Begin typing your search above and press return to search.

బుట్టబొమ్మకి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఆహ్వానం ఏవిధంగా వచ్చింది..?

By:  Tupaki Desk   |   23 May 2022 7:30 AM GMT
బుట్టబొమ్మకి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఆహ్వానం ఏవిధంగా వచ్చింది..?
X
అంతర్జాతీయంగా అత్యంత ప్రతిష్టాత్మక చలన చిత్రోత్సవంగా పేరుగాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2022 వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మే 17 నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమంలో పలువురు సినీ తారలు మన దేశం తరపున ప్రతినిధులుగా పాల్గొన్నారు. అందులో సౌత్ నుంచి కమల్ హాసన్ - ఏఆర్ రెహమాన్ - - మాధవన్ - పా. రంజిత్ - సి కళ్యాణ్ - తమన్నా - నయనతార - పూజా హెగ్డే తదితరులు ఉన్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన పూజా హెగ్డే తొలిసారి ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై నడిచే అవకాశం దక్కించుకుంది. గేయన్నా యూనెస్ గౌన్ లో ఎంతో అందంగా కనిపించి అందరి మనసులను కొల్లగొట్టింది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఫోటోలు వీడియోలు బుట్టబొమ్మ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ వస్తోంది. అయితే పూజాకి ఏ ప్రాతిపదికన కేన్స్ కు ఆహ్వానం వచ్చిందనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతోంది.

75వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో భారత సినీ ప్రముఖులు సందడి చేస్తున్నా.. వారికి మాత్రమే ఎందుకు ఆహ్వానం వచ్చింది? మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు? అసలు ఏ బేసిస్ మీద ఇన్విటేషన్ ఇస్తారు? అనే డిస్కషన్ తొలి రోజు నుంచే జరుగుతోంది. ఈ క్రమంలో పూజా హెగ్డేకి ఆహ్వానం వచ్చిందా లేదా ఆమె సొంత ఖర్చుతో స్వయంగా వెళ్లిందా? అనే ప్రశ్నలు తలెత్తాయి.

దక్షిణాదితో పాటు ఉత్తరాదిన కూడా హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటున్న పూజా.. ప్రస్తుతం పలు క్రేజీ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. అయితే ఈ ఏడాది ఆమె కెరీర్ లో మరచిపోలేనిదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమాలకు సంబంధించి 'రాధేశ్యామ్' 'బీస్ట్' 'ఆచార్య' వంటి హ్యాటిక్ ప్లాప్స్ నిరాశ కలిగిస్తే.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ రెడ్ కార్పెట్ పై నడిచే ఛాన్స్ దక్కడం తీపి జ్ఞాపకంగా మిగిలింది.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు బ్రాండ్ గా రాలేదని.. కానీ బ్రాండ్ ఇండియాతో వచ్చానని పూజా హెగ్డే పేర్కొంది. ''నేను నా దేశానికి ప్రతినిధిగా మాత్రమే ఇక్కడికి వచ్చాను. ఇలాంటి ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతీయదేశానికి - ఇండియన్ సినిమాకి ప్రాతినిథ్యం వహించడం కంటే పెద్ద గౌరవం నాకు మరొకటి ఉంది'' అని చెప్పుకొచ్చింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లాంటి ప్రతిష్టాత్మకమైన వేదికపై ప్రాతినిధ్యం వహించాలనే కల నిజమైందని.. ఇది తన కెరీర్లో మంచి దిశలోనే వెళుతుందనే దానికి ఇదే గొప్ప ఉదాహరణని పూజా తెలిపింది.

ఇదిలావుంటే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై మెరిసి అందరినీ ఆకట్టుకున్న పూజా హెగ్డేకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఈ వేడుక కోసం తాను సిద్ధం చేసుకున్న నగలు, దుస్తులు, మేకప్‌ సామాన్ల బ్యాగ్‌లు బుట్టబొమ్మ పోగొట్టుకుంది. దీంతో తనతో పాటుగా తన టీం అంతా ఆందోళనకు గురై.. ఒక రోజంతా ఏం తినకుండ ఉన్నామని స్వయంగా తెలిపింది.

''రెడ్‌ కార్పెట్‌ పై నడిచేందుకు బ్యూటీ ప్రొడక్ట్స్‌ - ఫ్యాషన్‌ వేర్‌ దుస్తులను నా టీం స్పెషల్‌ గా డిజైన్‌ చేసింది. ఎంతో కష్టపడి అంతా సిద్ధం చేసుకున్నాం. తీరా ఫ్రాన్స్‌ వచ్చాక ఆ బ్యాగులు కనిపించకుండా పోయాయి. ఇండియా ఎయిర్‌ పోర్టులోనే బ్యాగులు పోయాయి. చెకిన్‌ అయ్యాయి కానీ అందులో నా మేకప్‌ - దుస్తులకు సంబంధించిన బ్యాగ్స్‌ మాత్రం కనిపించలేదు. ఫ్రాన్స్ వచ్చిన తర్వాత నేను, నా టీం ఆందోళనకు గురయ్యాం'' అని పూజా చెప్పుకొచ్చింది.

''అయితే ఇండియాలో కొన్న బంగారు నగలు నా హ్యాండ్‌ బ్యాగులో ఉన్నాయి. దీంతో ఊపిరి పీల్చుకున్నాను. ఆ తర్వాత నా టీంకి మేకప్‌ సామన్లు, దుస్తులు కొని తీసుకురమ్మన్నాను. వెంటనే వారు అవసరమైన వస్తువులన్నీ కొని తెచ్చారు'' అని తెలిపింది. బ్యాగ్స్‌ మిస్‌ అవడంతో టెన్షన్‌ లో ఆ రోజంత తనతో పాటు తన టీం ఎవరు కూడా బ్రేక్ ఫాస్ట్ - లంచ్ - డిన్నర్ చేయలేదని.. రాత్రి రెడ్ కార్పెట్ వాక్ ముగిసిన తర్వాతే అందరం తిన్నామని పూజా చెప్పింది.

ఇకపోతే పూజా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి వచ్చిన తర్వాత సల్మాన్ ఖాన్ 'కభీ ఈద్ కభీ దీవాళి' షూటింగ్ లో పాల్గొంటుంది. ఇందులో టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ కూడా నటిస్తుండడం విశేషం. ఇదే క్రమంలో మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కనున్న SSMB28 సినిమా చేయనుంది. అలానే పవన్ కళ్యాణ్ తో 'భవదీయుడు భగత్ సింగ్' ప్రాజెక్ట్ అమ్మడి లైనప్ లో ఉంది.