'భక్త కన్నప్ప' ఎన్నిసార్లు తీస్తారు?

Sun Aug 25 2019 12:00:43 GMT+0530 (IST)

Prabhas Gives Clarity on About Bhkta Kannappa Movie

రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించిన క్లాసిక్ మూవీ `భక్తకన్నప్ప`. వాణిశ్రీ కథానాయికగా నటించారు. అపర శివభక్తుడి గాథతో తెరకెక్కిన ఈ సినిమా ఆద్యంతం భక్తి- ఎమోషన్ పీక్స్ లో చూపించారు. అయితే ఆ క్లాసిక్ సినిమాని రీమేక్ చేసేందుకు టాలీవుడ్ లో పలువురు దర్శకనిర్మాతలు ప్రయత్నించినా ఏదీ కుదరలేదు. ఆ క్రమంలోనే రెబల్ స్టార్ కృష్ణంరాజు స్వయంగా పూనుకుని `భక్త కన్నప్ప` చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తానని ప్రకటించారు. అది అతడి డ్రీమ్ ప్రాజెక్ట్. కథ రెడీ చేసి స్టోరిబోర్డ్ సహా ప్రతిదీ పక్కాగా సిద్ధం చేసుకున్నారు. అంతేకాదు భక్త కన్నప్ప పాత్రలో తన నటవారసుడు ప్రభాస్ నటిస్తాడని కృష్ణం రాజు ప్రకటించారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఇప్పటి వరకూ టేకాఫ్ కాలేదు. ఓవైపు బాహుబలి సిరీస్ ని పూర్తి చేశాక.. సాహో లాంటి భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్న ప్రభాస్ తదుపరి జాన్ అనే ప్రేమకథా చిత్రంతోనూ బిజీగా ఉన్నాడు. ఇలాంటి టైమ్ లో మరోసారి `భక్త కన్నప్ప` టాపిక్ మీడియాలో ప్రధానంగా చర్చకు వచ్చింది.నిన్న బెంగళూరు మీడియా మీట్ లో ప్రభాస్ మాట్లాడుతూ.. కన్నడ క్లాసిక్ `భక్తకన్నప్ప` స్ఫూర్తితోనే పెదనాన్న తెలుగులో భక్త కన్నప్ప చిత్రంలో నటించారని చెప్పిన ప్రభాస్ .. ఆ సినిమా రీమేక్ లో నటించే ఆలోచన ఉందని తెలిపారు. కేవలం యాక్షన్ సినిమాలు.. ప్రేమకథా చిత్రాలే కాదు వైవిధ్యం ఉన్న కథాంశాల్ని ఎంచుకుని సినిమాలు చేస్తానని `భక్త కన్నప్ప` రీమేక్ లో నటించే అవకాశం ఉందని ప్రకటించడంతో అందరికీ షాక్ తగిలింది. ఇది కేవలం మాట వరసకే అన్నాడే లేక నిజంగానే చేస్తాడా? అంటూ మాట్లాడుకున్నారంతా.

మంచు విష్ణు టైటిల్ పాత్రలో `భక్త కన్నప్ప` చిత్రాన్ని తెరకెక్కిస్తానని ఇదివరకూ తనికెళ్ల భరణి  ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన డ్రాప్ అయ్యారు. ఆ క్రమంలోనే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని ప్రచారమైంది. ఇన్ని రకాల మలుపుల మధ్య ఇటీవలే మంచు విష్ణు .. కాజల్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా ప్రారంభమైందని ప్రకటించారు. మంచు మోహన్‌బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ పతాకంపై హాలీవుడ్ నిర్మాణ సంస్థ హాలీవుడ్ స్టూడియోతో కలిసి ఈ చిత్రాన్ని హీరో మంచు విష్ణు నిర్మించడం ఆసక్తిని రేకెత్తించింది. ఒకవేళ మంచు విష్ణు ఆ ప్రయత్నం చేస్తున్నా.. దాంతో సంబంధం లేకుండా డార్లింగ్ ప్రభాస్ కూడా నటించే ఆలోచనలోనే ఉన్నారా? 2020లో  భక్త కన్నప్ప చిత్రంలో అతడు నటిస్తారా? అన్నది వేచి చూడాలి. క్లాసిక్ డేస్ తో పోలిస్తే టైటిల్ పాత్రలో ఎవరు నటించినా `భక్త కన్నప్ప`ను నేటి ట్రెండ్ కి తగ్గట్టు విజువల్ గ్లింప్స్ తో తెరకెక్కించాల్సి ఉంటుంది.