షాకింగ్: రాజమౌళిని చంపేందుకు భారీ కుట్ర?

Tue Jan 24 2023 11:08:27 GMT+0530 (India Standard Time)

RGV About Conspiracy on Killing Rajamouli

ఇది నిజంగా షాకింగ్ వార్త. నెవ్వర్ బిఫోర్ హార్ట్ బ్రేకింగ్ న్యూస్. అప్పుడెపుడో మెగాస్టార్ చిరంజీవిని చంపడానికి తినే ఆహారంలో తాగే కూల్ డ్రింక్ లో విషం కలిపారని ప్రచారమైంది. కానీ దానికి చిరు ఆ తర్వాత క్లారిటీనిచ్చారు. బ్రూస్ లీని చంపడానికి అతడు తాగే మంచి నీటిలో విషం కలిపారని కూడా ప్రచారమైంది. అదంతా సరే కానీ ఇప్పుడు తెలుగు సినిమా ఖ్యాతిని వినువీధుల్లో విస్తరింపజేస్తున్న ఎస్.ఎస్. రాజమౌళిని చంపేందుకు ఈ తరహా కుట్ర పన్నారని తెలిసి షాక్ తినడం అందరి వంతు అయ్యింది. అంతేకాదు ఆయనను చంపేందుకు ఏకంగా హత్యా దళం ఏర్పాటైందట.ఇంతకీ ఈ సంగతి చెప్పింది ఎవరో తెలిస్తే ఇంకా పెద్ద షాక్ తింటారు. అంతేకాదు.. అతడు ఈ ట్వీట్లు చేసిన సమయం సందర్భం ఆరా తీస్తే ఇంకా పెద్ద షాక్ తినాలి. ఇంతకీ ఇలాంటి భయానక ట్వీట్లు వదిలిన ఆ మహానుభావుడెవరు? ఆయనకు చెయ్యెత్తి దండం పెట్టాలి!

ఆయనే ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వర్మ. గత రాత్రి RGV తన ట్విట్టర్ ఖాతాలో ఆర్జీవీ చెలరేగాడు. ''హేయ్ ఎస్.ఎస్. రాజమౌళి.. మొఘలేఅజం తీసిన కె ఆసిఫ్ నుండి షోలే తీసిన రమేష్ సిప్పీ వరకు .. ఆదిత్య చోప్రాస్.. కరణ్ జోహార్లు .. భారతదేశంలోని భన్సాలీల వంటి ప్రతి ఫిలింమేకర్ ని మీరు ప్రాథమికంగా అధిగమించారు. నేను దాని కోసం మీ చిన్న బొటనవేలును పీల్చాలనుకుంటున్నాను (నాకాలి అనుకుంటున్నా)'' అని ప్రేమను కురిపించాడు ఆర్జీవీ.

''సార్... దయచేసి మీ భద్రతను పెంచండి. ఎందుకంటే భారతదేశంలో చాలా మంది ఫిలింమేకర్స్ ఉన్నారు. వారు స్వచ్ఛమైన అసూయతో మిమ్మల్ని చంపడానికి ఒక హత్యా దళాన్ని ఏర్పాటు చేశారు. అందులో నేను కూడా భాగమే.. నేనే రహస్యాన్ని స్వయంగా బయటపెడుతున్నాను'' అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. నేను ఛార్ డ్రింక్స్ డౌన్! అని కూడా తాపీగా అసలు నిజం చెప్పారు. బాగా ఓడ్కా తాగి మత్తులో తూలుతూ తూగుతూ ఆయన ఈ ట్వీట్లు వేసారని దీంతో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది.

