ఆ టైంలో గాయమైనా ఎన్టీఆర్ షూటింగ్ చేసాడు

Thu Jun 17 2021 09:00:02 GMT+0530 (IST)

Producer Radhakrishna About NTR

సినిమా షూటింగ్స్ లో హీరోలు గాయపడటం గురించి వింటూనే ఉంటాం. షూటింగ్స్ అన్నాక సాధారణంగా గాయాలు జరుగుతూనే ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే గాయపడినప్పుడు యాక్టర్స్ రెస్పాన్స్ ఏంటనేది ప్రేక్షకులు తెలుసుకోవడానికి ఆరాటపడుతూ ఉంటారు. అయితే కొందరు హీరోలు షూటింగ్ సమయంలో చిన్నగాయం జరిగినా ఆ డే షూటింగ్ కాన్సల్ చేసేస్తుంటారు. కానీ కొందరు హీరోలు మాత్రమే గాయపడినా నిలబడి షూటింగ్ పూర్తి చేయడానికి సహకరిస్తుంటారు. అలాంటి టాలీవుడ్ హీరోలలో ఒకరు యంగ్ టైగర్ ఎన్టీఆర్.

సినిమా విషయంలో ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటాడు. ముఖ్యంగా అభిమానులను సంతృప్తి పరచడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. ఇదివరకే ఈ విషయం చాలాసార్లు రుజువైంది. కానీ షూటింగ్ లో గాయపడి కూడా షూటింగ్ విజయవంతంగా పూర్తి చేసిన విషయం మాత్రం తాజాగా 'అర్ధశతాబ్దం' సినిమా ప్రొడ్యూసర్ రాధాకృష్ణ బయటపెట్టాడు. నిజానికి రాధాకృష్ణ తెలుగు ఇండస్ట్రీలో నటుడుగా కూడా చాలా సినిమాల్లో కనిపించాడు. కానీ చేసినవన్నీ సైడ్ క్యారెక్టర్స్ కావడంతో పెద్దగా వెలుగులోకి రాలేదు. మధ్యలో అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరంగా బిజినెస్ వైపు మళ్ళినట్లు చెప్పాడు.

అయితే ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. "జూనియర్ ఎన్టీఆర్ పుట్టుకతోనే ఆర్టిస్ట్. ఎలాంటి రోల్ ఇచ్చినా ఇట్టే క్యారీ చేసేస్తాడు. ఒకసారి డైలాగ్స్ పేపర్ ఇచ్చేస్తే మళ్లీ రీటేక్స్ అనేది ఉండదు. షూటింగ్ లో అందరితో జోవియల్ గా ఉంటాడు. అయితే ఆది సినిమా క్లైమాక్స్ షూటింగ్ సమయంలో ఓ ఫైట్ సీన్ ఉంది. ఆ సీన్ గోల్కొండ హైస్కూల్ లో షూట్ చేస్తున్నారు. ఆ సమయంలో చేతికి గ్లాస్ గుచ్చుకొని గాయమైంది. వెంటనే అక్కడినుండి వెళ్లి స్టిచెస్ వేయించుకొని వచ్చి షూటింగ్ కంప్లీట్ చేసాడు. మరి అలాంటి డెడికేషన్ ఎన్టీఆర్ ది." అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు.