Begin typing your search above and press return to search.

డొనేషన్లలో ఈ కోణం కూడా ఉందా?

By:  Tupaki Desk   |   2 April 2020 12:13 PM GMT
డొనేషన్లలో ఈ కోణం కూడా ఉందా?
X
కాదేదీ కవితకనర్హం అన్నారు ఆనాటి మహాకవి శ్రీశ్రీ. కాదేదీ ప్రచారానికి అనర్హం అని నిరూపిస్తున్నారు ఈనాటి కొందరు సెలబ్రిటీలు. విషయంలోకి వెళ్తే.. కరోనా సృష్టించిన విలయం అన్ని దేశాలను తాకింది.. అన్ని రంగాలను అతలాకుతలం చేసింది. మన తెలుగు రాష్ట్రాలు కూడా అందుకు మినహాయింపేమీ కాదు. సహజంగా ఏదైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సెలబ్రిటీలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వంతు సాయం ప్రకటిస్తారు. కానీ ఈసారి పరిస్థితి ఎలా ఉందంటే సెలబ్రిటీలు తమ వంతు విరాళాలు ప్రకటించే లోపే వారిపై అటు నెటిజన్ల నుంచి.. ఇటు సాధారణ ప్రజల నుంచి సాయం ప్రకటించాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. ఇలాంటి ప్రకృతి విపత్తు ఎన్నడూ చూడనిది కాబట్టి సెలబ్రిటీలు తప్పనిసరిగా తమ సాయం ప్రకటించాలని.. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలని.. తమ సామాజిక బాధ్యతను నెరవేర్చాలని అందరూ కోరుతున్నారు. ఇదిలా ఉంటే ఈ డిమాండ్ కు సంబంధం లేకుండా విరాళాలు ఇచ్చేవారు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే కొందరు సెలబ్రిటీలు సాయం ప్రకటించడం లో కూడా ఒక కొత్త కోణం ఉందన్న విషయం బయటకు వచ్చింది.

జనాల ఒత్తిడి తో కొంతమంది హీరోలు తమ సాయం ప్రకటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ స్టార్ హీరో ఈమధ్య కరోనా బాధితులకు భారీగా సాయం ప్రకటించారు. ఈ విషయం గురించి హీరో సన్నిహితులతో మాట్లాడినప్పుడు.. "మీ హీరో గారు భారీగా ఇచ్చారుగా" అంటే.. "ఈ రేంజ్ లో పబ్లిసిటీ మళ్లీ మళ్లీ వస్తుందా ఏంటి?" అని పెద్దగా నవ్వేశాడు ఆయన. అంటే దీన్నిబట్టి హీరోలు ఈ విరాళాలను తన ఇమేజ్ పెంచుకోవడానికి.. తమ బ్రాండ్ ప్రచారానికి తాము పెట్టే పెట్టుబడి అని అర్థం. ఇది తెలిసిన వారెవరైనా సుమ అక్క లాగా అవాక్కు అవకుండా ఉండడం అసాధ్యం.

దీని సంగతి పక్కన పెడితే కరోనా బాధితులకు ఏ రూపంలోనైనా సహాయం చేసిన వారికి దక్కిన ప్రచారం లేదా క్రెడిట్ అందరికీ సమానంగానే ఉంది. కోటి రూపాయలు ఇచ్చిన హీరోకు అదే పేరు.. లక్ష రూపాయలు ఇచ్చిన వారికి అదే క్రెడిట్. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు.. ఎవరు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.. లేదు.. అన్నది ప్రధానాంశంగా ఉంది.