ఫారెస్ట్ లోనే కాదు .. ఫారిన్ లోను 'పుష్ప' హల్ చల్!

Mon Jan 25 2021 12:10:51 GMT+0530 (IST)

Pushpa Movie Shooting Updates

సుకుమార్ లెక్కల మాస్టారు అనే సంగతి తెలిసిందే. అందువల్లనే ఆయన కథల్లోను కొన్ని లెక్కలు ఉంటాయి .. ఆ లెక్కల ప్రకారమే ఆయన ముందుకు వెళుతుంటాడు. కథ .. కథనం .. పాత్రలను తీర్చిదిద్దే విషయంలో ఎక్కడా అయోమయం లేకుండా .. గందరగోళం లేకుండా ఆయన చాలా నీట్ గా ప్లాన్ చేసుకుంటాడు. ప్రేక్షకుడు ఎక్కడ ఏది ఊహిస్తాడో అక్కడ అది జరగకుండా ఆయన తన ప్రత్యేకత చూపిస్తాడు. అందువల్లనే భారీ విజయాలు ఆయన అడ్రెస్ తెలుసుకుని మరీ వస్తున్నాయి. వరుస హిట్లతో జోరుమీదున్న సుకుమార్ ఆ ఖాతాలో 'పుష్ప'ను చేర్చడం కోసం రంగంలోకి దిగాడు.



మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఎర్రచందనం అక్రమరవాణా నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. అందువలన సినిమా అంతా అడవి నేపథ్యంలోనే నడుస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ కథలో కొంత భాగం ఫారిన్ లోను నడవనుందనేది తాజా సమాచారం. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న షెడ్యూల్ పూర్తికాగానే ఆ తరువాత షెడ్యూల్ షూటింగు కోసం ఈ సినిమా టీమ్ ఫారిన్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అక్కడి ట్విస్టుతోనే ఇక్కడి అడవుల్లో అసలు కథ మొదలవుతుందని అంటున్నారు.

ఇదంతా చూస్తుంటే బన్నీ పాత్రలో మరో కోణం కూడా ఉందనే విషయం అర్థమవుతోంది. ఆయన మరో లుక్ లోను కనిపించే అవకాశం లేకపోలేదని అనిపిస్తోంది. ఫారెస్టుకు .. ఫారిన్ కి ఉన్న సంబంధం ఏమిటి? బన్నీ పాత్రలోని వేరియేషన్స్ ఎలాంటివి? అనేవి ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారాయి. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. బన్నీ కెరియర్లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లను సాధించడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు.