Begin typing your search above and press return to search.

దర్శకేంద్రుడికి పవర్ స్టార్ లెటర్.. ఎందు కోసమో తెలుసా?

By:  Tupaki Desk   |   30 July 2021 11:33 AM GMT
దర్శకేంద్రుడికి పవర్ స్టార్ లెటర్.. ఎందు కోసమో తెలుసా?
X
కమర్షియల్ సినిమాకు కేరాఫ్‌ అడ్రస్‌ గా నిలిచిన దర్శకుడు రాఘవేంద్రరావు. దర్శకరత్న దాసరి నారాయణరావుకు సమకాలికుడుగా ఈయన దర్శకేంద్రుడిగా పేరు గాంచి ఎంతో మంది తారలను తెలుగు తెరకు పరిచయం చేశారు. దర్శకుడిగా వెండి తెరపై అద్బుతాలను ఆవిష్కరించిన దర్శకేంద్రుడు ఇన్నాళ్లు తెర వెనుకే ఉండి పోయారు. తాజాగా ఆయన వెండి తెరపై నటుడిగా రాబోతున్నారు. ఇప్పటి వరకు తెర వెనుకే ఉన్న ఆయన తొలి సారి తెరపై కనిపించేందుకు సిద్ధం కాగా ఈ విషయం తెలుసుకుని సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు గ్రాండ్‌ వెల్‌ కమ్ చెప్తున్నారు.

ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ కు కూడా దర్శకేంద్రుడు రాఘవేంద్ర‌రావుకు విషెస్ చెప్తూ లెటర్ రాశాడు. ఇంత కాలం తెర వెనుక ఉండి ఎంతో మంది నటీనటుల్ని డైరెక్ట్ చేసిన మీరు తెర మీదకు వచ్చి నటుడిగా కనిపించడం సంతోషకరం అని పవన్ పేర్కొన్నారు. ఇక మిమ్మల్ని డైరెక్ట్ చేయడానికి ఎంతో మంది దిగ్గజ దర్శకులు ఎదురు చూస్తున్నారని ఆకాంక్షించారు. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కుతోన్న ‘పెళ్లి సంద‌D’ ఫిల్మ్‌లో రాఘవేంద్రరావు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ పాత్ర పేరు ‘వశిష్ట’. ఈ సందర్భంగా రాఘవేంద్రరావుకు శుభాకాంక్షలు తెలుపుతూ జనసేన పార్టీ తరఫున పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చాలా కాలం తర్వాత సినిమాతో రాబోతున్నారు.

గతంలో ఆయన దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా తెరకెక్కించిన ‘పెళ్లిసందడి’ సినిమా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అప్పట్లో అది ఓ రికార్డు సృష్టించింది. ఈ చిత్ర కథ, కామెడీ, సంగీతం, ఎమోషన్స్ ఇలా అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘పెళ్లి సంద‌D’ అనే సినిమా చేస్తున్నారు. ఈ ఫిల్మ్‌ను రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా శ్రీలీల హీరోయిన్‌‌‌‌‌‌గా పరిచయం అవుతోంది. ఈ సినిమాలో రాఘవేంద్రరావు హీరో రోషన్‌‌‌‌‌కు తాతగా నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోలో రాఘవేంద్రరావు సూటు- బూటు వేసుకుని ఫుల్ స్టైలిష్‌‌‌‌‌గా కనిపిస్తున్నారు. ఈ ప్రోమోను దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.

‘బాబు’ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రాఘవేంద్రరావు వరుస సినిమాలతో విజయాల బాట పట్టారు. చిన్న చిత్రాలు చేస్తూనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామరావుతో ‘అడవి రాముడు’ చిత్రం చేసి సంచలన దర్శకుడిగా మారారు రాఘవేంద్రరావు. కమర్షియల్ సినిమాలో తనదైన శైలి ముద్ర వేశాడు. రాఘవేంద్రరావు బీ.ఏ. అనగానే బొడ్డు మీద యాపిల్ పండు ఉండాల్సిందే అనేంతలా పేరు తెచ్చుకున్నాడు. టాప్ స్టార్స్ నుంచి మొదలుకుని బాలీవుడ్ హీరోయిన్స్ అందరినీ తెలుగులో అందంగా చూపించడంతో పాటు చాలా మందిని ఇంట్రడ్యూస్ కూడా చేశాడు.

నేటి టాప్ టాలీవుడ్ హీరోలు విక్టరీ వెంకటేశ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను రాఘవేంద్రరావు ఇంట్రడ్యూస్ చేశాడు. ఇక హీరోయిన్స్ అయితే శ్రీదేవి నుంచి మొదలుకుని తాప్సీ వరకు అందరికీ ఆయన అంటే ఇష్టమే. చాలా మంది హీరోయిన్స్ ఈయన సినిమాల్లో ఒక్కసారి నటించాలని ఇప్పటికీ ఆశపడుతుంటారు. ఇప్పుడు ఆయన నటన మనం చూడబోతున్నాం. నటుడిగా ఆయన కెరీర్‌ కొనసాగాలని ఆశిద్దాం.