Begin typing your search above and press return to search.

బర్త్ డే స్పెషల్ గా 'మహాసముద్రం' నుంచి శర్వా ఫస్ట్ లుక్..!

By:  Tupaki Desk   |   6 March 2021 4:23 AM GMT
బర్త్ డే స్పెషల్ గా మహాసముద్రం నుంచి శర్వా ఫస్ట్ లుక్..!
X
టాలీవుడ్‌ లో జయాపజయాలతో సంబంధం లేకుండా వర్సటైల్ హీరో శర్వానంద్ వైవిధ్యమైన సినిమాలను విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. శర్వా లైన్ లో పెట్టిన సినిమాలలో ''మహా సముద్రం'' ఒకటి. 'Rx 100' ఫేమ్ అజయ్ భూపతి ఈ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ని తెరకెక్కిస్తున్నాడు. నేడు శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్‌ ను విడుదల చేశారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో శర్వానంద్ చేతిలో ఓ రాడ్ పట్టుకొని అగ్రేషివ్ మూడ్ లో సీరియస్ లుక్ లో కనిపిస్తున్నాడు. దర్శకుడు అజయ్ భూపతి ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా.. హై ఇంటెన్స్ రోల్ లో శర్వా ను చూపించనున్నారని అర్థం అవుతోంది. ఈ సినిమా సముద్రపు నేపథ్యంలో సెట్ చేయబడిందని ఈ పోస్టర్ ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది. దీనికి చైతన్య భరద్వాజ్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది.

ఇకపోతే 'మహాసముద్రం' సినిమాలో శర్వానంద్ తో పాటు 'బొమ్మరిల్లు' సిద్ధార్థ్ కూడా నటిస్తున్నాడు. ఇందులో అదితి రావు హైదరి - అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాజ్ తోటా సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా.. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. కొల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ ప్రాంతంలో జరుపుకుంటోంది. 'మహాసముద్రం' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 19న విడుదల చేయనున్నారు.