Begin typing your search above and press return to search.

మళ్లీ పోసాని కామెడీకే ఫుల్లు మార్కులు!

By:  Tupaki Desk   |   24 Jan 2021 6:30 AM GMT
మళ్లీ పోసాని కామెడీకే ఫుల్లు మార్కులు!
X
పోసాని కృష్ణమురళి మంచి రచయిత .. ఆయన ఎంత బాగా కథలను రాయగలరో .. అంతకంటే బాగా సంభాషణలు అందించగలరు. ఆయన కథలను అందించిన ఎన్నో సినిమాలు విజయవంతమయ్యాయి. ఎమోషనల్ సీన్స్ రాయాలంటే పోసాని రాయాలి అనే పేరు ఆయన సంపాదించుకున్నారు. ఇక నటుడిగాను .. దర్శకుడిగాను ఆయన తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు. అయితే ఆ తరువాత ఆయన మెగాఫోన్ ను పక్కన పెట్టేసి, నటనపైనే పూర్తి దృష్టి పెట్టారు. ఈ కారణంగానే ఎన్నో విభిన్నమైన పాత్రలు ఆయన ఖాతాలోకి చేరిపోయాయి.


తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలామందే ఉన్నారు .. ఎవరి ప్రత్యేకత వాళ్లకి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఒక అవకాశం చేతివరకూ రావడం చాలా కష్టమైన విషయం. అలాంటి పోటీని తట్టుకుని పోసాని నిలబడ్డారు .. అందుకు కారణం .. ఆయన అసలు నటించకపోవడం. అలా అని చెప్పేసి ఆయనకి నటనరాదని కాదండోయ్. తన బాడీ లాంగ్వేజ్ బయట ఎలా ఉంటుందో .. సినిమాలోను అలాగే ఉంటుంది. ఇక ఎన్నో పాత్రలను క్రియేట్ చేసినవారు కనుక, పాత్రను బట్టి కామెడీని .. ఎమోషన్స్ ను అద్భుతంగా పండిస్తారు. ఆయన పోషించిన కొన్ని పాత్రలను ప్రేక్షకులు ఇప్పటికీ తలచుకుని నవ్వుకుంటూనే ఉంటారు.


ఇటీవల పోసాని నటించిన చిత్రాలలో 'రెడ్' .. 'బంగారు బుల్లోడు' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 'బంగారు బుల్లోడు' నిన్ననే థియేటర్లకు వచ్చింది. కథాకథనాల పరంగా ఈ సినిమా టాక్ సంగతి అలా ఉంచితే, ఈ సినిమాలో పోసాని పోషించిన 'వడ్డీ వ్యాపారి' పాత్ర ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ఈ పాత్రలో మరోసారి ఆయన నవ్వుల పువ్వులు పూయించారు. హీరో చుట్టూ ఉండే పాత్రల్లో ఈ పాత్ర బాగా పేలిందని అంటున్నారు. ఈ సినిమాకి హైలైట్ గా నిలిచిన పాత్ర ఏదైనా ఉందంటే అది పోసానిదేనని చెబుతున్నారు. సినిమా మొత్తం మీద పోసాని ఫుల్లు మార్కులు కొట్టేశారనేదే ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న మాట.