1000 కోట్ల ప్రాజెక్టులు పూర్తి చేశాక ప్రభాస్ ఏడాది రెస్ట్!

Tue May 11 2021 16:00:01 GMT+0530 (IST)

Prabhas One year rest after completion of 1000 crore projects!

`బాహుబలి` సక్సెస్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రెబల్ స్టార్ ప్రభాస్ తదుపరి ప్రాజెక్ట్ లను అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూడు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు. 150 కోట్ల బడ్జెట్ తో `రాథేశ్యామ్` తెరకెక్కుతోంది. మరో 150 కోట్ల బడ్జెట్ తో ప్రశాంత్ నీల్ `సలార్` చిత్రీకరణ సాగుతోంది. 300 కోట్ల వ్యయంతో తెరకెక్కుతోన్న `ఆదిపురుష్ 3డి`లో నటిస్తున్నాడు. ఈ మూడు చిత్రాలపైనా భారీ అంచనాలున్నాయి.ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అంచనాల్ని అమాంతం పెంచాయి. ప్రస్తుతం ఈ మూడు సినిమాలు ఆన్ సెట్స్ లోనే ఉన్నాయి. రాధేశ్యామ్ కొద్దిపాటి పెండింగ్ చిత్రీకరణలు పూర్తి చేసి తదుపరి రిలీజ్ కి సిద్ధం చేయాల్సి ఉంది. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఇది వాయిదా పడింది. సలార్- ఆదిపురుష్ ప్రస్తుతం చిత్రీకరణల దశలో ఉన్నాయి. అలాగే `మహానటి` దర్శకుడు నాగ్ అశ్విన్ తో  ఓ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని ప్రారంభించాల్సి ఉంది. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాధేశ్యామ్ ని రిలీజ్ చేయడంతో  పాటు మిగతా మూడు సినిమాలకు ప్రభాస్ మూడేళ్ల పాటు సమయం వెచ్చిస్తున్నాడు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ ని వీటన్నిటి కోసం ఖర్చు చేయనున్నారు.

ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ లు ఆగిపోయినా పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత వీలైనంత త్వరగా సెట్స్ లో ఉన్నవి పూర్తి చేయాలన్నది ప్లాన్. వీటి షూటింగ్ లు పూర్తయిన తర్వాత ఏడాది పాటు ప్రభాస్ విశ్రాంతి తీసుకోనున్నాడని సమాచారం. అనంతరం తదుపరి సినిమాల వివరాలు ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇక రాధే శ్యామ్ ని ఇదే ఏడాది రిలీజ్ చేయాలని భావించినా సెకండ్ వేవ్ వల్ల రిలీజ్ తేదీపై స్పష్ఠత రాలేదు. ఈ ఏడాది జూలైలో రిలీజ్ కావాల్సినది వాయిదా పడింది.

ఇక `సలార్` వచ్చే ఏడాది ఏప్రిల్ లో.. `ఆదిపురుష్` ని  అదే ఏడాది  ఆగస్టులోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ అప్పటికి కరోనా విలయం ఇప్పటి పరిస్థితులు అదుపులోకి వస్తేనే ఇదంతా సాధ్యమవుతుంది. లేదంటే డార్లింగ్ ప్లానింగ్ లో మార్పులు  చోటు చేసుకునే ఛాన్స్ ఉంది.