అప్పుడు హౌస్ అరెస్ట్ అయ్యా : ప్రియా వారియర్

Tue Jan 22 2019 19:22:59 GMT+0530 (IST)

గత ఏడాదిలో సోషల్ మీడియా సంచలనంగా నిలిచిన మలయాళి ముద్దుగుమ్మ ప్రియా వారియర్ నటించిన 'ఒరు ఆదార్ లవ్' చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ మలయాళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. తెలుగులో ఈ చిత్రంను 'లవర్స్ డే' అనే టైటిల్ తో విడుదల చేయబోతున్నారు. తెలుగులో ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల కోసం ప్రియా వారియర్ హైదరాబాద్ వచ్చింది. అల్లు అర్జున్ చీప్ గెస్ట్ గా హాజరు కాబోతున్న 'లవర్స్ డే' ఆడియో విడుదల వేడుక కోసం అంతా ఎదురు చూస్తున్నారు.హైదరాబాద్ వచ్చిన ప్రియా వారియర్ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. యూత్ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రం ఉంటుంది. స్కూల్ డేస్ లో ఉండే స్వచ్చమైన ప్రేమను ఈ చిత్రంలో చూడవచ్చు. సినిమా చాలా సహజంగా - అందరి స్కూల్ డేస్ ను గుర్తుకు తీసుకు వచ్చేదిగా ఉంటుంది. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంకు అల్లు అర్జున్ వస్తున్నాడంటే నమ్మలేక పోయాను. చాలా సంతోషంగా ఉన్నాను. నాతో పాటు చిత్ర యూనిట్ సభ్యులంతా కూడా అల్లు అర్జున్ ను కలుసుకునేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.

ఇక గత ఏడాది తనకు వచ్చిన అనూహ్య క్రేజ్ కు కొన్ని రోజులు ఉక్కిరి బిక్కిరి అయినట్లుగా చెప్పుకొచ్చింది. ఆసమయంలో ఏం జరుగుతుందో నాకు మాత్రమే కాకుండా నా కుటుంబ సభ్యులకు కూడా అర్థం కాలేదు. ఎక్కడ చూసినా జనాలు - ఇంటి వద్ద నా కోసం జనాలు వస్తుండటంతో ఇబ్బందిగా అనిపించేది. దాంతో నా పేరెంట్స్ చాలా వారాల పాటు అసలు ఇంట్లోనుంచి  వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేసినంత పని చేశారు. నన్ను బయటకు వెళ్లకుండా కట్టు దిట్టంగా ఏర్పాట్లు చేశారు. దాంతో ఆ సమయంలో చాలా ఇబ్బందిగా అనిపించేది. ఇక ఫేం వచ్చిన సమయంలోనే నా గురించి రూమర్స్ రావడం మొదలు పెట్టాయి. మొదట వాటి గురించి ఆలోచించినా ఇప్పుడు మాత్రం నేను కాని - నా కుటుంబ సభ్యులు కాని ఎవ్వరు కూడా వాటి గురించి ఆలోచించడం లేదు.

ఇక నేను ఒరు ఆదార్ లవ్ షూటింగ్ లో ఉన్న సమయంలోనే నాకు ఇష్టమైన అల్లు అర్జున్ గారితో నటించే అవకాశం వచ్చింది. కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను చేయలేక పోయాను. తెలుగుతో పాటు ఇంకా పలు భాషల నుండి ఆఫర్లు వస్తున్నాయి. కాని సినిమాల ఎంపిక విషయంలో ఆచి తూచి నిర్ణయాన్ని తీసుకోవాలనే ఉద్దేశ్యంతో ఇంకా ఏ సినిమాకు కమిట్ కాలేదని పేర్కొంది.