Begin typing your search above and press return to search.

స్పెషల్ స్టోరీ : 'మాస్ కా బాప్' పూరీ...!

By:  Tupaki Desk   |   28 Sep 2020 4:30 PM GMT
స్పెషల్ స్టోరీ : మాస్ కా బాప్ పూరీ...!
X
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకరు. హీరో క్యారెక్టర్‌ ను ఎలివేట్ చేయడంలో హీరోయిజం చూపించడంలో తనకు సాటి లేరని నిరూపించుకున్నాడు పూరీ. సీనియర్ హీరోల నుంచి యువ హీరోల వరకు అందరిని డైరెక్ట్ చేసిన పూరీ.. వారి కెరీర్లోనే గుర్తుండిపోయే సినిమాలను అందించాడు. పక్కా మాస్ చిత్రాల దర్శకుడిగా పేరొందిన పూరీ.. రియల్ లైఫ్ లో తాను ఎలాంటి ఆటిట్యూడ్ చూపిస్తుంటాడో అదే తన సినిమాల్లో హీరో మేనరిజంగా సెట్ చేస్తుంటాడు. పూరీ సినిమాల్లో హీరో అంటే కార్పొరేట్ కంపెనీ సీఈఓ గానో.. గోల్డెన్ స్పూన్ తో పుట్టిన వాడుగానో.. సూటు బూటు వేసుకొని కాస్ట్లీ కార్లలో తిరుగుతూ కనిపించడు. పూరీ హీరో అంటే మన పక్కింటి కుర్రాడు.. మీకు రెగ్యులర్ గా కనిపించే యువకుడు.. రఫ్ అండ్ టఫ్ గల్లీ పోరడు. స్టోరీ ఎలాంటిదైనా పాత్ర ఎలాంటిదైనా ప్రేక్షకుడికి నచ్చేలా వినూత్నంగా తెరకెక్కించడంలో పూరీ సిద్ధహస్తుడనే చెప్పాలి. తెలుగులోనే కాకుండా కన్నడ హిందీ భాషల్లో కూడా పూరీ అదే ఇమేజ్ ని ఏర్పరచుకున్నాడు.

పూరీ సినిమాల్లో చెప్పించే డైలాగ్స్.. నిజజీవితంలో మాట్లాడే మాటలు వింటే.. అరె పూరీ చెప్పేది నిజమే కదా అని ప్రతి ఒక్కడికి అనిపిస్తుంది. ఎందుకంటే పూరీ సూటిగా సుత్తి లేకుండా మనిషి ఎలా ఉండాలో ఉండకూడదో చెప్తుంటాడు. 'సిటీకి ఎంతోమంది కమిషనర్లు వస్తూ ఉంటారు. పోతూ ఉంటారు. కానీ చంటిగాడు లోకల్' 'కమిషనర్ కూతురైతే మొగుళ్ళు రారా' అని రవితేజ చెప్పినా.. 'నా పేరు శివమణి నాక్కొంచెం మెంటల్' అని నాగార్జున చెప్పినా.. 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగాడు' 'నేను ఎంత ఎదవనో నాకే తెలియదు' అని మహేష్ బాబు చెప్పినా ప్రేక్షకుడు తనే స్వయంగా చెప్తున్నట్లు ఫీల్ అయ్యేలా ఇంపాక్ట్ క్రియేట్ చేసాడు పూరీ. అందుకే ప్రతి హీరో ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరోతో పూరీ ఒక్క సినిమా తీసినా చాలని కోరుకుంటాడు. ఒక సినిమా తీస్తే ఇంకొక సినిమా తీయాలని ఆశిస్తారు.

తెలుగు చిత్ర పరిశ్రమకు 'బద్రి'(2000) సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన పూరీ జగన్నాథ్ అనతికాలంలోనే స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' 'ఇడియట్' 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి' 'శివమణి' 'సూపర్' 'పోకిరి' 'దేశముదురు' 'చిరుత' 'బుజ్జిగాడు' 'నేనింతే' 'బిజినెస్ మ్యాన్' 'హార్ట్ అటాక్' 'టెంపర్' 'పైసా వసూల్' 'ఇస్మార్ట్ శంకర్' వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. అమితాబ్ - నాగార్జున - మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ - రవితేజ - ప్రభాస్ - ఎన్టీఆర్ - రామ్ చరణ్ వంటి హీరోలను డైరెక్ట్ చేసిన పూరీ.. యువ హీరోలతో కూడా సినిమాలు తీసాడు. డైరెక్టర్ గానే కాకుండా ప్రొడ్యూసర్ గా మారి సినిమా నిర్మాణంలో భాగం పంచుకుంటూ వచ్చాడు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్న పూరీ జగన్నాథ్.. తనయుడు పూరీ ఆకాష్ తో 'రొమాంటిక్' అనే సినిమా నిర్మిస్తున్నాడు. కరోనా సమయంలో 'పూరీ మ్యూజింగ్స్' పేరుతో జీవిత సత్యాలను బోధిస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. 20 ఏళ్ళ సినీ ప్రస్థానంలో అద్భుతమైన చిత్రాలను అందించి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పిలవబడుతున్న పూరీ పుట్టిన రోజు నేడు(సెప్టెంబర్ 28). ఆయన మరెన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలను అందిస్తూ ఇలాంటి బర్త్ డేస్ ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ 'తుపాకీ డాట్ కామ్' పూరీ జగన్నాథ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.