టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బాలీవుడ్ కే పరిమితం కానుందా..?

Wed Nov 25 2020 12:15:35 GMT+0530 (IST)

Will Tollywood star heroine be restricted to Bollywood?

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది పూజా హెగ్డే. 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగు తెరకు పరిచమైన ఈ బ్యూటీ తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందిపుచ్చుకుంది. 'అల వైకుంఠపురంలో' సినిమాతో ఈ బుట్టబొమ్మ క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటోంది. తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ హైదరాబాద్ టూ ముంబై అంటూ బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి 'రాధేశ్యామ్' అనే పీరియాడికల్ సినిమాలో నటిస్తోంది. అలానే అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లో కూడా పూజా నటిస్తోంది. ఇప్పటికే ఈ రెండు సినిమాలలో తన పాత్రలకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసింది. అయితే వీటి తర్వాత పూజా మరో తెలుగు సినిమాకి సైన్ చేయలేదని తెలుస్తోంది.బుట్టబొమ్మ పూజాహెగ్డే బాలీవుడ్ లో 'హౌస్ ఫుల్ 4' సినిమాతో మళ్ళీ అక్కడ ఫామ్ లోకి వచ్చింది. ఈ క్రమంలో రెండు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో నటించే అవకాశం కొట్టేసింది. హీరో రణవీర్ సింగ్ - డైరెక్టర్ రోహిత్ శెట్టి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'సర్కస్' అనే సినిమాలో పూజా హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. అలానే బాలీవుడ్ స్టార్ హీరో 'కండల వీరుడు' సల్మాన్ ఖాన్ పక్కన నటించే ఛాన్స్ కూడా దక్కించుకుందని తెలుస్తోంది. 'కభీ ఈద్ కభీ దివాళీ' అనే సినిమాలో పూజా సల్మాన్ తో కలిసి నటించనుందని సమాచారం. ప్రస్తుతం రెండు హిందీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న పూజా.. ఇప్పట్లో తెలుగు సినిమాకి డేట్స్ ఇవ్వడం కష్టమే అని అంటున్నారు. ఈ నేపథ్యంలో అమ్మడు బాలీవుడ్ లోనే పాగా వేస్తుందో లేదా తెలుగు సినిమాల్లో కూడా నటిస్తూ సౌత్ నార్త్ లను కవర్ చేస్తుందా అనేది చూడాలి.