బాహుబలి ఫ్రాంఛైజీ ఘనవిజయంతో దేశంలోని ప్రఖ్యాత దర్శకనిర్మాతలంతా రాజమౌళి వైపు చూశారు. ఒక ప్రాంతీయ భాషా చిత్ర దర్శకుడు 2000 కోట్ల క్లబ్  లో నిలిచిన సినిమాని తీసి సత్తా చాటాడన్నది అందరిలో అసూయ పుట్టించింది. అప్పటి నుంచి బాహుబలి 2 రికార్డుల్ని కొట్టాలని అంతా కసిగా పని చేస్తున్నా ఫలితం శూన్యంగా మారింది. ముఖ్యంగా బాలీవుడ్ మెగా ఫిలింమేకర్స్ తో పాటు బడా నిర్మాణ సంస్థలు సైతం భారీ బడ్జెట్లతో పాన్ ఇండియా సినిమాలు తీసి చేతులు కాల్చుకోవడం చర్చనీయాంశమైంది. అదే క్రమంలో మరోసారి పాన్ ఇండియా లెవల్లో రికార్డులు గుర్తింపు గౌరవం తానొక్కడికే సాధ్యమని ఎస్.ఎస్.రాజమౌళి నిరూపించగలిగాడు.

ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో మరోసారి 1000 కోట్ల క్లబ్ దర్శకుడిగా సత్తా చాటారు ఎస్ఎస్ రాజమౌళి. ఈసారి కేవలం జాతీయ స్థాయిలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలోను గుర్తింపు గౌరవాన్ని సంపాదించాడు. తెలుగు సినిమాని ఊహకందని స్థాయికి తీసుకెళ్లాడు. రాజమౌళి భారతదేశంలో నంబర్ వన్ దర్శకుడు అని పిలవడానికి ఇప్పుడు ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. ఇన్నాళ్లు బిగదీసుకుని కూచుకున్న బాలీవుడ్ సినీప్రముఖులు రాజమౌళి విషయంలో స్వరం మార్చారు. అతడి కోసం అర్రులు చాస్తున్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు. ప్రస్తుతం దేశంలోని స్టార్లు అంతా అతడి ముందు మోకరిల్లేందుకు సిద్ధంగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎందరో నటీనటులు రాజమౌళితో కలిసి పని చేయాలని కలలు కంటున్నారంటే అర్థం చేసుకోవాలి.

ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్స్ బరిలో నిలిచింది. ఆస్కార్ ల తర్వాత మళ్లీ అంతటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలుగా పిలుచుకునే గోల్డెన్ గ్లోబ్ అవార్డును కొల్లగొట్టింది. ఆస్కార్ ని కూడా ఖాతాలో వేసుకోవడం ఖాయమన్న అంచనాలు వేడెక్కిస్తున్నాయి. అదే క్రమంలో రాజమౌళితో కలిసి పని చేయాలని అవతార్ సృష్టికర్త జేమ్స్ కామెరూన్ అంతటి వాడే వ్యాఖ్యానించడం సంచలనమైంది. అలాగే జురాసిక్ పార్క్ స్టీవెన్ స్పీల్ బర్గ్ నే తలదన్ని మెరిట్ చార్ట్ లో రాజమౌళి అత్యుత్తమ స్థానాన్ని సంపాదించడం కూడా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ లో చర్చనీయాంశమైంది.

ఇలాంటి అపూర్వ విజయాల తర్వాత ఇతర భారతీయ దర్శకుల్లో కచ్చితంగా అసూయ నిండి ఉంటుందని.. అభద్రతాభావం కలిగి ఉంటారని ఆర్జీవీ ఎగతాళి చేసారు. ఆయన వోడ్కా తాగి వ్యాఖ్యానించినా ఇది మాత్రం పక్కా నిజం. రాజమౌళిని హత్య చేయాలనే ప్లాన్  చాలా విచిత్రంగా ఉన్నా కానీ నిజంగానే అలాంటి ముప్పు ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదని రామూజీ డౌట్లు రైజ్ చేసాడు. ఇకపై ఏపీ ముఖ్యమంత్రి టీఎస్ ముఖ్యమంత్రికి ప్రధాని మోదీకి ఉన్నట్టు ఎక్స్ - వై- జెడ్ కేటగిరీ సెక్యూరిటీని రాజమౌళికి కూడా ఏర్పాటు చేయాలేమో!!     నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.