వెండితెరపై తిరుగులేని ఛత్రపతి .. ప్రభాస్

Sat Oct 23 2021 10:31:07 GMT+0530 (IST)

Prabhas Birthday Special

నేలపై అడుగులు వేస్తూ ఆకాశాన్ని చూస్తూ ఆనందపడటం వేరు .. ఆకాశాన్ని అందుకోవడం వేరు. కెరటాలతో ఆడుకోవాలనుకోవడం వేరు .. సముద్రాన్ని దాటాలనుకోవడం వేరు. నేలపై తనకి గల అనుబంధాన్ని మరిచిపోకుండా ఆకాశానికి ఎగిరిన కథానాయకుడిగా .. కెరటాలనే పట్టుకుని సముద్రాన్ని దాటడానికి ప్రయత్నిస్తున్న కథానాయకుడిగా ప్రభాస్ కనిపిస్తాడు. ప్రభాస్ సినిమా నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు .. అందరు వారసుల మాదిరిగానే ఆయన కూడా తెరకి పరిచయమయ్యాడు .. ఆయన గొప్పతనం ఏవుంది? అని చాలామంది అనుకోవచ్చు.కానీ ఎలాంటి నేపథ్యం ఉన్నవారినైనా కాపాడేది కష్టపడే తత్వమే. అంచలంచెలుగా వాళ్లు ఎదగడానికి ఉండవలసింది అంకితభావమే. అలాంటి కసి .. పట్టుదల ఉండటం వల్లనే ప్రభాస్ వెండితెరపై వెలిగిపోతున్నాడు. 'ఈశ్వర్' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైనప్పుడు ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కుర్రాడు  ఒడ్డూ పొడుగు ఉన్నాడు .. మాస్ యాక్షన్ సినిమాలకి సెట్ అవుతాడని అనుకున్నారు. ఆ తరువాత వచ్చిన 'రాఘవేంద్ర' కూడా అదే అభిప్రాయం వినపడేలా చేసింది. ఇక ఆయన కెరియర్లో మూడో సినిమాగా 'వర్షం' వచ్చింది. టైటిల్ కి తగినట్టుగానే ఈ సినిమా కాసుల వర్షాన్ని కురిపించింది.

ఈ సినిమాతో ప్రభాస్ యూత్ కి చేరువయ్యాడు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ గొప్పగా పండించాడనే పేరు తెచ్చుకున్నాడు. ప్రభాస్ క్రేజ్ .. ఆయన మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు ఆయన 'ఛత్రపతి' సినిమాను తీసుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో ఆయన తన నట విశ్వరూపం చూపించాడు. మదర్ సెంటిమెంట్ తో కూడిన ఈ యాక్షన్ మూవీతో ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యాడు. ఆ తరువాత వచ్చిన 'పౌర్ణమి' ఆశించినస్థాయిలో ఆడకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్  లో ఆయన స్థానాన్ని మరింత పదిలం చేసింది.

ఆ తరువాత ప్రభాస్ ను వరుస పరాజయాలు చుట్టుముట్టాయి. నటన పరంగా ఆయనకి మంచి మార్కులు పడినప్పటికీ కథాకథనాల పరంగా అవి నిరాశ పరిచాయి. అంతకు ముందు ఇచ్చిన తిరుగులేని హిట్లే ఆయనను ఈ సమయంలో కాపాడుతూ వచ్చాయి. ఆ తరువాత వచ్చిన 'మిస్టర్ పర్ఫెక్ట్' .. 'మిర్చి' సినిమాలు ప్రభాస్ ను మళ్లీ నిలబెట్టాయి. ఇక ఆయన కెరియర్ కుదురుకునేలా చేశాయి. ఈ సమయంలోనే తెలుగు తెర గర్వపడే సినిమాగా 'బాహుబలి' వచ్చింది. ఇక ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాతో ప్రభాస్ కోట్లాది మంది అభిమానుల మనసులను దోచుకున్నాడు .. ప్రపంచ పటాన్ని ఆక్రమించుకున్నాడు.

'బాహుబలి' సినిమాతో ప్రభాస్ జనం చేత నీరాజనాలు అందుకున్నాడు .. ఎవరూ అందుకోలేని విధంగా ఎవరెస్టు ఎత్తుకు చేరుకున్నాడు. అయినా ఆయన అహంభావానికి ఆమడదూరంలో ఉండటం .. వినయానికి వీలైనంత దగ్గరగా ఉండటం వలన ఆయనపై అభిమానం అందరిలో మరింతగా పెరిగిపోతూ వచ్చింది. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ పేరు మంత్రమై మ్రోగింది .. పాన్ ఇండియా స్టార్ గా ఆయన ముందుగు వెళ్లడానికి అవసరమైన దారి ఏర్పడింది. ప్రభాస్ అంటే ఇప్పుడు వందల కోట్ల బడ్జెట్ .. వేల కోట్ల వ్యాపారం అన్నట్టుగా నడుస్తోంది.

ఒక  టాలీవుడ్ హీరో .. బాలీవుడ్ హీరోలను మించిపోయిన క్రేజ్ ను .. మార్కెట్ ను సొంతం చేసుకుంటాడని ఎవరూ ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఆ విచిత్రాన్ని అవలీలగా చేసి చూపించిన కథానాయకుడిగా ఇప్పుడు ప్రభాస్ కనిపిస్తున్నాడు. ఇప్పడూ తెరపై ఆయన కనిపిస్తే విశ్రాంతి వరకూ విజిల్స్ .. క్లైమాక్స్ వరకూ క్లాప్స్ పడుతూనే ఉంటాయి. అంతటి క్రేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ భవిష్యత్తులో వెండితెరపై మరింతగా విజృంభించబోతున్నాడు. ఆయన చేతిలో ఉన్న 'రాధే శ్యామ్' .. 'సలార్' .. 'ఆదిపురుష్' .. 'ప్రాజెక్టు K' .. 'స్పిరిట్' వంటి పాన్ ఇండియా సినిమాలే అందుకు నిలువెత్తు నిదర్శనం. వెండితెరపై మేరు పర్వతంలా ఎదిగిన ప్రభాస్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు అందజేస్తూ తెలుగు కథానాయకుడి ఘనతను చాటుతూ .. బహుభాషల్లో ఆయన జైత్రయాత్ర కొనసాగాలని కోరుకుందాం.