ప్రియమణి పెళ్లి వివాదం.. చట్ట విరుద్దం!

Thu Jul 22 2021 12:05:45 GMT+0530 (IST)

Priyamani marriage controversy

హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు దక్కించుకుని జాతీయ అవార్డును సైతం దక్కించుకున్న ప్రియమణి అనూహ్యంగా వివాదంలో చిక్కుకుంది. 2017 సంవత్సరంలో ముస్తఫా ను ప్రియమణి వివాహం చేసుకుంది. ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారు. ఇద్దరి మద్య ఎంతటి ప్రేమ ఆప్యాయత ఉంటుందో వారు షేర్ చేసే ఫొటోలు మరియు వీడియోలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రసుతం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ప్రియమణి ఫుల్ బిజీగా ఉంది.పలు ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ తన భర్త నుండి ఎంతో సహకారం అందుతుందని.. ఆయన వల్లే తాను ఇలా వరుసగా ప్రాజెక్ట్ లు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చేది. ఇటీవల ఆమె నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 సూపర్ సక్సెస్ అయ్యింది.. అంతే కాకుండా వెంకటేష్ తో కలిసి నటించిన నారప్ప కు కూడా అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈమె నటించిన విరాట పర్వం కూడా తప్పకుండా మంచి పేరు తెచ్చి పెడుతుందనే నమ్మకంతో వెయిట్ చేస్తుంది. ఇలాంటి సమయంలో ప్రియమణి పెళ్లి వివాదాస్పదం అవ్వడం ఆమె అభిమానులను కలచి వేస్తుంది.

ప్రియమణి పెళ్లి విషయం గత కొన్నాళ్లుగా కాస్త వివాదాస్పదంగా చర్చ జరిగింది. అయితే ఇప్పుడు ఆ విషయం మరింత ముదిరింది. ప్రియమణిని పెళ్లి చేసుకోవడానికి ముందే ముస్తాఫా.. అయేషా ను వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇద్దరు కూడా కొన్ని కారణాల విడిపోయారు. అధికారికంగా విడాకులు తీసుకోలేదు.

అయినా కూడా ఇద్దరి ఒప్పందంతో పిల్లల సంరక్షణ చూసుకుంటు ముస్తాఫా ఆర్థికంగా ఆమెకు సహాయంగా నిలుస్తున్నాడు. ప్రతి నెల ఆమె కు డబ్బు పంపిస్తు ఉన్నాడు. ఈమద్య కాలంలో అయేషా తమను ముస్తఫా పట్టించుకోవడం లేదు అంటూ ఆరోపణలు చేస్తూ వస్తోంది.

ఈ సమయంలో ఆయన నుండి తనకు సాయం చేయడం లేదంటూ మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేయడం తో వివాదం మరింతగా ముదిరింది. అయేషా ఆరోపణలను ఎప్పటికప్పుడు ముస్తఫా కొట్టి పారేస్తూ వచ్చాడు. తనకు కావాల్సిన డబ్బును రెగ్యులర్ గా పంపిస్తున్నాను అంటూ ఆయన చెబుతున్నాడు. ఆమె తన నుండి ఎక్కువ మొత్తం ఆశిస్తుందని ఆరోపిస్తున్నాడు.

ఈ విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న ఈ సమయంలోనే అయేషా మరింతగా ఈ విషయాన్ని పెద్దది చేసే ప్రయత్నం చేస్తోంది. అసలు తన నుండి విడాకులు తీసుకోని ముస్తఫా ఎలా ప్రియమణిని పెళ్లి చేసుకుంటాడు అంటూ ప్రశ్నిస్తుంది. వారిద్దరి పెళ్లి చట్ట విరుద్దం అంటూ ఆమె ఫిర్యాదు చేయడం తో పాటు మీడియా ముందుకు వచ్చి వారి పెళ్లి ని సమర్థించవద్దంటూ విజ్ఞప్తి చేసింది.

వారిద్దరిది అక్రమ పెళ్లి అంటూ అది చట్ట విరుద్దమైనది కనుక తనకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేసింది. వారి పెళ్లి నాటికి మేము కనీసం విడాకులకు దరకాస్తు పెట్టలేదు. కనుక వారిది చట్టవిరుద్దమైన పెళ్లి అంటూ అయేషా బలంగా వాదిస్తుంది. ఈ వివాదం విషయమై ప్రియమణి ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి. ముస్తఫా మాత్రం ఆమె తో చర్చించిన తర్వాతే ఆర్థికంగా ఆమెకు నెల నెల డబ్బులు పంపిస్తానంటూ చెప్పే పెళ్లి చేసుకున్నట్లుగా వాదిస్తున్నాడు.

ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి. నటిగా బిజీగా ఉన్న ఈ సమయంలో అనూహ్యంగా ప్రియమణి ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం తో ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయేషా తో ముస్తఫా వెంటనే రాజీ కుదుర్చుకోవాలని ప్రియమణి అభిమానులు కోరుకుంటున్నారు.