Begin typing your search above and press return to search.

ప్ర‌ధాని మోదీకి టాలివుడ్ డైరెక్ట‌ర్ సూచ‌న‌లు..

By:  Tupaki Desk   |   21 Oct 2019 5:17 AM GMT
ప్ర‌ధాని మోదీకి టాలివుడ్ డైరెక్ట‌ర్ సూచ‌న‌లు..
X
ప‌ర్యావర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా భార‌త్‌ ను ప్లాస్టిక్ ర‌హిత దేశంగా మార్చాల‌ని - ఇందుకోసం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడ‌కాన్ని నిషేధించాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇటీవ‌ల పిలుపునిచ్చిన విష‌యం విదిత‌మే. అయితే వాతావ‌ర‌ణంలో వ‌స్తున్న మార్పుల‌కు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మాత్ర‌మే కార‌ణం కాద‌ని - దానికి చాలా కార‌ణాలు ఉన్నాయ‌ని అంటున్నారు ప్ర‌ముఖ టాలీవుడ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌. ఈ మేరకు ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీకి సోష‌ల్ మీడియా వేదిక‌గా లేఖ రాశారు.

ఆస‌క్తిక‌రంగా - పూరి త‌న రెండు పేజీల సుధీర్ఘ లేఖ‌లో వాతావ‌ర‌ణ మార్పుల‌కు గ‌ల కార‌ణాల‌ను ఆయ‌న విశ్లేషించాడు. స‌మ‌స్య‌కు గ‌ల ప‌రిష్కారాలు - అందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను కూడా సూచించాడు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం చివ‌రికి కాగిత‌పు సంచుల వాడ‌కానికి దారితీస్తుంద‌ని.. చివ‌రికి ఇది మరింత అట‌వీ నిర్మూల‌న‌ - చెట్ల నరికివేత‌కు దారి తీస్తుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

అంతేగాక ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు. కేవ‌లం సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ ను నిషేధించినంత మాత్రాన ప‌ర్యావ‌ర‌ణం బాగుప‌డ‌ద‌ని ఆయ‌న లేఖ‌లో పేర్కొన్నారు. ప్లాస్టిక్ ను ఒక్క‌సారి వాడిన త‌ర్వాత దాన్ని ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ వేయ‌డం వ‌ల్ల స‌మ‌స్య ఉత్ప‌న్న‌మ‌వుతోంద‌ని - ప‌ర్యావ‌ర‌ణాన్ని దెబ్బ‌తీస్తోంద‌ని ఆయ‌న విశ్లేషించారు. వాతావ‌ర‌ణ మార్పుల నుంచి మాన‌వాళి బ‌య‌ట‌ప‌డాలంటే ప్ర‌తీ ఒక్క‌రు విరివిగా మొక్క‌లు నాటాల‌ని ఆయ‌న సూచించారు.

అంతేగాక భూమి మీద జ‌నాభా పెర‌గ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్‌ లో ఏర్ప‌డ‌బోయే ప్ర‌మాదాల గురించి ప్ర‌భుత్వం అంద‌రికీ అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఆయ‌న కోరారు. ఇలాంటివి పాటించిన‌ట్ల‌యితే పర్యావ‌ర‌ణాన్ని ప్లాస్టిక్ నుంచి కొంత‌మేర కాపాడుకోవ‌చ్చ‌ని పూరీ జ‌గ‌న్నాథ్ ప్ర‌ధాని మోదీకి రాసిన లేఖ‌లో పేర్కొన్నారు.