పోర్చుగల్ లో బాలయ్య గర్ల్ ఫ్రెండ్ ఎవరో రివీల్ చేసిన పూరీ..!

Mon Jan 17 2022 21:06:01 GMT+0530 (IST)

Puri Jagannath In Unstoppable With NBK

బాక్సాఫీస్ బొనాంజా నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్ అవతారమెత్తిన ''అన్ స్టాపబుల్'' టాక్ షో ఓటీటీలో సంచలనం సృష్టించింది. తెలుగు డిజిటల్ వేదిక 'ఆహా' లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో.. టాప్ వ్యూయర్ షిప్ తో దూసుకుపోతోంది. సినీ ప్రముఖులను బాలయ్య తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేసే విధానం వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో imdbలో అత్యధిక రేటింగ్ నమోదు చేసిన టాక్ షోలలో స్థానం సంపాదించింది.ఇప్పటి వరకు ప్రసారమైన 'అన్ స్టాపబుల్ విత్ NBK' ఎపిసోడ్స్ అన్నీ ప్రేక్షకాదారణ తెచ్చుకోగా.. సంక్రాంతి స్పెషల్ గా ఆహాలో స్ట్రీమింగ్ అయిన ఎపిసోడ్ లో 'లైగర్' టీమ్ సందడి చేసింది. ఇందులో పంచెకట్టుతో దర్శనమిచ్చిన బాలయ్య.. డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ - సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ - నిర్మాత చార్మీ లతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ - పూరీ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

'టాక్ షో అనగానే మడి కట్టుకొని కూర్చొని.. నాలుగు ప్రశ్నలు అడిగి.. అవతలి వాళ్ళు డిప్లమ్యాటిక్ గా ఆన్సర్స్ ఇస్తుంటే వినడం నా వల్ల కాదని చెప్పా.. మరీ బలవంతం చేస్తే సరే అని ఒక కండిషన్ పెట్టా.. వచ్చిన వాళ్ళతో ఆడుకుంటానని చెప్పా' అని బాలకృష్ణ పేర్కొన్నారు. ఇండస్ట్రీలోకి రావాలని మీ సొంత ఊరు నుంచి ట్రైన్ ఎక్కినప్పుడు ఏ అమ్మాయిని చివరిసారిగా కలిశావు? అని బాలయ్య ప్రశ్నించగా.. అలాంటి విషయాలు లేవంటూ జవాబు దాటవేశారు పూరీ.

'పైసా వసూల్' షూటింగ్ పోర్చుగల్ లో జరుగుతున్నప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పగలవా? అని అడగ్గా.. 'మీకు ఇబ్బంది ఏమీ లేకపోతే.. నేను చెప్పేస్తాను' అని పూరీ అన్నారు. బాలకృష్ణ సరే అనడంతో 'పోర్చుగల్ లో నీ గర్ల్ ఫ్రెండ్ పేరు కరోలినా' అని పూరీ జగన్నాథ్ వెల్లడించారు. ఈ సందర్భంలో 'వసుంధర కార్‌వాన్ లోనే ఉంది.. లంచ్ టైమ్ లో ఏమౌతుందో' అంటూ బాలయ్య భయపడినట్టు నటించి నవ్వించారు.

పోర్చుగల్ లో షూటింగ్ విషయాలను పూరీ వెల్లడిస్తూ.. అక్కడ విపరీతమైన చలి ఉన్నప్పటికీ బాలకృష్ణ రాత్రంతా షూట్ చేశావారని.. రాత్రయితే నాలుగు పెగ్గులు వేసి 2 గంటల వరకు షూటింగ్ చేసేవారని చెప్పారు. రాత్రి అయితే చాలు మద్యంపై రకరకాల పద్యాలు పాడేవారని తెలిపారు. పూరీ జగన్నాథ్ - బాలయ్య కాంబినేషన్ లో మళ్ళీ సినిమా ఎప్పుడని ఛార్మీ ప్రశ్నించగా.. బాలకృష్ణ ఎప్పుడంటే అప్పుడే అని పూరీ అన్నారు. తాను కూడా రెడీ అని పేర్కొన్న నటసింహం.. సినిమాకు 'మామా.. ఏక్ పెగ్ లా' అనే టైటిల్ పెడుదామని సూచించారు.

'పైసా వసూల్' షూటింగ్ సమయంలో ఏదైనా చెప్పాలనుకొని నేను ఏమైనా అనుకొంటానని చెప్పలేకపోయిన విషయాలు ఏమైనా ఉన్నాయా? అని బాలయ్య ప్రశ్నించగా.. ''అలాంటివేమీ లేవు కానీ.. బాలకృష్ణ సినిమా అంటే కష్టం. ఆయనకు కోపం ఎక్కువ అని చెప్పేవాళ్లు. ఫస్ట్ డే షూటింగ్ చేసిన తర్వాత మీ మనస్తత్వం అర్ధమైంది. రెండో రోజు నుంచి నాలో ఉన్న అభిప్రాయాలన్నీ మారిపోయాయి'' అని పూరీ సమాధానమిచ్చారు. బాలయ్య - పూరి - విజయ్ దేవరకొండ - ఛార్మీల మధ్య సాగిన ఈ సరదా మాటామంతి ఎపిసోడ్ ప్రస్తుతం ఆహాలో ట్రెండింగ్ లో ఉంది.