విజయ్ దేవరకొండ అంత ఈజీగా ఒప్పుకుంటాడా?

Sun Jul 21 2019 10:35:42 GMT+0530 (IST)

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మహేష్ తో సినిమా చేస్తే తనకు క్యారెక్టర్ లేనట్టే అన్న తరహలో దర్శకుడు పూరి జగన్నాధ్ చెప్పడం గురించి సోషల్ మీడియాలో హీరో దర్శకుడి అభిమానుల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ఫ్లాప్స్ లో ఉన్నప్పుడే తమ హీరో పోకిరి-బిజినెస్ మెన్ ఛాన్స్ ఇచ్చాడని మహేష్ ఫ్యాన్స్ అంటుండగా ఫామ్ లో ఉన్నా కనీసం కథ వినేందుకు కూడా టైం ఇవ్వలేదని పూరి అభిమానులు ఇలా ఎవరి వెర్షన్లు వాళ్ళు వినిపిస్తున్నారు.ఇంత జరిగాక మహేష్ ఇకపై పూరితో చేయడం జరగని పనే. చిన్న ప్రకటన చేసిన డ్యామేజ్ కే సుకుమార్ ని వదులుకున్న మహేష్ ఇంత మాట అన్న తర్వాత పూరి విషయంలో సాఫ్ట్ గా ఉండటం కష్టమే. ఇదిలా ఉండగా ఇప్పుడీ జనగణమనను విజయ్ దేవరకొండతో ప్లాన్ చేసే దిశగా పూరి జగన్నాధ్ ఆలోచిస్తున్నట్టుగా ఓ వార్త తెగ షికారు చేస్తోంది

నిజానికి ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ రేంజ్ ఏంటో తేలనే లేదు. ఇవాళ నాలుగో రోజు. మొదటి వారం పూర్తి కాకుండానే ఇండస్ట్రీ హిట్ గా ప్రొజెక్ట్ చేస్తూ ప్రచారంతో ఊదరగొడుతున్నారు. పూర్తి క్లారిటీ మంగళవారానికి వచ్చేస్తుంది. వీకెండ్ అయ్యాక ఇదే రన్ కొనసాగితే ఇంకెలాంటి సందేహాలు ఉండవు. తనలో ఊర మాస్ మేకర్ ఇంకా ఉన్నాడనే క్లారిటీ మాత్రం పూరి ఈ సినిమా ద్వారా ఇచ్చేశాడు.

ఇలాంటి సమయంతో ఆచి తూచి కథలను ఎంచుకుంటున్న విజయ్ దేవరకొండ నిజంగా జనగణమనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అనేది అంత ఈజీగా తేలేది కాదు. కొంత టైం అయితే పడుతుంది. ప్రస్తుతమున్న కమిట్మెంట్స్ పూర్తి చేయడానికి విజయ్ కు ఇంకో ఏడాది పట్టేలా ఉంది. వేగంగా సినిమాలు తీసే పూరికి రెండు నెలలు ఇచ్చినా చాలు పని కానిచ్చేస్తాడు. మరి ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందో లెట్ వెయిట్ అండ్ సి.