తాజా ఛాన్స్ తో హిందీలోనూ పూజ దున్నేస్తుందా?

Sat Jan 18 2020 11:27:39 GMT+0530 (IST)

Pooja Hegde bags yet another Bollywood biggie

ఒక చోట సక్సెస్ అయినోళ్లు మరోచోట సక్సెస్ కావటం అంత తేలిక కాదు. అందునా చిత్రపరిశ్రమలో ఇది మరింత కష్టం. టాలీవుడ్ లో వెలిగిపోయినోళ్లు బాలీవుడ్ కు వెళ్లినంతనే తేలిపోతారు. ఒక వుడ్ లో స్టార్.. మరో వుడ్ లో ప్రభావం చూపించటం అంత తేలికైన విషయం కాదు. కాకుంటే.. హీరోలతో పోలిస్తే.. .హీరోయిన్లకుకాస్త సౌలభ్యం ఉన్నప్పటికీ.. మంచి అవకాశంతో పాటు అంతో ఇంతో లక్ కూడా అవసరం. దీనికి పూజాహెగ్డేనే పెద్ద ఉదాహరణగా చెప్పాలి.బాలీవుడ్ లో ఆమె ఎంట్రీ ఇచ్చిన మొహంజోదారో భారీ చిత్రం. ఆ చిత్రం విడుదలయ్యాక పూజ దశ.. దిశ మొత్తం మారిపోతుందన్న అంచనాలు వ్యక్తమైనప్పటికీ.. ఆ సినిమా సక్సెస్ కాకపోవటంతో హిందీలో ఆమెకు మరో చిత్రంలో తప్పించి ఆపర్లు రాలేదు. పూజాహెగ్డే అన్నంతనే మొహంజదారో సినిమా చాలామందికి గుర్తుకు వస్తుంది.కానీ.. బాలీవుడ్ లో ఆమె చేసింది కేవలం రెండు సినిమాలే అన్న లెక్క చెబితే చాలామంది నిజమా? అన్నట్లు చూస్తారు. కానీ.. అది నిజం.

ఈ మధ్యన తెలుగులో ఆమె నటించిన సినిమాలు వరుస పెట్టి హిట్ కావటమే కాదు.. ఆమెకు ప్రత్యేక ఇమేజ్ ను తీసుకొచ్చాయి. అరవింద సమేత వీర రాఘవ.. మహర్షి.. తాజాగా అల వైకుంఠపురములో.. ఇలా వరుస పెట్టి సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తున్న పూజకు బాలీవుడ్ లో సరైన బ్రేక్ రాలేదన్న కొరత ఉంది. తాజాగా ఆమెకు హిందీలో మంచి ఆఫర్ వచ్చిందంటున్నారు.

తమిళంలో అజిత్ చేసిన హిట్ మూవీ వీరమ్ ను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో అజిత్ పాత్రను అక్షయ్ కుమార్ చేస్తున్నారు. ఈ సినిమాలో పూజాహెగ్డేకు అవకాశం లభించినట్లుగా తెలుస్తోంది. ఫర్హాద్ సామ్ జీ దర్శకత్వం వహించే ఈ చిత్రంతో అయినా పూజా సుడి తిరిగిపోవాలని.. బాలీవుడ్ లో భారీ సక్సెస్ ను సొంతం చేసుకోవాలని తపిస్తోంది. మరి.. ఆమె ఆశ ఎంతమేర తీరుతుందో చూడాలి.