Begin typing your search above and press return to search.

ముగింపు దశలో 'పుష్ప ది రైజ్' .. ముందుగా చెప్పిన రోజునే రిలీజ్!

By:  Tupaki Desk   |   18 Oct 2021 3:06 AM GMT
ముగింపు దశలో పుష్ప ది రైజ్ .. ముందుగా చెప్పిన రోజునే రిలీజ్!
X
అల్లు అర్జున్ కెరియర్ ను పరిశీలిస్తే పక్కా ప్రణాళికతో ఆయన ముందుకు వెళుతున్న విషయం అర్థమవుతుంది. ఏ దర్శకుడు ఏ తరహా కథలను బాగా తెరకెక్కించగలడు? ఏ కథ తరువాత ఏ కథను సెట్స్ పైకి తీసుకుని వెళ్లాలి? అనే విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అలాగే కథ కొత్తగా .. తన పాత్ర వైవిధ్యంగా ఉండేలా ఆయన చూసుకుంటాడు. ఒక సినిమాలో కనిపించిన లుక్ తో ఆయన మరో సినిమాలో కనిపించడు. సినిమాకి .. సినిమాకి సాధ్యమైనంతవరకూ ఆయన లుక్ మారిపోతూ ఉంటుంది. ఆయన లుక్ చూసి అది ఏ సినిమా అనేది చెప్పేయవచ్చు. అంతగా ఆయన లుక్ తోనే తన సినిమాపై ఒక ప్రత్యేకమైన ముద్ర వేస్తుంటాడు.

అలా చూసుకుంటే ఇంతవరకూ బన్నీ కనిపిస్తూ వచ్చిన లుక్స్ కి .. ' పుష్ప' సినిమా లుక్ పూర్తి డిఫరెంట్ గా ఉంటుంది. ఈ కథ అడవి నేపథ్యంలో నడుస్తుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరుగుతుంది. ఎర్రచందనం దుంగలను అక్రమంగా అడవి దాటించే లారీ డ్రైవర్ గా బన్నీ కనిపిస్తాడు. సాధారణంగా ఈ పని చేయడానికి ధైర్యం కావాలి .. తెగింపు కావాలి. అలాంటివాళ్లు ఎలా ఉంటారో అలాగే బన్నీని చూపించే ప్రయత్నాన్ని సుకుమార్ చేశాడు. దాంతో ఫస్టులుక్ తోనే ఈ సినిమా ఫస్టు మార్కులను సంపాదించుకుంది. అమాంతంగా అంచనాలు పెంచుకుంది.

మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా రష్మిక కనువిందు చేయనుంది. కథాకథనాల్లో బలం .. పాత్రలను అనుకున్నట్టుగా ఆవిష్కరించడానికి అవకాశం ఉండటంతో, ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగం ఈ దసరాకి వచ్చేస్తుందని అనుకున్నారు .. నిజానికి వచ్చేది కూడా. కానీ ఎప్పటికప్పుడు కరోనా అవరోధాలు సృష్టిస్తూ రావడంతో షూటింగు విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఆ తరువాత వర్షాల కారణంగా షెడ్యూల్ దెబ్బతినడం .. సుకుమార్ కి ఫీవర్ రావడం ఇలాంటి కారణాలు కూడా ఈ సినిమా షూటింగుకి అంతరాయం కలిగించాయి.

అందువలన దసరాకి ఈ సినిమాను బరిలోకి దింపలేకపోయారు. లేకపోతే పుష్పరాజ్ ఈ పండగకి దుమ్మురేపేసేవాడే. ఇక ఈ సినిమా ఎప్పుడు వస్తుందో .. ఏమిటో అనే నిరాశకి అభిమానులు లోను కాకుండా, డిసెంబర్ 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆ దిశగానే చకచకా పనులు జరుగుతున్నాయి. ఫస్టు పార్టుకు సంబంధించిన షూటింగు దాదాపు పూర్తయినట్టేనని చెబుతున్నారు. నవంబర్ నాటికి అన్ని పనులు పూర్తి చేసి, డిసెంబర్లో విడుదలకు సిద్ధంగా ఉండేలా చేస్తారట. ఆ ప్రణాళిక ప్రకారమే అంతా జరుగుతోందని అంటున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళుతుందని సుకుమార్ చెప్పాడు. ఇప్పటికే వదిలిన 'దాక్కో దాక్కో మేక' .. ' శ్రీవల్లి' పాటలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతుండటం చూస్తుంటే, సుకుమార్ చెప్పింది నిజమేనని అనిపిస్తోంది. ఆ మధ్య వదిలిన ఫహద్ ఫాజిల్ లుక్ .. ఇటీవల వదిలిన రష్మిక లుక్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమా నుంచి వదులుతున్న ఒక్కో అప్ డేట్ మరింతగా అంచనాలు పెరిగేలా చేస్తోంది. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి.