Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ ని వెనకేసుకొచ్చిన పూనమ్...!

By:  Tupaki Desk   |   6 Jun 2020 8:50 AM GMT
ఫ్యాన్స్ ని వెనకేసుకొచ్చిన పూనమ్...!
X
'బంగారం' హీరోయిన్ మీరా చోప్రా సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనపై అనుచితమైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ట్విటర్‌ ద్వారా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మీరా చోప్రా పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా మంత్రి కేటీఆర్.. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను ట్యాగ్ చేస్తూ ఈ వ్యవహారాన్ని వారి దృష్టికి కూడా తీసుకెళ్లింది. అంతేకాకుండా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ కి కూడా ఈ విషయంపై ఫిర్యాదు చేసింది. కాగా మీరా చోప్రా ట్వీట్ కి స్పందించిన మంత్రి కేటీఆర్ ''మేడమ్.. ఈ విషయంపై నేను తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ పోలీసులతో మాట్లాడాను. మీ కంప్లైంట్ ఆధారంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వారిని కోరాను'' అని ట్వీట్ చేసారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై హీరోయిన్ పూనమ్ కౌర్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

''ఇలాంటి వ్య‌వ‌హారాల్లో రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌తో కొంద‌రు ఫేక్ అకౌంట్లు సృష్టించి ఇబ్బందులకు గురిచేస్తుంటారు.. దానికి సంభంధమేలేని హీరోలని బ్లేమ్ చేస్తుంటాం. అభిమానుల‌కు చెడ్డ పేరు తెచ్చేలా చేస్తారు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఒక పొలిటికల్ పార్టీకి చెంది ఉంటారు. ఫ్యాన్స్ అమాయ‌కుల‌ని బ‌లంగా న‌మ్ముతాను. అమాయ‌కుల్ని కొంత మంది త‌మ రాజకీయ స్వ‌లాభం కోసం ప్రేరేపిస్తున్నారు'' అని ట్వీట్ చేసింది పూనమ్. అంతేకాకుండా ''ఏ హీరో కూడా తన ఫ్యాన్స్ ని వేరే వాళ్ళని బూతులు తిట్టమని ప్రోత్సహించడు. ఇది ఇండస్ట్రీలో మీడియాలో ఉన్న జలస్ వలన క్రియేట్ చేయబడుతుంది. ట్రోలింగ్ అనేది యాక్టర్స్ లైఫ్ లో ఒక భాగం. క్రిమినల్ యాక్ట్స్ మీద ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంది'' అని మరో ట్వీట్ చేసింది.

ఇంకా పూనమ్ ట్వీట్ చేస్తూ ''త‌న‌ను కూడా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌తో కొంద‌రు టార్గెట్ చేశార‌ని.. ఐతే తాను అభిమానుల జోలికి వెళ్ల‌కుండా ఇలాంటి కుట్ర‌ల‌కు కార‌ణ‌మైన‌ మ‌ధ్య‌వ‌ర్తుల మీదే పోలీసుల‌కు ఫిర్యాదు చేశాను. అన‌వ‌స‌ర‌మైన వివాదాల్లో అభిమానుల్ని నిందించ‌కండి'' అంటూ ఫ్యాన్స్ ని వెనకేసుకొచ్చింది. గ‌తంలో పూన‌మ్ కౌర్‌ ని పవర్ స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ ఫ్యాన్స్ ట్రోల్ చేయ‌డంపై పూన‌మ్ సైబ‌రాబాద్ పోలీసుల్ని సంప్ర‌దించి కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం మీద పూనమ్ కౌర్ ఈ విషయంలో ఫ్యాన్స్ ని అనొద్దు అంటూనే రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌ కోసం క్రిమినల్ యాక్ట్స్ కి పాల్పడే వారి మీద ఫిర్యాదు చేయమని చెప్పుకొచ్చింది.