రాజుగారు పక్కన పెట్టేశారా? లేక మరిచారా?

Fri May 13 2022 08:00:01 GMT+0530 (IST)

Producer MS Raju

ఇండస్ట్రీలో ఆయన సంక్రాంతి రాజు. ఆయన సంక్రాంతి బరిలో విడుదల చేసిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టరే. దాంతో ఆయన పేరు సంక్రాంతి రాజుగా ముద్ర పడిపోయింది. అంతే కాకుండా బిగ్ స్టార్లతో వరుసగా హిట్ లు సూపర్ హిట్ లు బ్లాక్ బస్టర్ లు అందించిన హిస్టరీ ఆయనది. కానీ టైమ్ మారింది. కథ అడ్డం తిరిగింది. ఇప్పడు ఆయనే డైరెక్ట్ చేసుకునే స్థాయికి వచ్చేసింది. ఆయన మరెవరో కాదు ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ ఎం.ఎస్. రాజు.  శత్రువు నుంచి నువ్వొస్తానంటే నేనొద్దంటానా వరకు వరుసగా భారీ హిట్ లని అందించారు. వరుస సూపర్ హిట్ లతో నిర్మాతగా తిరుగులేదనిపించుకున్నారు. ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా పాపులర్ అయ్యారు. తన సినిమాల కథ చర్చల్లోనూ పాల్గొంటూ విలువైన ఇన్ పుట్స్ ని అందించడమే కాకుండా స్క్రీన్ ప్లే రైటర్ గానూ సూపర్ అనిపించుకున్నారు. అంతే కాకుండా తన సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లోనూ దర్శనమిచ్చి నిర్మాతగా ఇక ఈయనకు తిరుగులేదని సగటు ప్రేక్షకుడిచేత అనిపించుకున్నారు.

కానీ అది ఎంతో కాలం నిలబడలేదు. అప్పట్లో ఎం.ఎస్ రాజు సినిమా అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి వుండేది. ఆ మార్కుని సొంతం చేసుకున్నారు. కానీ ఆయన చేసిన ప్రయోగాలే ఆన క్రేజ్ ని కోల్పోయేలా చేశాయి. దీంతో డైరెక్షన్ బాట పట్టారు. అక్కడి నుంచి ఎం.ఎస్. రాజుకు అసలు డౌన్ ఫాల్ మొదలైంది. తొలి సారి డైరెక్ట్ చేసిన `వాన`. తూనీగ తూనీగ` ఎం.ఎస్. రాజు కు భారీ నష్టాలని మిగిల్చాయి. అంతకు ముందు ప్రభాస్ తో చేసిన `పౌర్ణమి` మరింత ఊబిలోకి నెట్టింది.

అక్కడి నుంచి వెనుదిరిగిన ఎం.ఎస్. రాజు దర్శకుడిగా బండి లాగిస్తున్నారు. `డర్టీ హరి`తో హల్ చల్ చేసిన ఆయన ఆ తరువాత అదే ఊపుతో `7 డేస్ 6 నైట్స్` అంటూ సుమంత్ హీరోగా ఓ సినిమాని ప్లాన్ చేశారు. దీనికి బిజినెస్ జరగలేదో లేక సినిమానే బాగా రాలేదో తెలియదు కానీ కొన్ని నెలలుగా దీని ఊసే ఎత్తడం లేదు. బోల్డ్ కంటెంట్ ని నమ్ముకుని చేసిన ఈ సినిమా ఇప్పటికీ బయటికి రావడం లేదు. దాని ఊసే ఎత్తడం లేదు.

`7 డేస్ 6 నైట్స్` ని  పక్కన పెట్టి కొత్తగా సుమంత్ అశ్విన్ తో `సతి` అనే సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. కానీ `7 డేస్ 6 నైట్స్` సినిమా గుట్టు మాత్రం విప్పకపోవడంతో ఆ సినిమా ఏది రాజు గారు అని నెటిజన్ లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఆ సినిమాని ఎం.ఎస్. రాజు బయటికి తీస్తాడో లేదో చూడాలి.