Begin typing your search above and press return to search.

టాలీవుడ్ ని రెండుగా విభజించాల‌న్న ప్రొఫెస‌ర్

By:  Tupaki Desk   |   28 Oct 2021 8:30 AM GMT
టాలీవుడ్ ని రెండుగా విభజించాల‌న్న ప్రొఫెస‌ర్
X
ఏపీ - తెలంగాణ విభ‌జ‌న అనంత‌రం టాలీవుడ్ త‌ర‌లింపు అంశం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. టాలీవుడ్ ని పాలించేది మెజారిటీ భాగం ఆంధ్ర ప్ర‌దేశ్ కి చెందిన సినీప్ర‌ముఖులేన‌ని వాదించిన తెలంగాణ జేఏసీ టీ-క‌ళాకారుల‌కు టాలీవుడ్ లో ప్రాధాన్య‌త లేద‌ని ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసింది.

ఇప్పుడు విభ‌జించి ఏడేళ్లు అయినా అదే ప‌రిస్థితిలో తెలంగాణ క‌ళాకారులు ఉన్నార‌ని తాజా మీడియా స‌మావేశంలో ఉస్మానియా `లా` క‌ళాశాల ప్రిన్సిప‌ల్ ప్రొఫెస‌ర్ వినోద్ కుమార్ ఆవేద‌న చెంద‌డం మ‌రోమారు ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. తెలంగాణ క‌ళాకారుల‌కు టాలీవుడ్ లో 50శాతం ప్రాతినిధ్యం క‌ల్పించాల‌ని ఆయ‌న కోరారు. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం 48 శాతం తెలంగాణ క‌ళాకారుల‌కు అవ‌కాశాలు క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు. సినీప‌రిశ్ర‌మ అభివృద్ధి కోసం నాడు సినిమా వాళ్ల‌కు హైద‌రాబాద్ లో స్థ‌లాలు ఇచ్చార‌ని వాటిలోనూ తెలంగాణ క‌ళాకారుల‌కు వాటా కావాల‌ని అన్నారు. సుంద‌ర‌య్య విజ్ఞాన కేంద్రంలో జ‌రిగిన తెలంగాణ టీవీ మూవీ అభివృద్ధి జేఏసీ స‌మావేశంలో దీనిపై చ‌ర్చా గోష్టి నిర్వ‌హించ‌గా మెజారిటీ వ‌ర్గాలు ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశాయి. చిత్ర‌పురి కాల‌నీలో వేల కోట్ల అవినీతి జ‌రిగింద‌ని అలాగే మూవీ ఆర్టిస్టుల సంఘం వ‌ల్ల తెలంగాణ పేద‌ క‌ళాకారుల‌కు.. కార్మికుల‌కు ఒరిగిందేమీ లేద‌ని కూడా ప్రొఫెస‌ర్ వినోద్ కుమార్ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసారు.

నిజానికి విభ‌జ‌న వేళ‌ ప్రొఫెస‌ర్ ఆరోప‌ణ‌ల‌కు పూర్తి విరుద్ధంగా గులాబీ అధినేతలు .. సీఎం కేసీఆర్- మంత్రి కేటీఆర్ ఆలోచ‌న‌లు సాగాయి. తెలుగు సినీప‌రిశ్ర‌మ ఎటూ త‌ర‌లిపోకూడ‌ద‌ని అన్నివిధాలా ప‌రిశ్ర‌మ‌కు భ‌రోసాను క‌ల్పించారు. కేసీఆర్ - కేటీఆర్ బృందాలకు టాలీవుడ్ త‌ర‌లివెళ్లిపోవ‌డం ఎంత‌మాత్రం ఇష్టం లేదు. ఆ కార‌ణంగానే జేఏసీ ఉద్య‌మాలు నీరుగారిన సంగ‌తి తెలిసిన‌దే. ప్ర‌స్తుతం మ‌రోసారి 50శాతం కావాలి! అన్న ఆరోప‌ణ‌లు మొద‌లైన క్ర‌మంలో దీనిపై తెలంగాణ‌ క‌ళాకారులు ఉద్య‌మ‌బాట‌ను అనుస‌రిస్తే ఏం జ‌ర‌గ‌నుందోన‌న్న చ‌ర్చా ఫిలింస‌ర్కిల్స్ లో మొద‌లైంది.

