Begin typing your search above and press return to search.

ప్రభాస్, చరణ్ అలా .. మహేశ్, బన్నీ ఇలా!

By:  Tupaki Desk   |   18 Oct 2021 3:11 AM GMT
ప్రభాస్, చరణ్ అలా .. మహేశ్, బన్నీ ఇలా!
X
కరోనా అనేది వస్తుందనీ .. అది అందరి జీవితాలను గందరగోళంలోకి నెట్టేస్తుందని ఎవరూ అనుకోలేదు. అన్ని రంగాల మాదిరిగానే చిత్రపరిశ్రమ కూడా అతలాకుతలం అయింది. అప్పటివరకూ హౌస్ ఫుల్ బోర్డులు మాత్రమే చూస్తూ వచ్చిన జనాలు, థియేటర్లు మూతబడటం కూడా చూశారు. ఒక్క మాటలో చెప్పాలంటే కొంతకాలం పాటు అంతా కూడా వినోదానికి దూరంగా .. విలయానికి దగ్గరగా బ్రతికారు. మొత్తానికి ఫస్టు వేవ్ .. సెకండ్ వేవ్ దాటుకుని తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తరువాత నుంచి షూటింగులు .. రిలీజ్ లు మొదలైపోయాయి.

కరోనా కారణంగా షూటింగులు ఆగిపోవడం .. ఆ తరువాత ఒప్పుకున్న సినిమాలన్నీ ఒక్కటిగా మొదలుకావడంతో, డేట్లు సర్దుబాటు చేయలేక ఆర్టిస్టులు నానా తంటాలు పడ్డారు. ఆ తరువాత అంతా సర్దుకోవడానికి కొన్ని రోజులు పట్టింది. సెకండ్ వేవ్ తరువాత ఒక రేంజ్ లో దూకుడు చూపిస్తున్న హీరో ప్రభాస్ అని చెప్పుకోవచ్చు. ఒక వైపున 'సలార్' .. 'మరో వైపున 'ఆది పురుష్' సినిమా షూటింగులతో ఆయన బిజీగా ఉన్నాడు. ఈ సినిమాల తరువాత నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్టును లైన్లో పెట్టేసిన ఆయన, ఆ తరువాత ప్రాజెక్టుగా 'స్పిరిట్'ను ప్రకటించాడు.

ఇలా ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలను ఫటాఫట్ మంటూ సెట్స్ పైకి తీసుకెళితే, చరణ్ కూడా అదే దారిలో తన జోరును చూపిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా 'ఆర్ ఆర్ ఆర్'ను పూర్తి చేసిన ఆయన, ఆ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, శంకర్ తో సినిమా చేయడానికి రంగంలోకి దిగిపోయాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇక ఈ సినిమా తరువాత ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. అందుకు సంబంధించిన పనులు కూడా త్వరలో మొదలుకానున్నాయి.

పాన్ ఇండియా సినిమాల ప్రధమ లక్షణం ఏమిటంటే అందరికీ తెలిసి మొదలవుతాయి కానీ, ఎప్పుడు పూర్తవుతాయనేది మాత్రం ఎవరికీ తెలియదు. అందువల్లనేనేమో మహేశ్ .. బన్నీ పాన్ ఇండియా అయితేనే చేస్తామని పట్టుబట్టకుండా, ఇక్కడి దర్శకులతోనే తమ సినిమాలు తాము చేసుకుంటూ వెళుతున్నారు. బన్నీ విషయానికి వస్తే మాత్రం, ప్రస్తుతానికి పూర్తి దృష్టిని 'పుష్ప' పైనే పెట్టాడు. ఆ తరువాత వేణు శ్రీరామ్ తో 'ఐకాన్' .. బోయపాటితో మరో సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

అలాగే మహేశ్ బాబు తన తదుపరి సినిమాలు త్రివిక్రమ్ తోను .. రాజమౌళితోను ఉండనున్నట్టు మాత్రమే చెబుతున్నాడు. పాన్ ఇండియా హంగుల పట్ల మహేశ్ బాబు పెద్దగా ఆసక్తిని చూపడం లేదు. వీళ్లు చేయనున్నవి పాన్ ఇండియా సినిమాలనే హడావిడి బయట వినిపిస్తుందే తప్ప, అసలు వాళ్లు ఎక్కడా చెప్పలేదు. అంటే బన్నీ .. మహేశ్ ఇద్దరూ కూడా ప్రస్తుతానికైతే ఎప్పటిలానే నిలకడగానే ఆడుతున్నారన్న మాట.

మిగతా హీరోల విషయానికి వస్తే, రవితేజ .. నాని తమ దూకుడును తిరిగి కంటిన్యూ చేస్తుండగా, ఈ సారి వాళ్ల జాబితాలో నాగశౌర్య కూడా చేరిపోయాడు. తన నుంచి వరుస సినిమాలు వదిలిపెట్టడానికి రెడీ అవుతున్నాడు. ఆ రేంజ్ లో కాకపోయినా నితిన్ .. నిఖిల్ ఇద్దరూ కూడా మరీ వెనకబడకుండా వెళుతున్నారు. బలమైన సినిమా నేపథ్యం ఉన్న అఖిల్ .. అల్లు శిరీష్ నిన్నమొన్నటివరకూ నిదానమే ప్రధానమన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే ఇకపై స్పీడ్ పెంచే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. మొత్తానికి ఎవరికి వారు తమ ట్రాక్ తప్పకుండా రేస్ లో దూసుకుపోవడానికి తమవంతు కృషి చేస్తూనే ఉన్నారన్న మాట.