ప్రభాస్ మెడకు పూచీకత్తు గుదిబండ?

Mon Sep 23 2019 10:46:33 GMT+0530 (IST)

Prabhas Come Farward to Rescue Saaho Buyers

ప్రభాస్ నటించిన `సాహో` ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది.  పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అదే స్థాయిలో చిత్ర బృందం మార్కెట్ చేసింది కూడా.  రూ.290 కోట్లకు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా బిజినెస్ జరిగింది. కానీ తొలి రెండు వారాలకు వసూలు చేసింది మాత్రం రూ. 213.42 కోట్లే. అత్యంత భారీ అమౌంట్ కు ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయర్స్ కు చివరికి ఈ సినిమా భారీ నష్టాలనే మిగిల్చింది. డిస్ట్రిబ్యూటర్స్- ఎగ్జిబిటర్ల తో పాటు చివరికి ఈ చిత్రంలో నటించిన హీరో ప్రభాస్ కి భారీ నష్టాన్ని మిగిల్చిందని విశ్లేషిస్తున్నారు.ఈ సినిమా  విషయంలో తామొకటి తలిస్తే.. అన్న చందంగా అయ్యింది. ఉత్తరాదిన వ్యూహం ఫలించినా దక్షిణాదిన చాలా చోట్ల ఫలితం ఊహించని విధంగా తారుమారు కావడంతో ప్రభాస్ కు ఇబ్బంది తప్పడం లేదని తెలుస్తోంది. అంగీకార పత్రం ప్రకారం.. హీరో ప్రభాస్ తన రెమ్యునరేషన్ ని వదులుకోవాల్సి వస్తోందన్నది ఇన్ సైడ్ గుసగుస. దీనికి తోడు రూ.50 కోట్ల మేర నష్టానికి ప్రభాస్ ష్యూరిటీ వుండాల్సిన పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు.

తొలుత అనుకున్న బడ్జెట్ రూ.150 కోట్లు. అయితే అది బాహుబలి 2 రిజల్ట్ తర్వాత అనూహ్యంగా కాన్వాసు అంతకంతకు పెంచేస్తూ పోయారు. అలా 300 కోట్ల పెట్టుబడి పెట్టాల్సొచ్చింది. దాంతో  నిర్మాతలు చాలా సంస్థల నుంచి డబ్బుని అప్పుగా తీసుకున్నారు. అయితే దాదాపు 50 కోట్లకు ప్రభాస్ మధ్య వర్తిగా వున్నారని చెబుతున్నారు. సినిమా ఫ్లాప్ కావడం... పెట్టిన పెట్టుబడిని కూడా రాబట్టలేకపోవడంతో పాటు 78 కోట్ల మేర వడ్డీల భారం పెరిగిందట. ఇప్పుడు ఆ డబ్బు కట్టాల్సిన బాధ్యత ప్రభాస్ పైనా యువి క్రియేషన్స్ బృందంపైనా పడిందని.. దాన్ని తీర్చడానికి స్నేహితులంతా సుముఖతను వ్యక్తం చేశారని తెలిసింది.  ఈ చిత్రాన్ని భారీ మొత్తాలు వెచ్చించి బయ్యర్స్ కొన్నారంటే దానికి ప్రధాన కారణం ప్రభాస్. ఆ నమ్మకం నిలబడాలంటే ఈ సినిమా ద్వారా వచ్చిన రూ.50 కోట్ల నష్టాలకు ప్రభాసే పూచీకత్తుగా వుండాలన్నది వారి అగ్రిమెంట్. దానికి అంగీకరిస్తూ ప్రభాస్ తానే పెద్దరికం నెరిపారట. దీని కారణంగా తన పారితోషికాన్ని కూడా ప్రభాస్ వదులుకున్నట్టు ఓ బాలీవుడ్ మీడియా సంచలన కథనం రాసింది. ప్రభాస్ అప్పు చేయాల్సిన పని లేదు... నష్టాలు పూడ్చేందుకు సినిమాలు చేయాల్సిన పని కూడా లేదు. అయితే తనకు సాహో వల్ల జీరో రెమ్యునరేషన్ జీరో రెవెన్యూ అంతే. ఇక యువి క్రియేషన్స్ మాత్రం ఈ అప్పు తీర్చేందుకు ఇతరత్రా మార్గాల్ని అనుసరిస్తోందని సదరు కథనం వెల్లడించింది. ఇప్పుడీ సంగతి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.