`మా` అసోసియేష‌న్ రెండుగా చీలాల‌న్న‌ సీవీఎల్

తెలంగాణ సినీ ప‌రిశ్ర‌మకు అండ‌గా.. కార్మికుల సంక్షేమ స‌హ‌కారం కోసం ఏర్పాటైన తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ గ‌త 7 సంవ‌త్స‌రాలుగా విజ‌యవంతంగా ముందుకు సాగుతోంది. 8000 మంది సినీ కార్మికుల‌తో 800 ప్రొడ్యూస‌ర్స్ తో 400 మంది టీ -మా ఆర్టిస్టులతో అభివృద్ధి ప‌థంలో ముందుకు న‌డుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు టిఎఫ్ సిసి ద్వారా 140 సినిమాలు సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ అయ్యాయి. నిర్మాత‌ల‌కు అత్యంత సులువుగా ప్రాసెస్ జ‌రిపే సంస్థ‌గా టిఎఫ్ సిసి ప్రాచుర్యం పొందింది. లాక్ డౌన్ స‌మ‌యంలో కార్డు ఉన్నా లేక‌పోయినా 20వేల సినీ కార్మికుల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులు ఆర్థిక స‌హాయం అందించారు. అంతేకాకుండా టిఎఫ్‌సిసి ద్వారా ప్ర‌తి సంవ‌త్స‌రం ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. టిఎఫ్ సిసి సంస్థ‌లో 15మంది వ‌ర‌కు ఉద్యోగులు ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్ర‌ ప్ర‌భుత్వాల స‌హ‌కారంతో పెద్ద ఎత్తున సినిమా అవార్డుల ఫంక్ష‌న్ ను టిఎఫ్ సిసి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌నున్నారు. ఇక‌ ప్ర‌స్తుతం 30 మందితో కూడిన‌ టిఎఫ్‌సిసి పాల‌క‌ క‌మిటీ గ‌డువు ముగియ‌నుండ‌టంతో న‌వంబ‌ర్ 14న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మ‌రో రెండు రోజుల్లో ఎన్నిక‌ల షెడ్యూల్ ను ఎల‌క్ష‌న్ ఆఫీస‌ర్ తెలియ‌జేయ‌నున్నారు.

డివైడ్ ఫ్యాక్ట‌ర్ దేనికీ.. ప్ర‌తి విమ‌ర్శ‌లు ఎదుర్కోవాలి!

ఆర్టిస్టులు అంటే ప్రాంతీయ విభేధం ఉండ‌కూడ‌ద‌ని అంటారు. ఇరుగు పొరుగు నుంచి వ‌చ్చి టాలీవుడ్ లో పాగా వేసిన ఆర్టిస్టులు ఎంద‌రో. కానీ ఏపీ - తెలంగాణ అంటూ స్థానిక ఆర్టిస్టులే వేరు కుంప‌టి పెట్టుకుని క‌లిసి బ‌త‌క‌లేక.. క‌లుపుకోలేక స‌త‌మ‌త‌మ‌య్యేవారి ప‌రిస్థితిపై ఇటీవ‌ల తెలుగు నిర్మాత‌ల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. కానీ ఇప్పుడు మ‌రోమారు డివైడ్ ఫ్యాక్ట‌ర్ ని తెర‌పైకి తేవ‌డం ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. ముఖ్యంగా మెజారిటీ భాగం ఆంధ్రా నిర్మాత‌లే ఇక్క‌డ సినిమాలు తీస్తుంటే .. ఇప్పుడు తెలంగాణ ఆర్టిస్టులు పేరుతో డివైడ్ ఫ్యాక్ట‌ర్ ని తెర‌పైకి తెస్తున్న కొంద‌రిపై చాలా సందేహాలున్నాయ‌ని చెబుతున్నారు. ఇంత‌క‌ముందు మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ని రెండుగా చీల్చాలంటూ తెలంగాణ సీనియ‌ర్ న‌టుడు కం న్యాయ‌వాది సీవీఎల్ ప్ర‌య‌త్నించి చివ‌రికి డ్రాప‌య్యారు. కానీ ఈ త‌ర‌హాలో విభ‌జ‌న ఆలోచ‌న‌లు రాజ‌కీయాలు ఇక్క‌డ ఎప్ప‌టికీ వీడ‌వ‌ని ప‌లువురు తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. ఏపీ అయినా తెలంగాణ అయినా ఆర్టిస్టుల్లో డివైడ్ అవ‌స‌ర‌మా? అంటూ కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. టాలీవుడ్ ని క‌ళాకారుల్ని రెండుగా డివైడ్ చేయాల‌న్న ఆలోచ‌న స‌రైన‌దేనా? అన్న చ‌ర్చా మరోసారి వేడెక్కించ‌నుంది.