శశికళ బయోపిక్ ను పట్టాలెక్కించిన వర్మ..

Sat Nov 21 2020 22:30:20 GMT+0530 (IST)

RGV Announces Sasikala Biopic

తమిళనాడు ఎన్నికలకు సమయం దగ్గరపడడంతో దేశమంతా చూపు అటువైపు పడింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఈరోజు తమిళనాడులో పర్యటించి రాజకీయ లాబీయింగ్ చేశారు. అయితే రాజకీయాలు సినిమాల్లో ప్రతి అవకాశాన్ని ‘క్యాష్’ చేసుకునే వర్మ ఈ తమిళ రాజకీయాలను వదలుతాడా? వదలడు కదా.. అందుకే తాజాగా తమిళులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. అవినీతి కేసులో జైల్లో ఉన్న చిన్నమ్మ శశికళ బయోపిక్ ను ఏడాది కిందటే ప్రకటించిన వర్మ తాజాగా దాన్ని పట్టాలెక్కిస్తున్నట్టు ప్రకటించాడు.తెలుగులో ఇప్పటికే వర్మ తీసిన బయోపిక్ లు లెక్కలేదు. చాలా వాటిని ప్రకటించడం ఆ తర్వాత అవి అసలు సినిమాగానే రానివి చాలా ఉన్నాయి. ‘కేసీఆర్’ బయోపిక్ ప్రకటించిన వర్మ దాన్ని ఏం చేశాడో ఇప్పటికీ తెలియదు. ఇప్పుడు ఏడాది కిందట ప్రకటించిన శశికళ బయోపిక్ ను తమిళనాడు ఎన్నికల వేళ మరోసారి తెరపైకి తెచ్చాడు. బాలీవుడ్ లోనూ పలువురి బయోపిక్ లను చెక్కాడు. రాజకీయంగా సమాజంలో సంచలనమైన ప్రతి విషయాన్ని సినిమాగా తీసి ‘క్యాష్’ చేసుకునే వర్మ ఇప్పుడు తమిళనాడు ఎన్నికల వేళ కూడా అక్కడి ప్రజల ఆసక్తిని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారన్న టాక్ టాలీవుడ్ లో నడుస్తోంది.

తాజాగా తమిళనాడు పాలిటిక్స్ లో జయలలిత తర్వాత అంతటి బలీయమైన శక్తి అయిన ‘శశికళ’పై  బయోపిక్ ను మళ్లీ స్ట్రాట్ చేసినట్టు వర్మ తెలిపాడు..    ఈ జనవరిలోనే జైలు నుంచి విడుదల కాబోతున్న శశికళ తమిళ పాలిటిక్స్ ను శాసించనుంది. ఈ క్రమంలోనే ఈ వివాదాస్పద సబ్జెక్ట్ ను వర్మ టేకప్ చేయడం విశేషం.

‘తమిళనాడు నేతల మధ్య ఉన్న బంధాన్ని వారి రాజకీయ తెరంగేట్రాన్ని చూపించబోతున్నా.. తమిళనాడు ఎన్నికల కన్నా ముందు జయలలిత బయోపిక్ రిలీజ్ అయ్యే రోజునే దీన్ని కూడా విడుదల చేస్తాం’ అని ఓ ఫొటోను రాంగోపాల్ వర్మ విడుదల చేశారు.

ఇప్పటివరకు వర్మ చాలా సినిమాలు మొదలుపెట్టాడు. అవి అతీగతీ లేకుండా పోయాయి. ఇప్పుడు తమిళనాట హీట్ పాలిటిక్స్ లో ఏడాది కిందట ప్రకటించి ఆగిపోయిన శశికళ బయోపిక్ ను ఈసారి  రిలీజ్ చేస్తానని అంటున్నాడు. మరి ఇదైనా విడుదల అవుతుందా లేదా అన్నది చూడాలి.  దీనికి సైతం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాత రాకేష్ రెడ్డినే మరోసారి నిర్మాణ బాధ్యతలు నిర్వర్తిస్తుండడం విశేషం. మరి ఈ ‘శశికళ’ బయోపిక్ ఎన్ని వివాదాలు చుట్టుముట్టుకుంటుందో.. విడుదల అవుతుందో లేదో చూడాలి.