కళ్లు భైర్లు కమ్మేలా ఆయనలో నటుడు నిద్ర లేస్తాడట

Mon Jul 13 2020 10:15:19 GMT+0530 (IST)

RGV Acting As Bandla Ganesh In 'Power Star'

దర్శకరచయితగా.. పర్ఫెక్ట్ సెటైర్ కామెడీ టైమింగ్ తెలిసినవాడిగా ఆర్జీవీ ట్యాలెంట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. ఇటీవలి కాలంలో ఆయన బయోపిక్ కథల్ని ఎంచుకుని సినిమాలు తీస్తూ సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదు. అన్నగారు ఎన్టీఆర్ పైనే సినిమా తీసిన ఘనుడని అనిపించుకున్నారు. భవిష్యత్ లో టాలీవుడ్ లో పలువురు స్టార్ల జీవితకథల్ని వెండితెరకెక్కించేందుకు అతడు ఎంతమాత్రం వెనకాడబోడని అర్థమవుతోంది.తాజాగా `పవర్ స్టార్` అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఆర్జీవీ ఫస్ట్ లుక్ పోస్టర్లతోనే వేడి పెంచాడు. `ఎన్నికల తర్వాత కథ` అంటూ జనసేనాని పవన్ కల్యాణ్ రాజకీయాలపై వర్మ సెటైరికల్ సినిమా తీస్తున్నారు. ఇందులో పవన్  తో అనుబంధం ఉన్న ప్రతి పాత్రా తెరపై కనువిందు చేయబోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్- బాస్ అల్లు అరవింద్- మెగా బ్రదర్ నాగబాబు సహా పలువురిని తెరపై చూపించనున్నారు.

ముఖ్యంగా ``పవన్ కల్యాణ్ నా దేవుడు!`` అంటూ నిత్యం ఆయన నామాన్ని జపించే వీరాభిమాని బండ్ల గణేష్ పాత్ర కూడా ఉంటుందట. కేవలం కొన్ని నిమిషాల నిడివి ఉండే ఈ పాత్రను ఎంతో సెటైరికల్ గా ఫన్నీగా చూపించనున్నారట. అయితే బండ్ల గణేష్ పాత్రలో ఎవరు నటిస్తారు? అంటే.. ఇంకెవరు.. ఆర్జీవీనే ఆ పాత్రలో కనిపిస్తారట. గబ్బర్ సింగ్ నిర్మాత గా బండ్ల ఆహార్యాన్ని యథాతథంగా దించేస్తాడట ఆర్జీవీ. బండ్ల రాజకీయాల్లోకి వచ్చాక ఎలా ప్రవర్తించాడు? అన్నది కూడా తెరపైకి తెచ్చి ఫన్ క్రియేట్ చేస్తాడట. అయితే ఆ ఇద్దరి మధ్యా పోలిక ఏమిటి? అంటే.. అసలు పోలికతో పనే లేదు. బండ్లకు ప్రత్యేకమైన ఆహార్యం ఉంది. అదే ఆహార్యాన్ని యథాతథంగా ప్రాక్టీస్ చేసి నటిస్తాడట. గెస్ట్ రోల్ అయినా కానీ ఆర్జీవీ పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతాడని టీమ్ భావిస్తోందట. ఇటీవల గాయకుడిగా మారిన ఆర్జీవీ బోలెడంత మ్యాజిక్ చేశాడు. పాటతోనే బోలెడంత ఫన్ జనరేట్ చేసాడు. ఇప్పుడు నటుడిగా మరో లెవల్ చూపించబోతున్నాడన్నమాట.