లు చేశారన్న విషయానికి వస్తే... ‘‘నాథూరాం గాడ్సే... గాంధీని చంపాడని మాత్రమే చెబుతున్నారు. కానీ ఎందుకు చంపాడో అనే విషయాన్ని ఎవరూ చెప్పడం లేదు. గాంధీని గాడ్సే ఎందుకు చంపాడనే విషయం తెలియకపోవడం వల్లే అతడు విలన్ గా మారిపోయాడు. గాడ్సే మామూలుగా గాంధీకి ఫాలోవర్. స్వాతంత్య్రం వచ్చేసింది. భారత్, పాక్ విడిపోయాయి., గాడ్సే కోరుకున్న రెండూ జరిగిపోయాయి. అయినా కూడా ఎందుకు చంపాల్సి వచ్చింది. ఈ విషయాన్ని అప్పటి ప్రభుత్వం బయటకు రానివ్వలేదు. ఎందుకంటే ఆ టైమ్ లో అది కరెక్ట్ కాదు. అప్పుడప్పుడే స్వాతంత్య్రం వచ్చింది. గాంధీని జాతిపిత అని చెప్పాం. దాని తర్వాత ఆయన హత్యకు గురయ్యారు. అలాంటి పరిస్థితిలో గాంధీని ఎందుకు చంపారనే విషయాన్ని బయటకు తీసుకురావడం కరెక్ట్ కాదని భావించి తొక్కిపెట్టారు. ఏది ఏమైనా గాడ్సే దేశభక్తి విషయంలో నాగబాబు గారి వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నా. గాడ్సే కధాంశంతో ఓ సినిమా తీయబోతున్నా’’ అని వర్మ చెప్పుకొచ్చారు.