'ప్రభాస్ నన్ను ఎప్పుడూ దూరం పెట్టలేదు'

Wed Sep 28 2022 12:00:01 GMT+0530 (India Standard Time)

'Prabhas never distanced himself from me'

టాలీవుడ్ లో ప్రస్తుతం బిజీ క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న వారిలో ప్రభాస్ శ్రీను ఒకరు. ఎక్కువగా కామెడీ విలన్ పాత్రల్లో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా శ్రీను ని పేర్కొంటుంటారనే సంగతి తెలిసిందే.సినిమాల్లోకి రాకముందు ముందు నుంచీ శ్రీను కు ప్రభాస్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలో శ్రీను కాస్త 'ప్రభాస్ శ్రీను' గా మారిపోయాడు. డార్లింగ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన తరవాత కూడా వీరి మధ్య ఫ్రెండ్ షిప్ అలానే కొనసాగుతోంది.

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీను మాట్లాడుతూ.. ప్రభాస్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ప్రభాస్ తో పరిచయం దగ్గర నుంచి.. డార్లింగ్ తనను దూరం పెట్టినట్టుగా ప్రచారం జరగడం వరకూ.. అన్ని విషయాలపై మాట్లాడారు.

సత్యానంద్ ఫిలిం ఇనిస్టిట్యూట్ లో యాక్టింగ్ నేర్చుకునే రోజుల నుంచి ప్రభాస్ తనకు మంచి ఫ్రెండ్ అని.. అతను ఎప్పటికైనా పెద్ద స్టార్ అవుతాడని తాను అప్పుడే అనుకున్నానని ప్రభాస్ శ్రీను చెప్పాడు.

ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ తనతో అంతే చనువుతో ఉంటాడని నటుడు తెలిపారు. స్టార్ డమ్ ను బట్టి మారాలనే విషయం ఆయనకి తెలియదని.. అప్పుడు ఇప్పుడు అని కాదు.. ప్రభాస్ ఎప్పటికీ మారడని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రభాస్ తనను దూరం పెట్టినట్టుగా వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. అందులో ఏమాత్రం వాస్తవం లేదని శ్రీను అన్నారు. డార్లింగ్ తో గొడవపడి విడిపోవాలని ఎవరూ అనుకోరని.. ఇవన్నీ పనిలేని వాళ్లు సృష్టించే ఒట్టి పుకార్లే అని స్పష్టం చేశారు.

ఇక ప్రభాస్ విషయానికి వస్తే.. ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాల షూటింగులో బిజీగా ఉన్నాడు. ఓం రౌత్ దర్శకత్వంలో చేస్తున్న 'ఆది పురుష్' చిత్రంతో నేరుగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ మైథలాజికల్ డ్రామాలో రాముడిగా ప్రభాస్ కనిపించనున్నారు.

అక్టోబర్ 2న ఈ మూవీ ఫస్ట్ లుక్ మరియు టీజర్ ను అయోధ్యలో ఆవిష్కరించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న 'ఆదిపురుష్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.

అలానే 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' వంటి భారీ యాక్షన్ మూవీలో ప్రభాస్ నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా.. వచ్చే ఏడాది సెప్టెంబర్ లో విడుదల కానుంది. దీంతో పాటుగా మారుతి డైరెక్షన్ లో డార్లింగ్ ఓ సినిమా చేస్తున్నాడు.

'మహానటి' ఫేమ్ నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ K' వంటి పాన్ ఇంటర్నేషనల్ సినిమాలో నటిస్తున్నారు ప్రభాస్. ఇది ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కే సినిమా అవుతుంది. ఇదే క్రమంలో సందీప్ రెడ్డి వంగా తో 'స్పిరిట్' మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.