'వరుడు కావలెను' సంగీత్ లో మెరిసిన పూజ హెగ్డే!

Sun Oct 24 2021 21:00:01 GMT+0530 (IST)

Pooja Hegde At Varudu Kavalenu Sangeet

ఇప్పుడు అందరి కళ్లలో నానుతున్న సినిమా 'వరుడు కావాలి' అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోస్టర్స్ నుంచి కూడా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. హీరోగా నాగశౌర్య ఇంతకుముందు సినిమాల కంటే ఈ సినిమాలో మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. అలాగే రీతూ వర్మ కూడా మరింత అందంగా అనిపిస్తోంది. ఈ సినిమా  టీజర్ .. ట్రైలర్ చూడగానే కెమెరా పనితనం బాగుందని అనిపించడం ఖాయం. విజువల్స్ అంత అందంగా .. గ్రాండ్ గా ఉన్నాయి. ఇక ఈ సినిమాకి తమన్ .. విశాల్ చంద్రశేఖర్ బాణీలను అందించారు.ఇప్పటికే వదిలిన పాటల్లో 'కోలా కళ్లే ఇలా' .. 'దిగు దిగు దిగు నాగ' జనంలోకి బాగా దూసుకెళ్లాయి. బీట్ పరంగా .. సాహిత్యం పరంగా .. చిత్రీకరణ పరంగా .. కాస్యూమ్స్ పరంగా కూడా ఈ పాటలు ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఈ నెల 29వ తేదీన విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేసుకుంటున్నారు .. ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు. అందులో భాగంగానే నిన్న రాత్రి 'సంగీత్' పేరుతో హైదరాబాదులో ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా జ హెగ్డేను ఆహ్వానించారు. దాంతో ఈ వేదికపై ఆమె ప్రత్యేకంగా మెరిసింది.

సాధారణంగా సినిమా ఫంక్షన్స్ కి హీరోలను చీఫ్ గెస్టులుగా పిలుస్తుంటారు. కానీ పూజ హెగ్డేను పిలవడం కొత్తగా అనిపించింది. సహజంగానే సన్నజాజి మొగ్గలా నాజూకుగా కనిపించే పూజ హెగ్డే ఈ స్టేజ్ పై తళుక్కుమంది. ఆమె హెయిర్ స్టైల్ .. కాస్యూమ్స్ అభిమానుల మనసులను మరోసారి గెలుచుకున్నాయి. ఫంక్షన్ అంతా కూడా నవ్వుతూ కనిపిస్తూ ప్రధానమైన ఆకర్షణగా నిలిచింది. ఎవరినీ .. ఏ విషయాన్ని మరిచిపోకుండా మాట్లాడుతూ సందడి చేసింది. తనని చీఫ్ గెస్టుగా పిలవాలనే ఆలోచన చేయడం నిర్మాతల గొప్పతనమని తేల్చేసింది.

దర్శకురాలిగా లక్ష్మీసౌజన్య పడిన కష్టం తెరపై కనిపిస్తూనే ఉందనీ ఆమె కష్టానికి తగిన సక్సెస్ లభిస్తుందనే నమ్మకం తనకి ఉందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఇక నాగశౌర్య కష్టపడి తనని తాను మల్చుకున్న హీరో అనే విషయాన్ని స్పష్టం చేసింది. రీతూ వర్మ గురించి ప్రస్తావిస్తూ ఆమె గ్లామర్ .. నటన గురించి ప్రశంసించింది. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మక తనకి ఉందంటూ సక్సెస్ మీట్ కి కూడా తనని చీఫ్ గెస్టుగా పిలవాలంటూ తన సమయస్ఫూర్తిని చాటుకుంది. ఇలా తన మాటలతోను .. చూపులతోను .. మనోహరమైన మందహాసంతోను ఈ స్టేజ్ పై పూజ హెగ్డే అలరించింది .. ఆకట్టుకుంది. మొత్తానికి ఈ ఫంక్షన్ కి పూజను పిలవడం ఈ సినిమాకి బాగానే కలిసొస్తుందనే విషయం మాత్రం అర్థమవుతోంది.