'ఎఫ్ 3'కి పూజ హెగ్డే సాంగ్ హైలైట్: అనిల్ రావిపూడి

Mon May 16 2022 15:21:53 GMT+0530 (IST)

Pooja Hegde song highlight for F3 Anil Ravipud

తెలుగు తెరపై కామెడీని పరుగులు తీయించిన దర్శకులలో జంధ్యాల .. ఈవీవీ .. శ్రీను వైట్ల తరువాత స్థానంలో అనిల్    రావిపూడి కనిపిస్తున్నాడు. ఆయన సినిమాలోని కామెడీ ఎపిసోడ్స్ తలచుకుని .. తలచుకుని నవ్వుకునేలా ఉంటాయి. ఇంతవరకూ ఫ్లాప్ అనే మాట చెవిన పడకుండా వరుస సినిమాలు చేస్తూ వెళుతున్న అనిల్ రావిపూడి 'ఎఫ్ 2' సినిమాకి సీక్వెల్  గా 'ఎఫ్ 3' సినిమాను రూపొందించాడు. వెంకటేశ్ .. వరుణ్  తేజ్ .. తమన్నా .. మెహ్రీన్ తో పాటు ఈ సారి సోనాల్  చౌహన్ కూడా సందడి చేయనుంది.ఈ నెల 27వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. "ఈ కథ అంతా కూడా డబ్బు చుట్టూ తిరుగుతుంది. జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైనది  .. కానీ డబ్బే  జీవితమని అనుకుంటే అలాంటివారి జీవితాలు ఎలా ఉంటాయో చెప్పే సినిమా ఇది. సినిమా మొదలైన దగ్గర నుంచి ఎండ్ కార్డు  పడేవరకూ నవ్విస్తూనే ఉంటుంది. ఈ సినిమాలో ఏ ఆర్టిస్ట్ కూడా తనది చిన్న పాత్రనే కదా అని బాధ పడటమంటూ జరగదు. ఎందుకంటే ప్రతి  చిన్న పాత్రకి కూడా ప్రాధాన్యత ఉంటుంది.

అందువలన ప్రతి ఆర్టిస్ట్ ఈ సినిమాలో తాను కూడా ఒక భాగమైనందుకు ఆనందపడటం జరుగుతుంది. స్క్రీన్ పై ఏ పాత్రకి ఉండవలసిన స్పేస్ .. ఆ పాత్రకి ఉంటుంది. ఎవరు చేయవలసిన స్కోర్ వారు చేశారు. ఈ సినిమాలో పూజ హెగ్డే స్పెషల్ సాంగ్ ఉంది.

హఠాత్తుగా ఈ పాట తెరపైకి వచ్చేయదు. కథలో భాగంగానే ఈ పాట ఉంటుంది .. కథను లింక్ చేసుకునే ఈ పాట తెరపైకి వస్తుంది. పూజ హెగ్డే చాలా బాగా చేసింది. ఈ స్పెషల్ సాంగ్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలవడం ఖాయం. యూత్ కి .. మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా ఒక రేంజ్ లో ఎక్కుతుంది.

ఈ సినిమా కథ .. స్క్రీన్ ప్లే ..  మాటలను పర్ఫెక్ట్ గా రెడీ చేసుకున్న తరువాతనే సెట్స్ పైకి వెళ్లడం జరిగింది. అందువలన  షూటింగు విషయంలో ఎలాంటి జాప్యం జరగలేదు. ఏం చేయాలనే ఒక విషయంలో నేను పూర్తి క్లారిటీతో ఉండటం వలన  చకచకా చేసేస్తూ వెళ్లాను.

ఎక్కువమంది ఆర్టిస్టులతో పనిచేయవలసి రావడం వలన అనుకున్నదాని కంటే ఒకటి రెండు రోజుల సమయం ఎక్కువ పట్టేది అంతే. 'ఎఫ్ 2' ను మించిన వినోదాన్ని ఈ సినిమా అందిస్తుందని ముందే చెప్పాను .. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం నాకు ఉంది " అని చెప్పుకొచ్చాడు.