Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : పవర్ స్టార్

By:  Tupaki Desk   |   25 July 2020 1:00 PM GMT
మూవీ రివ్యూ : పవర్ స్టార్
X
చిత్రం: పవర్ స్టార్

నటీనటులు: ప్రవన్ కళ్యాణ్, బాబు, కత్తి, స్టార్ మెగా తదితరులు

సంగీతం : డీఎస్ఆర్

సినిమాటోగ్రఫీ : జోషి

నిర్మాణం: ఆర్జీవీ వరల్డ్ థియేటర్

దర్శకత్వం: రాంగోపాల్ వర్మ

రాంగోపాల్ వర్మ ఎలాంటి వివాదాలైన తెరమీదకి తీసుకురావడానికి తెగ ట్రై చేస్తుంటాడు. ఆయన రూపొందించే సినిమాలను ఆర్జీవీ వరల్డ్ థియేటర్ పేరుతో ఆన్లైన్ లో విడుదల చేస్తూ కాసులు వెనకేసుకుంటున్నాడు. అలాగే శృంగారతార మియా మాల్కోవాతో క్లైమాక్స్, ఇటీవలే నగ్నం లాంటి షార్ట్ ఫిలిమ్స్ తీసి సినీ అభిమానుల అటెంషన్ పొందుతున్నాడు. ఎన్ని ప్లాప్ సినిమాలు తీసినా వర్మ సినిమాలు చూడటం జనాలు మాత్రం ఆపట్లేదు. ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ అంటూ షార్ట్ ఫిల్మ్ తీసాడు. ఆ షార్ట్ ఫిల్మ్ ట్రైలర్ చూడటానికే 25 రూపాయలు వసూల్ చేసిన వర్మ.. సినిమా చూడటానికి 150, 250 రూపాయల టికెట్ రేట్లు ఫిక్స్ చేసాడు. ఇక నేడే ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో పవర్ స్టార్ షార్ట్ ఫిల్మ్ విడుదల చేసాడు. ఎన్నో వివాదాల మధ్య విడుదలైన ఈ పవర్ స్టార్.. ఎన్నికల తర్వాత ఏం చేసాడో తెలుసుకుందాం!

కథ: ఎన్నికలలో పవర్ స్టార్ ప్రవన్ కళ్యాణ్ ఘోరమైన ఓటమి పాలయ్యాడు. అతని మనసేన పార్టీలో ఒకరు మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఒక సీట్ కూడా రాలేదని సమాచారం అంది మధన పడుతూ ఉంటాడు. అలా ఓడిపోయిన ప్రవన్ కళ్యాణ్ ను పలకరించి ఓదార్చడానికి అతని అన్నయ్య స్టార్ మెగా.. నిర్మాత గుండ్ల రమేష్, బాబు.. ఇలా ఒక్కొక్కరు వచ్చి ఓదార్చుతున్న టైంలో ఆ ఓడిపోయిన బాధలో నుండి ప్రవన్ కళ్యాణ్ ఎలా బయటికి వచ్చాడు..? ఎవరైనా ఉపదేశం చేసారా..? అనేది కథాంశం.

కథనం - విశ్లేషణ: ఎన్నికల ఫలితాలు తెలియగానే ప్రవన్ కళ్యాణ్ బాధతో తన అభిమానులను ఉద్దేశించి నన్ను పవర్ స్టార్ అని ఎందుకు పిలిచారు? సభలు పెడితే లక్షలలో జనాలు ఎందుకు హాజరయ్యారు.. మరి అన్నీ లక్షల మంది ఓట్లు ఏమయ్యాయి? చివరికి ఏమి కాకుండా పోయాననే ఆవేశంతో ఇంట్లో టీవీ పగలగొడతాడు. ఆ మరుసటి రోజు ప్రవన్ కళ్యాణ్ డైలాగ్ రైటర్ వచ్చి కలుస్తాడు. చెంపదెబ్బ తింటాడు. స్వామి స్వామి అంటూ.. ప్రవన్ కళ్యాణ్ గాల్లోకి లేపుతుంటాడు. మీరు నేను దాచుకున్న సైన్యం, నేను చేయబోయే యుద్ధం.. అంటాడు. ఇప్పటికే ఓడిపోయిన బాధలో ఉన్న ప్రవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తే బాగుంటుంది, ఓ మంచి లైన్ చెప్తాను వినండి. ఇది మీకు తప్ప ఇంకెవరికి సెట్ కాదు అంటాడు. వెంటనే ప్రవన్ కళ్యాణ్.. ఇంతకుముందు జిగ్నాతవాసికి కూడా ఇలాగే చెప్పావ్ అని సెటైర్ వేస్తాడు. అలా టైటిల్ కార్డు పడుతుంది.

