Begin typing your search above and press return to search.

'ఇద్దరు బలమైన వ్యక్తుల మధ్య బుల్ ఫైట్ లా ఉంటుందీ సినిమా'

By:  Tupaki Desk   |   26 Jun 2022 9:55 AM GMT
ఇద్దరు బలమైన వ్యక్తుల మధ్య బుల్ ఫైట్ లా ఉంటుందీ సినిమా
X
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ప్రతీ హీరో కూడా ఇతర భాషల్లోనూ క్రేజ్ సంపాదించుకోడానికి ట్రై చేస్తున్నారు. డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్.. ఇప్పుడు ''కడువా'' అనే చిత్రంతో పలకరించడానికి రెడీ అయ్యారు.

పృథ్వీరాజ్ హీరోగా సీనియర్ మాస్ డైరెక్టర్ షాజీ కైలాస్ తెరకెక్కించిన హై ఆక్టేన్ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ ''కడువా''. బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ మరో ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. 'భీమ్లా నాయక్' ఫేమ్ సంయుక్త మీనన్ కథానాయికగా కనిపించనున్నారు. మ్యాజిక్ ఫ్రేమ్స్ - పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్ - సుప్రియా మీనన్ ఈ సినిమాని నిర్మించారు.

పాన్ ఇండియా స్థాయిలో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 'కడువా' మూవీ రిలీజ్ కానుంది. జూన్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో గ్రాండ్ గా టీజర్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి పృథ్వీరాజ్ - వివేక్ ఒబెరాయ్ - సంయుక్త మీనన్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. ''నా గత చిత్రం 'జనగణమన' ని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టింది. తెలుగు ప్రేక్షకులు సినిమాని గొప్పగా ప్రేమిస్తారు. హైదరాబాద్ లో షూటింగ్ అంటే నాకూ ఎప్పుడూ ప్రత్యేకంగా వుంటుంది. నా 'బ్రోడాడీ' సినిమా అంతా హైదరాబాద్ లోనే షూట్ చేశా. ఇప్పుడు 'కడువా' టీం కు మీరంతా గొప్ప స్వాగతం పలికారు'' అని అన్నారు.

''కడువా నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. మలయాళం నుండి మంచి సినిమాలు వస్తున్నాయి. వాస్తవానికి దగ్గరగా ఉండేవి.. మెదడుకు పదునుపెట్టేవి.., ఆలోచన రేకెత్తించే చిత్రాలుగా ఇలా చాలా జోనర్ చిత్రాలు వస్తున్నాయి. ఐతే మాస్ కమర్షియల్ సినిమాని మలయాళం పరిశ్రమ మర్చిపోయిందనే భావన కలిగింది. ప్రేక్షకులు అమితంగా ఎంజాయ్ చేసే మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాలు రావడం తగ్గింది. ఇలాంటి నేపధ్యంలో ఈ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ని ప్రేక్షకుల ముందుకు తీసురావాలని భావించాను''

''ఈ చిత్రాన్ని అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈసారి డబ్బింగ్ వెర్షన్ ని పక్కాగా ప్లాన్ చేశాం. టీం అంతా వచ్చి ప్రమోషన్స్ లో ఇక్కడ ప్రేక్షకులని కలవడం ఆనందంగా వుంది. భవిష్యత్ లో నా చిత్రాలన్నీ తెలుగులో విడుదల చేయడానికి ప్రయత్నిస్తా. నేను చేసిన సినిమాలు ఇక్కడ రీమేక్ కావడం ఆనందంగా వుంది. 'భీమ్లా నాయక్' ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అలాగే చిరంజీవి గారి 'గాడ్ ఫాదర్' కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. త్వరలోనే తెలుగు, మలయాళం చిత్ర పరిశ్రమల కలయికలో పెద్ద ప్రాజెక్ట్స్ వస్తాయనే నమ్మకం వుంది'' అని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.

వివేక్ ఒబెరాయ్ మాట్లాడుతూ.. ''నేను పుట్టింది హైదరాబాద్ లోనే. మా కుటుంబంలో చాలామంది ఇక్కడే వున్నారు. ఇక్కడికి వస్తే స్కూటర్ లో కాలేజీలు చుట్టూ తిరగడాలు. గండిపేట్ పిక్నిక్.. ట్యాంక్ బండ్ అన్నీ గుర్తుకు వస్తాయి. నా చిత్రాల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. 'కడువా' రాకింగ్ మూవీ. ఇద్దరు బలమైన వ్యక్తుల మధ్య ఒక బుల్ ఫైట్ లా ఈ సినిమా వుంటుంది. నా కెరీర్ లో ఫోన్ లోనే ఓకే చేసిన మూవీ 'లూసిఫర్'. 'కడువా' కథ కూడా పృథ్వీరాజ్ ఫోన్ లోనే చెప్పారు. కథ చెప్పినపుడు ఇదో బుల్ ఫైట్ లా ఉంటుందని చెప్పారు. ఈ సినిమా షూటింగ్ లో నిజంగానే రెండు పెద్ద బుల్స్ తీసుకొచ్చి ఫైట్ చేయించారు. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది'' అని అన్నారు.

హీరోయిన్ సంయుక్త మీనన్ మాట్లాడుతూ.. ''కడువా ప్రమోషన్స్ తెలుగులో చేయడం ఆనందంగా వుంది. తెలుగు ప్రేక్షకులకు సినిమా అంటే ప్యాషన్. 'భీమ్లా నాయక్' విడుదల అప్పుడు థియేటర్ లో ఒక పండగ లాంటి వాతావరణం చూశాను. 'కడువా' చూస్తున్నపుడు కూడా అదే సెలబ్రేషన్స్ వుంటాయని భావిస్తున్నా'' అని అన్నారు.