Begin typing your search above and press return to search.

అందుకే 'అర్జున్ రెడ్డి'ని పూర్తిగా చూడలేదు: పూరి

By:  Tupaki Desk   |   16 Aug 2022 5:41 AM GMT
అందుకే అర్జున్ రెడ్డిని పూర్తిగా చూడలేదు: పూరి
X
మొదటి నుంచి కూడా పూరి జగన్నాథ్ చాలా ఫాస్టుగా సినిమాలు చేస్తూ వచ్చాడు. కథ తయారు చేసుకోవడం .. స్క్రీన్ ప్లే వేసుకోవడం .. సంభాషణలు రాసుకోవడం చకచకా పూర్తిచేస్తూ ఉంటాడు. ఒక్కోసారి కథ కూడా లేకుండా ఆయన సెట్స్ పైకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఆ స్పీడ్ ఆయనకి సక్సెస్ లు తెచ్చిపెట్టింది .. ఫ్లాపులను కూడా ముట్టజెప్పింది. 'లైగర్' పాన్ ఇండియా సినిమా కావడం వలన .. మరో నిర్మాత భాగస్వామిగా ఉండటం వలన .. పాండమిక్ కారణంగా ఆలస్యమైందంతే. లేదంటే ఈ సమయంలో మూడు సినిమాలు చేసేంత సమర్ధుడు ఆయన.

అలాంటి పూరి వరంగల్ ఈవెంట్ లో మాట్లాడటం మొదలుపెట్టగానే విజయ్ దేవరకొండ గురించి చెప్పమంటూ అభిమానుల అరుపులు .. కేకలు. ఏం చెప్పమంటారు విజయ్ గురించి అంటూ పూరి చెప్పడం మొదలుపెట్టాడు. "ఈ మధ్య సరైన సినిమాలు తీయడం లేదని .. వెనకబడిపోతున్నానని మా ఆవిడ తిట్టింది. ఒకసారి 'అర్జున్ రెడ్డి' చూడండి ఆ డైరెక్టర్ ఎంతబాగా తీశాడో .. విజయ్ అనే కుర్రాడు ఎంత బాగా చేశాడో అని చెప్పింది. అప్పటికే మా అమ్మాయితో కలిసి తను ఆ సినిమాను మూడు సార్లు చూశానని అంది.

దాంతో నేను ఆ సినిమాను ఓ 45 నిమిషాల పాటు చూశాను .. ఆ తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని లేదు. ఎందుకంటే నేను విజయ్ దగ్గరే ఆగిపోయాను .. ఆయన గురించే ఆలోచించడం మొదలుపెట్టాను.

ఈ కుర్రాడి నటనలో ఇంత నిజాయితీ ఉంది .. ఎవరితను అనుకున్నాను. అతనితో తప్పకుండా ఒక సినిమా చేయాలని అప్పుడే డిసైడ్ అయ్యాను. తన నటనలోనే కాదు .. తన మాటల్లో నిజాయితీ ఉండటం గమనించాను. అతనిని దృష్టిలో పెట్టుకుని అల్లుకున్న కథనే 'లైగర్'. విజయ్ వాళ్ల ఫాదర్ నాకు అంతకుముందు నుంచే తెలుసు.

షూటింగు సమయంలో ఆయన నన్ను కలుసుకున్నప్పుడు విజయ్ ని ఒక కొడుకులా చూసుకోమని అన్నాడు. కానీ నిజానికి విజయ్ తన డాడీని చూసుకున్నట్టుగా నన్ను చూసుకున్నాడు. నా టెన్షన్స్ లో నాకు అండగా నిలబడ్డాడు.

తనకి డబ్బులు ఇవ్వబోతే ముందుగా మీ బాకీలు తీర్చుకోండని రెండు కోట్ల రూపాయలను వెనక్కి పంపించాడు. ఎవరండీ ఈ రోజుల్లో ఇట్లా చేసేది. నిజంగా విజయ్ లాంటి హీరోను నేను ఇంతవరకూ చూడలేదు. అందుకే ఆయనకి హ్యాట్సాఫ్ చెబుతున్నాను" అంటూ ముగించాడు.