ఆ తర్వాత ప్రవన్ కళ్యాణ్ అన్నయ్య స్టార్ మెగా వచ్చి.. చెడామడా వాయించేసి రాజకీయాలు మనకి సెట్ కావు అని అంటాడు. ఇదివరకే నేను పార్టీ పెట్టి బండబూతులు తిన్నాను. అవి భరించడం కంటే సినిమాలు బెటర్ అని మళ్లీ సినిమాలు చేస్తున్నాను. ఇప్పుడు తిట్లు తప్పాయని అంటాడు. అంతేగాక నువ్ సినిమాల టైంలో.. మా అన్నయ్యే నాకు స్ఫూర్తి, ఆయన మాటే శిలాశాసనం అంటావే.. నువ్ పవర్ స్టార్ అయింది ఓ కానిస్టేబుల్ కొడుకుగానా.. లేక నా తమ్ముడుగానా..? అని స్ట్రాంగ్ గా ఇచ్చిపోతాడు. మధ్యలో ఫేమస్ డైలాగ్స్ బాగానే వాడారు ఆర్జీవీ.

ఆ మరునాడు ఓ మీడియా రిపోర్టర్ వచ్చి ఇంటర్వ్యూ చేస్తాడు. 'కత్తి నాకన్నా నా గురించి మీకే బాగా తెలుసని' ప్రవన్ కళ్యాణ్ అంటాడు. ఆ ఇంటర్వ్యూలో అందరికి తెలిసిన అంశాలే డిస్కస్ చేయించాడు వర్మ. ప్రవన్ కళ్యాణ్ అభిమానుల పై, జనాల పై వేసే సెటైర్లు గట్టిగానే తగులుతాయి. అలాగే త్వరలో జిజిపి పార్టీతో పొత్తు గురించి కూడా టాపిక్ వస్తుంది. కానీ దాని అసలు అర్థం ఏమిటో జనాలకు అర్ధమవ్వాలని వర్మ స్కెచ్. కానీ మధ్యలో మహేష్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనడం వివాదాలు రేపెలా ఉంది. ఇక బుల్ బుల్ కృష్ణ, సాగర్జున.. పేర్లు ప్రవన్ కళ్యాణ్ నోట వినిపించాయి. ఇంటర్వ్యూ టైంలో పూణే నుండి ఫోన్ వచ్చిందని అసిస్టెంట్ చెబితే ప్రవన్ కళ్యాణ్ లేచి వెళ్ళిపోతాడు.

ఇక ఇవేం వద్దని ప్రవన్ కళ్యాణ్ తన గేదెలు, ఆవులతో "గడ్డి తింటావా.. తవుడు తింటావా.." మీరే నా నేస్తాలు.. అని పాట పాడుకుంటున్న టైంలో సెవెన్ క్లాక్ బ్లేడ్, సినీ నిర్మాత గుండ్ల రమేష్ వస్తాడు. 'ఏంరా.. కొబ్బరిచిప్ప' అనగానే.. "మీరు ఓడిపోవాలని దేవుడికి వంద కొబ్బరికాయలు కొట్టాను" అంటాడు. ఇక గుండ్ల రమేష్ మాటలకే పగలబడి నవ్వి.. అప్పుడప్పుడు వచ్చి మాట్లాడి వెళ్ళు అంటాడు ప్రవన్ కళ్యాణ్. కానీ మీ బయోపిక్ రైట్స్ కావాలి సార్.. వేరే కుర్రాడితో తీస్తా అనేసరికి.. అక్కడినుండి తరిమి మళ్లీ రావొద్దంటాడు.

