చిత్రం: ‘పవర్ ప్లే’
నటీనటులు: రాజ్ తరుణ్-హేమల్-పూర్ణ-ప్రిన్స్-కోట శ్రీనివాసరావు-సత్యం రాజేష్-అజయ్ తదితరులు
సంగీతం: సురేష్ బొబ్బిలి
ఛాయాగ్రహణం: ఐ.ఆండ్రూ
రచన: నంద్యాల రవి
నిర్మాతలు: దేవేష్-మహిధర్
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: విజయ్ కుమార్ కొండా
కొన్ని
నెలల కిందటే ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాతో పలకరించారు హీరో రాజ్ తరుణ్-
దర్శకుడు విజయ్ కుమార్ కొండా. ఆ సినిమాతో వినోదం పంచే ప్రయత్నం చేసిన ఈ
జోడీ.. ఈసారి ‘పవర్ ప్లే’ అంటూ థ్రిల్లర్ జానర్లో సినిమా చేసింది. ఈ రోజే
ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
విజయ్
(రాజ్ తరుణ్) ఓ మధ్య తరగతి కుర్రాడు. చదువు పూర్తి చేసి ప్రభుత్వ
ఉద్యోగం దాదాపు ఖరారైన స్థితిలో అతడికి కీర్తి (హేమల్) అనే అమ్మాయిని
నిశ్చితార్థం కూడా జరుగుతుంది. జీవితం సాఫీగా సాగుతున్న ఆ సమయంలో అతను
అనుకోకుండా దొంగ నోట్ల కేసులో ఇరుక్కుంటాడు. చేయని నేరానికి సమాజం ముందు
దోషిగా నిలబడతాడు. ఆ కేసులోంచి తనను ఎవరూ బయటపడేయలేని
స్థితిలో.. తనే సొంతంగా పరిశోధన మొదలుపెడతాడు. తాను ఎలా
ఇరికించబడ్డదీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో అతను ఏం
తెలుసుకున్నాడు.. అతణ్ని ఇరికించిందెవరు.. వాళ్ల వ్యవహారాన్ని విజయ్
ఎలా బట్టబయలు చేశాడు అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
చేయని
నేరానికి హీరో ఒక కేసులో చిక్కుకోవడం.. దాన్నుంచి బయటపడటానికి అతను
పోరాడటం.. ఈ నేపథ్యంలో గత వారమే చెక్ అనే సినిమా చూశాం. స్క్రీన్
ప్లేలో మాస్టర్ అని పేరున్న చంద్రశేఖర్ యేలేటి లాంటి గొప్ప దర్శకుడు
కూడా ఉరి శిక్ష పడేంత పెద్ద కేసులో హీరో ఇరుక్కోవడాన్ని పకడ్బందీగా
చూపించలేకపోయాడు. ఇలాంటి వ్యవహారాల్ని పైపైన డీల్ చేస్తే అసలు కథకు
బలమైన పునాదే పడదు. హీరో ఎంత బలంగా ఇరుక్కుంటే ఎమోషన్ అంత బాగా
క్యారీ అవుతుంది. ప్రేక్షకులు సైతం ఆ స్థితిలో మనం ఉంటే ఎలా అని
ఉక్కిరిబిక్కిరి అవుతారు. సమస్య నుంచి హీరో ఎలా బయటపడతాడనే ఉత్కంఠ
పెరుగుతుంది. చెక్ తరహాలోనే ఈ వారం వచ్చిన కొత్త థ్రిల్లర్ సినిమా
పవర్ ప్లేలోనూ కథకు అత్యంత ముఖ్యమైన ఈ పాయింటే తేలిపోయింది. హీరో
ఇరుక్కునే కేసు వ్యవహారం మరీ పేలవంగా ఉండటంతో ఆరంభమే
తుస్సుమనిపిస్తుంది. ఇక అక్కడి నుంచి ఏ దశలోనూ సీరియస్ గా తీసుకోలేని
పవర్ ప్లే.. రెండు గంటల్లోపు నిడివితోనూ బోలెడంత విసిగించి
ప్రేక్షకులను అసహనానికి గురి చేస్తుంది.
ఏటీఎంకు వెళ్లి డబ్బు
డ్రా చేసిన హీరో దగ్గర రెండు దొంగ నోట్లేవో దొరికాయని పోలీసులు అతణ్ని
పెద్ద దొంగ నోట్ల స్కాంలో ఇరికించేసి మీడియా ముందు నిలబెట్టేస్తారు
పవర్ ప్లేలో. వేరే డ్రగ్స్ కేసేదో మీడియాలో హైలైట్ అవుతోందని..
దాన్నుంచి అందరినీ డీవియేట్ చేయడానికి పోలీసులు ఇలా అతణ్ని
ఇరికించేస్తారట. ఇలాంటివి పకడ్బందీగా ఉత్కంఠభరితంగా చూపిస్తే
ప్రేక్షకులు లాజిక్ గురించి పట్టించుకోరు. కానీ బలమైన సన్నివేశాలు
లేకుండా.. కన్విన్సింగ్ గా అనిపించకుండా.. పైపైన సన్నివేశాలు చూపించేసి
నోటి మాటలతో వివరణ ఇచ్చేస్తే ప్రేక్షకులు సీరియస్నెస్ ను
ఫీలవడానికి ఆస్కారమే ఉండదు. పవర్ ప్లేలో అదే జరిగింది. అసలు ఈ
కథలో ఎక్కడా కూడా ప్రేక్షకులు రిలేట్ చేసుకునే అంశాలే కనిపించవు.
