Begin typing your search above and press return to search.

పాపం వ‌ర్మ‌కు ప్రెస్సోళ్ల కంటి తుడుపు

By:  Tupaki Desk   |   19 May 2019 11:10 AM GMT
పాపం వ‌ర్మ‌కు ప్రెస్సోళ్ల కంటి తుడుపు
X
అయిపోయిన పెళ్లికి బ్యాండు బాజాలా ఉందీ తంతు. ఆర్జీవీ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కించిన `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` ఏపీలో రిలీజ్ కాకుండా నిర్వీర్యం అయిపోయింది. ఎల‌క్ష‌న్ ముందు ఈ సినిమాని రిలీజ్ చేయాల‌న్న ప‌న్నాగానికి ఈసీ సాయంతో చెక్ పెట్ట‌డంలో చంద్ర‌బాబు అండ్ ఘ‌నాపాటీలు పెద్ద స‌క్సెసయ్యారు. ఆ చిత్రంలో చంద్ర‌బాబును విల‌న్ గా చూపించ‌డం వ‌ల్ల ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంద‌ని ఈ సినిమా రిలీజ్ ని వాయిదా వేయించింది ఈసీ. క‌నీసం ఏపీ ఎన్నిక‌లు అయిపోయాక అయినా రిలీజ్ కానిచ్చారా? అంటే మే 23 ఫ‌లితాలు వెలువ‌డే వ‌ర‌కూ దీనిని రిలీజ్ చేయ‌డానికి వీల్లేదంటూ ఈసీ నుంచి ఆజ్ఞ‌లు వెలువ‌డ్డాయి.

అదంతా ఒక ఎత్తు అనుకుంటే విజ‌య‌వాడ‌లో ఆర్జీవీ ప్రెస్ మీట్ పెట్టాల‌నుకోవ‌డం ఆ క్ర‌మంలోనే రోజంతా న‌డిచిన‌ హైడ్రామా మ‌రో ఎత్తు. ఏప్రిల్ 28న బెజ‌వాడ రోడ్ల‌పై పోలీసుల‌కు వ్య‌తిరేకంగా ఆర్జీవీ హైడ్రామా గురించి తెలిసిందే. అత‌డిని ప్రెస్ మీట్ పెట్టనీయ‌కుండా బ‌ల‌వంతంగా విజ‌య‌వాడ నుంచి హైద‌రాబాద్ కి పంపేశారు. అయితే ఈ విష‌యంలో ఆర్జీవీ చాలానే సీరియ‌స్ అయ్యారు. త‌న‌ని ప్రెస్ మీట్ పెట్ట‌నీకుండా అడ్డుకునే అధికారం ఎవ‌రికి ఉంది? అంటూ ఆర్జీవీ చాలానే ప్ర‌శ్నించారు. కానీ అట్నుంచి స‌రైన స్పంద‌న అన్న‌దే లేకుండా పోయింది. దీంతో ఆ ఎపిసోడ్ క్లోజ్ అయిన‌ట్టేన‌ని అంతా భావించారు.

కానీ అక్క‌డితో అయిపోలేదు ఇప్పుడే మొద‌లైంది అన్న‌ట్టు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కాస్త ఆల‌స్యంగా స్పందించింది. తాజాగా ఆ అంశాన్ని ఎంతో సీరియ‌స్ గా తీసుకుని ఆర్జీవీకి అండ‌గా నిలుస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఆర్జీవీ విజ‌య‌వాడ ఎపిసోడ్ లో జ‌రిగిన అన్యాయాన్ని ప‌రిశీలించి ఈ కేసును సుమోటాగా తీసుకుంది ప్రెస్ కౌన్సిల్. ప్రెస్ మీట్ ర‌ద్దుకు కార‌కులైన ఏపీ డీజీపీ- విజ‌య‌వాడ పోలీస్ క‌మీష‌న‌ర్ ఇరువ‌రికి నోటీసుల్ని పంపించింది. అస‌లు అలా ఎందుకు జ‌రిగింది? అన్న‌దానికి వివ‌ర‌ణ ఇవ్వాల్సిందిగా ఆ ఇద్ద‌రికీ నోటీసులు జారీ అయ్యాయి. వీళ్ల‌తో పాటే నోవాటెల్.. ఐలా పురం హోట‌ల్స్ కి నోటీసులు పంప‌డం ఇక్క‌డ హైలైట్. అసలు మీ హొట‌ల్ ప్రెమిసెస్ లో ప్రెస్ మీట్ పెట్టుకోకూడ‌దా? అంటూ నోటీసుల్లో ప్ర‌శ్నించార‌ట‌. మోడ‌ల్ కోడ్ అంటూ ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ కొట్టిన దెబ్బ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై మామూలుగా ప‌డ‌లేదు. ఇప్ప‌టికే ఈ చిత్రం తెలంగాణ స‌హా దేశ‌వ్యాప్తంగా రిలీజై వెళ్లిపోయింది. ఈ నేప‌థ్యంలో ఏపీలో రిలీజ్ చేసినా ఏం ప్ర‌యోజ‌నం ఉంటుంది? అని ప్ర‌శ్నిస్తున్నారంతా.