తర్వాత ఇంట్లో చిన్న అన్నయ్యకు ఫోన్లో మాట్లాడి.. టీవీలో మస్త్ మస్త్ ప్రోగ్రాం చేస్కో.. అనడంతో అది ఎవరిని అనేది తెలిసిపోతుంది. ఇన్ని టెన్షన్స్ లో ఉన్న ప్రవన్ కళ్యాణ్.. గీతోపదేశం చేయడానికి ఓ అజ్ఞాతవాసిలా వస్తాడు 'రాంగోపాల్ వర్మ'. చివరి సీన్లో ఎంట్రీ ఇచ్చిన వర్మ.. తనకు ఎవరెవరి మీద ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో మొత్తం బయట పెట్టేసాడు. ప్రవన్ కళ్యాణ్ సినిమా ఎంట్రీ నుండి ఎన్నికలలో ఓడిపోవడం వరకు అన్నీ ప్రస్తావిస్తాడు. మధ్యలో ప్రవన్ కళ్యాణ్ పై ఇజం బుక్ రాసిన గాజు తేజ గురించి కూడా మాట్లాడాడు. వోడ్కా తాగుతూ ఉపదేశం చేసిన విధానానికి ప్రవన్ కళ్యాణ్ ఏమి స్పందించకుండా.. చివరికి 2024లో మీరే సీఎం సార్ అనడంతో ఆలింగనం చేసుకుంటాడు.

నటీనటులు - సాంకేతిక వర్గం: ఇక షార్ట్ ఫిల్మ్ అంతా ప్రవన్ కళ్యాణ్ పాత్ర పైనే నడిచింది. కాబట్టి ప్రవన్ కళ్యాణ్ పాత్రలో నటన బాగుందని చెప్పవచ్చు. ఇక రష్యన్ భార్య ఏం మాట్లాడుతుందో ఎవరికి అర్ధం కాదు. ఒక్క ప్రవన్ కళ్యాణ్ కి తప్ప. రెండు మూడు సీన్లకే పరిమితమైన రష్యన్ భార్య కనీసం ముఖం కూడా కనిపించదు. స్టార్ మెగా, కత్తి పాత్రలు పరవాలేదని అనిపిస్తాయి. ఇక గుండ్ల రమేష్ పాత్రతో కాస్త కామెడీ ట్రై చేసాడు వర్మ. మొదట్లో జిజ్ఞాతవాసి డైరెక్టర్.. అతని వల్లే ఇలా జరిగిందంటూ సెటైర్ వేసాడు వర్మ. ఇక కెమెరా పనితనం పెద్దగా ఏమి ఆకట్టుకోలేదని చెప్పాలి. ఏదో చేసాం అంటే చేసాం అన్నట్లుగా ఉందని అనిపిస్తుంది. రాంగోపాల్ వర్మ మార్క్ మిస్ అయింది. ఏదో జనాల అటెంషన్ కోసం తీసాడు తప్ప ఆయనకి ఏం తీయాలో క్లారిటీ లేదని అర్ధమవుతుంది. ఎందుకంటే స్టోరీ ఏమి లేదు కేవలం ఓదార్పుల తోనే 37 నిముషాలు నడిపించాడు. ఏదో ఉందని అంచనా వేసినవాళ్లు మాత్రం నిరాశ చెందటం పక్కా. కానీ కొత్తగా మరికొన్ని వివాదాలు జరుగుతాయని మాత్రం అంచనా వేయవచ్చు.

చివరిగా: ఏం ఎక్సపెక్ట్ చేయకు.. పవర్ స్టార్ - ఓదార్పులు తప్ప!

రేటింగ్: 1/5