హీరో దొంగనోట్ల కేసులో ఇరుక్కునే వ్యవహారమే విడ్డూరంగా అనిపిస్తే..
హీరో తండ్రి సైతం అతణ్ని నమ్మకపోవడం ప్రేయసి సైతం అతను తప్పు
చేశాడనుకుని దూరంగా వెళ్లడం ఇంకా వింతగా ఉంటుంది. దొంగ నోట్లు ముద్రించి
చలామణీ చేయాలంటే దానికో పెద్ద సెటప్ ఉండాలని ఎవరికైనా తోచే విషయమే.
కానీ బుద్ధిమంతుడిలా కనిపించే హీరోను తండ్రి ప్రేయసే అతణ్ని
నమ్మకుండా దూరం పెట్టడమేంటో అర్థం కాదు.
పవర్ ప్లేలో ఆరంభ
సన్నివేశాలే ఇలా తేలిపోగా.. ఇక హీరో ఇన్వెస్టిగేషన్ చేసే సన్నివేశాల్లో
అయినా ఏమైనా ఆసక్తి ఉందా అంటే అదీ లేదు. ఏ సన్నివేశం ఎందుకొస్తుందో అర్థం
కాని విధంగా కథ నడుస్తుంటుంది. థ్రిల్లర్ సినిమా చూస్తున్నామన్న
భావనే ఎక్కడా కలగదు. ద్వితీయార్ధంలో హీరో విలన్ల గుట్టంతా బయటికి
లాగే ఎపిసోడ్ సైతం చాలా సాదాసీదాగా అనిపిస్తుంది. పూర్ణ పాత్రకు
సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ దగ్గరికెళ్లేసరికి పూర్తిగా ప్రేక్షకులు
నీరసించిపోతారు. అది మరీ ఇల్లాజికల్ గా.. కథతో సంబంధం లేనట్లు
నడుస్తుంది. ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ లేకపోగా.. సినిమా ఎప్పుడు
ముగుస్తుందా అన్న నిరీక్షించడమే ప్రేక్షకుల పని అవుతుంది. పేరుకు
థ్రిల్లరే తప్ప.. పవర్ ప్లేలో ఎక్కడా ఉత్కంఠకు అవకాశం లేదు. లాజిక్
లేని కథా కథనాలు.. అనాసక్తికర సన్నివేశాలతో ఈ సినిమా పూర్తిగా
నిరాశ పరుస్తుంది.
నటీనటులు:
కెరీర్లో ఇప్పటిదాకా
ఎక్కువగా లవర్ బాయ్.. అల్లరి కుర్రాడి పాత్రలు చేసిన రాజ్ తరుణ్.. ఈ
సినిమాలో ఫుల్ లెంగ్త్ సీరియస్ రోల్ లో కొత్తగా కనిపించాడు. తన
పాత్రను పండించడానికి సిన్సియర్ గానే ట్రై చేశాడు. కానీ ఆ
క్యారెక్టర్లోనే పెద్దగా విషయం లేకపోయింది. హీరోయిన్ గా చేసిన హేమల్
గురించి చెప్పడానికేమీ లేదు. నెగెటివ్ రోల్ లో పూర్ణ బాగానే చేసింది.
అజయ్ అలవాటైన విలన్ పాత్రలో ఓకే అనిపించాడు. కోట శ్రీనివాసరావు మీద
వయసు ప్రభావం బాగా కనిపించడంతో ఆయన సీఎం పాత్రలో ఎఫెక్టివ్ గా
కనిపించలేదు. ప్రిన్స్.. పూజా రామచంద్రన్ పర్వాలేదనిపించారు.
సాంకేతిక వర్గం:
టెక్నికల్
గా పవర్ ప్లే పర్వాలేదనిపిస్తుంది. పాటల్లేని ఈ చిత్రంలో సురేష్
బొబ్బిలి నేపథ్య సంగీతంతో సన్నివేశాల్లో ఉత్కంఠ తేవడానికి
ప్రయత్నించాడు. సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఐ.ఆండ్రూ కెమెరా వర్క్
సినిమాలో చెప్పుకోదగ్గ హైలైట్. ఆయన పనితనం సినిమాకు ఒక డిఫరెంట్ లుక్
తెచ్చింది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లున్నాయి. రచయిత నంద్యాల
రవి నిరాశ పరిచాడు. రైటింగ్ దగ్గరే ఈ సినిమా తేలిపోయింది. ఇప్పటిదాకా
లవ్ స్టోరీలు.. కామెడీ ట్రై చేసిన విజయ్ కుమార్ కొండా.. థ్రిల్లర్
జానర్లో ఏమాత్రం నైపుణ్యం చూపించలేకపోయాడు.అతడికి ఈ జానర్ మీద
పట్టులేదని ఆరంభ సన్నివేశాల్లోనే అర్థమైపోతుంది. దర్శకత్వ పరంగా
ఎక్కడా ప్రతిభ కనిపించదు.
చివరగా: పవర్ లెస్ ప్లే
రేటింగ్: 2/5
Disclaimer
: This Review is An Opinion of One Person. Please Do Not Judge The
Movie Based On This Review And Watch Movie in Theatre