Begin typing your search above and press return to search.

ప్రొడ్యూసర్స్ బయటపడాలంటే ఆ పద్ధతి పాటించాల్సిందే...!

By:  Tupaki Desk   |   1 Oct 2020 1:30 AM GMT
ప్రొడ్యూసర్స్ బయటపడాలంటే ఆ పద్ధతి పాటించాల్సిందే...!
X
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా గత ఆరున్నర నెలలుగా థియేటర్స్ మూతబడి ఉన్నాయి. దీంతో సినీ ప్రేక్షకులు వినోదానికి దూరమయ్యారు. కాకపోతే డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ప్రేక్షకులకు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. అయితే అన్ లాక్ 5.0 లో భాగంగా కొన్ని షరతులతో థియేటర్స్ రీ ఓపెన్ చేసుకోడానికి కూడా అనుమతి లభించనుందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ థియేటర్స్ తెరచుకుంటే ఎప్పటిలా జనాలను థియేటర్స్ కి రప్పించడం ఫిలిం మేకర్స్ కి ఛాలెంజింగ్ అంశమనే చెప్పాలి. అయితే థియేటర్స్ తెరిచాక పెద్ద సినిమాలు రిలీజ్ చేస్తే మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రేక్షకులు థియేటర్స్ కు క్యూలు కడతారు.

ఉదాహరణకు ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమా తీసుకుంటే.. ఈ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేస్తే పవర్ స్టార్ క్రేజ్ దృష్ట్యా ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారు. కాకపోతే ఒకప్పటిలా ఓపెనింగ్ వీక్ కలెక్షన్స్ చూసుకోకుండా.. సినిమా పూర్తిగా వసూళ్లు రాబట్టే వరకు థియేటర్స్ లో నడిపించాల్సి వస్తుంది. దీనికి మిగతా ప్రొడ్యూసర్స్ కూడా సహకరించి కొన్ని వారాలు పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంతే వారం వారం కొత్త సినిమా అనే ప‌ద్ధ‌తి కాకుండా.. ప్ర‌తి సినిమా విడుద‌ల‌కి క‌నీసం రెండు వారాలు గ్యాప్ ఇవ్వాలి అనే పాత రోజుల పద్ధతి పాటించాల్సి ఉంటుంది.

అలా కాకుండా ఇప్పటి వరకు కొనసాగిన పద్ధతి ప్రకారమే థియేట‌ర్స్ తెరిచారు కదా అని వారానికో కొత్త సినిమా అంటూ చిన్న సినిమాలను బ‌ల‌వంతంగా విడుద‌ల చేయిస్తే మొద‌టికే మోసం వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో కొన్నాళ్లపాటు క్రేజీ మూవీస్ మాత్రమే ఆడియన్స్ ని థియేటర్స్ దాకా నడిపించగలవు. అదే థియేటర్లలో సరైన బొమ్మ పడకపోతే.. మంచి సినిమాలు రావడం లేదంటూ ఆడియెన్స్ ఇతర ఎంట‌ర్టైన్మెంట్ మార్గాలను చూసుకుంటారని సినీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇప్పటికే జనాలు ఓటీటీలకు అలవాటు పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్స్ కి ప్రేక్షకులను రప్పించగలిగే సినిమాలను మాత్రమే రిలీజ్ చేయాలని సూచిస్తున్నారు. మరి దీనిపై ఫిలిం మేకర్స్ ఏ విధంగా ఆలోచిస్తారనేది చూడాలి.