మేనల్లుడి చిత్రాన్ని ప్రమోట్ చేసే బాధ్యత తీసుకున్న పవన్..!

Thu Sep 23 2021 18:44:57 GMT+0530 (IST)

Powerstar Comes Forward To Help Sai Dharam Tej Republic

మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ''రిపబ్లిక్''. 'ప్రస్థానం' ఫేమ్ దేవకట్టా తెరకెక్కించిన ఈ పవర్ ఫుల్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ విడుదలకు సిద్ధమైంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే రిలీజ్ కు కొన్ని రోజులే సమయమున్నా తేజ్ తన సినిమాకి ప్రమోషన్స్ చేసుకోలేని స్థితిలో ఉన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సాయి తేజ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు మేనల్లుడి సినిమాని ప్రమోట్ చేసే బాధ్యత మేనమామలు చిరంజీవి - పవన్ కళ్యాణ్ తీసుకున్నారు.ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ''రిపబ్లిక్'' సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ను తన చేతుల మీదుగా లాంచ్ చేసి.. సాయి తేజ్ చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు మేనల్లుడికి అండగా నిలబడటానికి పవన్ కళ్యాణ్ ముందుకొస్తున్నారు. సెప్టెంబర్ 25వ తేదీ సాయంత్రం జరిగే ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు పవన్ గెస్ట్ గా పాల్గొనబోతున్నట్టు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ కోసం పవన్ కళ్యాణ్ అంటూ ఓ వీడియోని కూడా రిలీజ్ చేశారు.

మేనల్లుడు సాయితేజ్ అంటే పవన్ కు అంతులేని అభిమానం అనే సంగతి తెలిసిందే. తేజ్ సినిమాల్లోకి రావడానికి కూడా పవనే ఆదర్శం. అందుకే ఇప్పుడు మేనల్లుడికి బాసటగా నిలిచి ఈ మూవీ ప్రమోషన్స్ ను పవన్ తన భుజానకెత్తుకుంటున్నారు. కాగా 'రిపబ్లిక్' చిత్రంలో పంజా అభిరామ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో తేజ్ కనిపించనున్నారు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించగా.. రమ్యకృష్ణ - జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు.

జీ స్టూడియోస్ సమర్పణలో జేబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్ - జె.పుల్లారావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూర్చారు. ఎమ్ సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఇప్పటి వరకు విడుదలైన 'రిపబ్లిక్' ఫస్ట్ లుక్ పోస్టర్ - టీజర్ - ట్రైలర్- పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ క్రమంలో ఇప్పుడు మేనమామలు చిరంజీవి - పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రమోషన్స్ ఈ చిత్రాన్ని ఏ మేరకు ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్తుందో చూడాలి.