Begin typing your search above and press return to search.

పునీత్ చివరి సినిమా.. ‘జేమ్స్’ టీజర్ రిలీజ్..!

By:  Tupaki Desk   |   11 Feb 2022 11:35 AM GMT
పునీత్ చివరి సినిమా.. ‘జేమ్స్’ టీజర్ రిలీజ్..!
X
దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన ఆఖరి సినిమా ''జేమ్స్''. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం యావత్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి 17న పునీత్ జయంతిని పురస్కరించుకుని ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేసిన స్పెషల్‌ పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంది. ఈ క్రమంలో టీజర్ ను చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా లాంచ్ చేసింది.

"ఈ ప్రపంచంలో మొత్తం మూడు మార్కెట్లు ఉన్నాయి. ఓపెన్ మార్కెట్ - డీప్ మార్కెట్ - డార్క్ మార్కెట్.. ఇది వరల్డ్ మాఫియా" అనే డైలాగ్ తో ‘జేమ్స్’ టీజర్ ప్రారంభమైంది. అయితే డార్క్ వరల్డ్ మాఫియాని నిర్మూలించడానికి 'జె వింగ్స్' అనే ఏజెన్సీ కోసం పనిచేసే భద్రతా అధికారి జేమ్స్‌ ను ప్రభుత్వం నియమించింది. జేమ్స్ మాఫియాను ఎలా ఎదుర్కొన్నాడు? ఎలా అంతం చేసాడు? అనేది సినిమా యొక్క ప్రధాన అంశంగా కనిపిస్తుంది.

మాఫియా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమాలో ప్రియా ఆనంద్‌ హీరోయిన్‌ గా నటించింది. ఇందులో శ్రీకాంత్‌ - శరత్ కుమార్ - ఆదిత్య మీనన్ - అను ప్రభాకర్ కీలక పాత్రల్లో కనిపించారు. పునీత్ సోదరులు రాఘవేంద్ర రాజ్ కుమార్ - శివరాజ్ కుమార్ అతిథి పాత్రలు పోషించారు. పునీత్ ఈ చిత్రంలో స్టైలిష్ గా పూర్తిగా డాషింగ్‌ గా కనిపించాడు. సూపర్ యాక్షన్ సీన్స్ తో కూడిన 'జేమ్స్' టీజర్ అలరిస్తోంది.

'గన్స్ తో నిలబడే వందమంది కంటే గలాంటివాడిని ఒక్కడిని వెతికి తీసుకురండి. ఎదురు నిలబడి కాపాడటం తెలుసుండాలి. ఎదురొచ్చే గుండెలో బుల్లెట్ దింపడం తెలుసుండాలి' అంటూ శ్రీకాంత్ చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. 'నాకు మొదటి నుంచి రికార్డ్స్ బ్రేక్ చేయడమే అలవాటు' అంటూ టీజర్ చివర్లో పునీత్ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్ కు ఓవైపు సంతోషాన్ని మరోవైపు భావోద్వేగాన్ని కలిగిస్తోంది.

'జేమ్స్' చిత్రానికి చేతన్ కుమార్ దర్శకత్వం వహించగా.. కిశోర్ పత్తికొండ భారీ బడ్జెట్ తో నిర్మించారు. చరణ్ రాజ్ సంగీతం సమకూర్చారు. రవి వర్మ మరియు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ డిజైన్ చేశారు. ఈ సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత పునీత్ కన్నుమూశారు. దీంతో పునీత్ పాత్రకు ఆయన సోదరుడు శివరాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పారు.

ముగ్గురు అన్నదమ్ములు స్క్రీన్ షేర్ చేసుకున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.