Begin typing your search above and press return to search.

'మా' పోలింగ్ రోజు సీసీటీవీ ఫుటేజ్‌ కోరుతూ ప్రకాశ్ రాజ్ లేఖ..!

By:  Tupaki Desk   |   14 Oct 2021 12:09 PM GMT
మా పోలింగ్ రోజు సీసీటీవీ ఫుటేజ్‌ కోరుతూ ప్రకాశ్ రాజ్ లేఖ..!
X
'మా' (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) ఎన్నికలు ముగిసినా దీనిపై ఇంకా రచ్చ కొనసాగుతూనే ఉంది. ఎన్నికలు పూర్తై నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలిచిన తరువాత ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన అభ్యర్థులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసారు. 'మా' ఎన్నికలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ ని ఇవ్వాలని కోరుతూ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ కి ప్రకాశ్‌ రాజ్‌ గురువారం ఓ లేఖ రాశారు. ఎన్నికల రోజు భయంకర ఘటనలు జరిగాయని.. మోహన్‌ బాబు - నరేశ్‌ కొందరు 'మా' సభ్యులపై దాడి చేశారని అన్నారు. పోలింగ్‌ సమయంలో సీసీ కెమెరాలు అన్నింటినీ రికార్డు చేసుంటాయని భావిస్తున్నానని.. అందుకే సీసీటీవీ ఫుటేజీ కోరుతున్నామని ప్రకాష్ రాజ్ లేఖలో పేర్కొన్నారు.

''ఇటీవల పూర్తయిన 'మా' ఎన్నికల్లో జరిగిన దురదృష్టకర సంఘటనలకు మీరు సాక్షిగా ఉన్నారు. డి.ఆర్.సి. సభ్యులు శ్రీ మోహన్ బాబు మరియు మాజీ అధ్యక్షులు శ్రీ నరేశ్ అసాంఘిక చర్యలకు పాల్పడ్డారు. 'మా' సభ్యులను తిట్టడం, బెదిరించడంతో పాటు భౌతిక దాడికి దిగారు. ఎన్నికల అధికారిగా మీకు ఉన్న విచక్షణా అధికారం కారణంగానే వారి అనుయాయులు పోలింగ్ ప్రాంతంలోకి వచ్చారని నేను భావిస్తున్నాను. అలానే అక్కడ జరిగిన కొన్ని సంఘటనల విజువల్స్ మీడియాలోనూ ప్రసారం అయ్యాయి. దాంతో 'మా' ఎన్నికలు, తదనంతర పరిణామాలు ప్రజల దృష్టిలో నవ్వులాటగా మారిపోయాయి. పోలింగ్ కేంద్రంలో అసలు ఏం జరిగిందనే విషయం 'మా' సభ్యులకు కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నారు''

''మీరు ఎన్నికల ముందు మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రం వద్ద సీసీ కెమెరాలను పెడతామని చెప్పారు. వాటిలో అన్ని రికార్డ్ అయ్యాయని నేను భావిస్తున్నాను. కాబట్టి దయచేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని పొందడం మాకున్న ప్రజాస్వామిక హక్కుగా నేను భావిస్తున్నాను. ఓ ఎన్నికల అధికారిగా సంబంధిత రికార్డులను కనీసం మూడు నెలల పాటు భద్రపర్చడం మీ విధి. సుప్రీంకోర్టు సైతం పలు తీర్పులలో ఎన్నికలకు సంబంధించిన రికార్డులను పోలింగ్ ఆఫీసర్స్ జాగ్రత్త చేయాలని చెప్పింది. వీలైనంత త్వరగా ఆ సీసీ ఫుటేజ్ ను మాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఒకవేళ మీరు దీనిపై వెంటనే స్పందించకపోతే ఆ ఫుటేజ్ డెలీట్ చేయబడిందని లేదా ట్యాంపర్ అయ్యిందని భావించాల్సి ఉంటుంది'' అని ప్రకాశ్ రాజ్ లేఖలో పేర్కొన్నారు.

'మా' పోలింగ్ నాటి సీసీటీవీ ఫుటేజ్ కోరుతూ ప్రకాష్ రాజ్ రాసిన లేఖ పై ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ స్పందించారు. ఎన్నికలకి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ భద్రంగానే ఉందని.. నిబంధనల ప్రకారం దాన్ని ఇస్తామని అన్నారు. ఇకపోతే 'మా' ఎన్నికల రోజు తమ సభ్యులపై దాడి జరిగిందనే విషయాన్ని మంగళవారం జరిగిన మీడియా సమావేశంలోనూ ప్రకాశ్ రాజ్ ప్రస్తావించారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో మోహన్ బాబు తమ ప్యానల్ కు చెందిన తనీష్ - బెనర్జీ లను దూసిస్తూ కొట్టడానికి వచ్చారని ఆరోపించారు. బెనర్జీ సైతం తనను మోహన్ బాబు అర గంట సేపు బూతులు తిట్టారని.. కొట్టటానికి వచ్చారని మీడియా ముఖంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. మంచు విష్ణు - మనోజ్ ఇద్దరూ లేకపోతే ఆ రోజు గొడవలు పెద్దవి అయ్యేవని ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ కోరుతూ 'మా' ఎన్నికల అధికారికి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.