Begin typing your search above and press return to search.

స్టార్ హీరోలపై ప్ర‌కాష్ రాజ్ సింప‌థి ఓటుగా మారేనా?

By:  Tupaki Desk   |   13 Sep 2021 7:32 AM GMT
స్టార్ హీరోలపై ప్ర‌కాష్ రాజ్ సింప‌థి ఓటుగా మారేనా?
X
తెలుగు సినీప‌రిశ్ర‌మ 24 శాఖల్లో అత్యంత కీల‌క విభాగంగా మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఖ్యాతి ప‌ర‌ప‌తి గురించి తెలిసిన‌దే. అందుకే ఆర్టిస్టుల ఎలక్ష‌న్ అంటేనే గ‌డ‌బిడ త‌ప్ప‌నిస‌రి. గ‌డిచిన మూడు ద‌ఫాలుగా ఇదే ప‌రిస్థితి క‌నిపించింది. శివాజీరాజా- వీకే న‌రేష్ అధ్య‌క్షులుగా ఉన్న స‌మ‌యంలో విభేధాలు తారా స్థాయికి చేరుకున్నాయి. దానివ‌ల్ల ఆర్టిస్టుల ప‌రువు మ‌ర్యాద‌ల‌కు భంగం క‌లిగింద‌న్న‌ది సినీపెద్ద‌ల ఆరోప‌ణ‌. అయితే మా లొల్లి ఇప్ప‌ట్లో వ‌దిలేట్టు లేదు. ఇప్ప‌టికీ వివాదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి.

అక్టోబ‌ర్ 10న ఎన్నిక‌లు పూర్త‌య్యేవర‌కూ ఇదే ప‌రిస్థితి ఉంటుంది. ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ వ‌ర్సెస్ మంచు విష్ణు ప్యానెల్ వార్ కొన‌సాగుతుంది. వీళ్ల‌లో విష్ణుకి అండ‌గా వీకే న‌రేష్ నిల‌వ‌గా.. ప్ర‌కాష్ రాజ్ కి జీవిత కొండంత అండ‌గా నిలిచారు. ఇక బండ్ల గ‌ణేష్ త‌న మిత్రుడే అయిన ప్ర‌కాష్ రాజ్ కి యాంటీగా మారి క్యాంపెయినింగ్ మొద‌లెట్టారు. మొత్తానికి ఈ వార్ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. మాటా మాటా పెరుగుతూ ఉంటే ఆర్టిస్టుల్లో అది క‌ల‌క‌లం రేపుతోంది. దీనికి తోడు ఇటీవ‌ల విందు రాజ‌కీయాలు వేడి పెంచేస్తున్నాయ్.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల వేడి అంత‌కంత‌కు పెరుగుతోందే కానీ త‌గ్గ‌డం లేదు. నిన్న‌టిరోజున‌ ప్రకాష్ రాజ్ విందు రాజ‌కీయంలో చ‌ర్చ‌కు వ‌చ్చిన ఓ పాయింట్ కూడా వేడి పెంచింది. MAA నుండి కొంతమంది ప్రముఖ నటులను పిలిచి మధ్యాహ్న భోజన సమావేశంలో ఎన్నిక గురించి చర్చించిన ప్ర‌కాష్ రాజ్ స్టార్ హీరోల‌పై కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. స్టార్ హీరోలు తమ సొంత కారణాల వల్ల MAA కి దూరంగా ఉంటున్నారని ప్రకాష్ రాజ్ అన్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. తాను పలువురు స్టార్ హీరోలతో మాట్లాడుతున్నానని వారు రాకపోవ‌డానికి వారి కారణాలను అర్థం చేసుకుంటున్నానని ఆయన చెప్పారు. అతను MAA భవిష్యత్తు కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడానికి ఎన్నికలలో ఓటు వేయడానికి కొంతమంది స్టార్ హీరోలను త‌ప్ప‌నిస‌రిగా రావాల‌ని ఆహ్వానించారు. `మా` ఎన్నికల్లో పాల్గొనడానికి స్టార్ హీరోలను తాను కూడా భాగస్వాములను చేస్తానని అది వారి బాధ్యత కూడా అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు అధ్య‌క్ష ప‌ద‌వి పోటీలో గెలిచిన వెంట‌నే `మా` అసోసియేష‌న్ కి కార్పస్ ఫండ్ గా ప్రకాష్ రాజ్ 10 కోట్ల రూపాయలను విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఎన్నిక‌ల్లో పోటీ అనివార్య‌మ‌ని.. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో ఇలాగే ఉంటుంద‌ని ఇందులో తప్పు ఏదీ లేదని ప్రకాష్ రాజ్ విందులో ఆర్టిస్టుల‌తో అన్నారు. 26 మంది సభ్యుల ప్యానెల్ తో పనిచేసే వారు నాయకుడు కాదని.. అయితే 200 మందితో పనిచేసే వారే నిజమైన నాయకుడని కూడా ప్ర‌కాష్ రాజ్ వ్యాఖ్యానించారు. సినిమా బిడ్డ‌లం పేరుతో పోటీలో నిలుస్తున్న ప్ర‌కాష్ రాజ్ కి కౌంట‌ర్ గా మంచు విష్ణు త‌న ఆయుధాల‌ను బ‌లంగానే సిద్ధం చేస్తున్నార‌ని చాప కింద నీరులా ఆయ‌న త‌న బ‌ల‌గాల్ని సిద్ధం చేసుకుని పోటీకి దిగుతున్నార‌ని మ‌రో గుస‌గుస వినిపిస్తోంది. వీకే న‌రేష్ ఇప్ప‌టికే అత‌డికి మ‌ద్ధ‌తునిచ్చారు. విందు రాజ‌కీయాల్ని నెరుపుతున్న సంగ‌తి తెలిసిందే.

ఇక లంచ్ లు డిన్న‌ర్ లు అంటూ `మా` స‌భ్యుల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడొద్ద‌ని బండ్ల గ‌ణేష్ కామెంట్ చేసిన సంగ‌తి విధిత‌మే. ప్రకాష్ రాజ్ బండ్ల గణేష్ వ్యాఖ్యలకు ఆశ్చర్యపోయానని అన్నారు. తాను అన్ని కోవిడ్ -19 మార్గదర్శకాలను పాటించానని మధ్యాహ్న భోజనం పరిమిత సభ్యులతో జరిగిందని ఆయన చెప్పారు. ఎన్నికల ర్యాలీలు ఎన్నికలకు సంబంధించిన రాష్ట్రాల్లో జరుగుతున్న సమావేశాల గురించి బండ్ల గణేష్ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన అడిగారు. ఎన్నికల సమయంలో కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించిన రాజకీయ పార్టీల గురించి బండ్ల గణేష్ కూడా మాట్లాడితే బాగుంటుందని ప్రకాష్ రాజ్ అన్నారు. ఇక‌పోతే బండ్ల ఈసారి ఎన్నిక‌ల్లో జీవిత రాజ‌శేఖ‌ర్ కి వ్య‌తిరేకంగా జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప‌ద‌వికి స్వ‌తంత్రుడిగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మంచు విష్ణు ప్యానెల్లో చేరినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌ని గుస‌గుస‌లు వేడెక్కిస్తున్నాయి. తెర‌వెన‌క బండ్ల‌ను ఒక షాడో న‌డిపిస్తోంద‌న్న గుస‌గుస హీటెక్కిస్తోంది.