'మెగా' డైరెక్టర్ ఇక లేరు!

Tue Feb 12 2019 11:09:09 GMT+0530 (IST)

Director Vijaya Bapineedu Passed Away

ఇప్పటి తరానికి పెద్ద పరిచయం లేదు కానీ.. డెబ్భైల్లో పుట్టినోళ్లకు.. ఎనభైలలో మొదట్లో పుట్టిన వారందరికి సుపరిచితుడు విజయబాపినీడు. తీసింది 19 సినిమాలే అయినా. అందులో మెగాస్టార్ చిరంజీవికి మెగా ఇమేజ్ తేవటంలో ఆయన పాత్ర అంతా ఇంతా కాదు. చిరు కెరీర్ లో ఆయనకు సరికొత్త ఇమేజ్ ను తీసుకురావటంలో విజయబాపినీడు కీలకభూమిక పోషించారని చెప్పాలి.చిరు కెరీర్ లో భారీ హిట్లు ఉన్న చిత్రాలకు సంబంధించిన ప్రముఖ డైరెక్టర్లలో విజయబాపినీడు ముఖ్యుడిగా చెప్పక తప్పదు. గుట్టా బాపినీడు చౌదరి అలియాస్ విజయబాపినీడు ఈ రోజు ఉదయం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మరణం టాలీవుడ్ కు షాకింగ్ గా మారింది. దాదాపు 15 ఏళ్ల నుంచి సినిమాలు తీయని ఆయన.. దర్శకుడిగా చివరి చిత్రం 1994లో నిర్మించిన ఫ్యామిలీ.

చిరంజీవి హీరోగా వచ్చిన మగమహారాజుతో డైరెక్టర్ గా మారిన బాపినీడు.. తర్వాత మహానగరంలో మాయగాడు.. మగధీరుడు.. ఖైదీ నంబరు 786.. గ్యాంగ్ లీడర్.. బిగ్ బాస్ చిత్రాల్ని నిర్మించారు. పలువురు సినీ ప్రముఖుల్ని ఆయన దర్శకుడిగా పరిచయం చేశారు. అలాంటి వారిలో పాటల రచయిత భువన చంద్ర.. మాటల రచయిత కాశీ విశ్వనాథ్ లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత విజయబాపినీడుదే.

అంతేనా.. తమదైన దర్శకత్వంలో తెలుగుసినిమా మీద తమ ముద్ర వేసిన రాజా చంద్ర.. దుర్గా నాగేశ్వరరావు.. జి. రామమోహన్ రావు.. మౌళి.. వల్లభనేని జనార్దన్ లను దర్శకులుగా పరిచయం చేసింది విజయబాపినీడే. ఆయన మరణ వార్తతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఏలూరు దగ్గర చాటపర్రులో 1936లో జన్మించిన ఆయన.. సినిమాల్లో రావటానికి ముందు ఆయన పలు పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించారు. విజయ.. బొమ్మరిల్లు.. నీలిమ పత్రికలకు ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించారు.