Begin typing your search above and press return to search.

'పొన్నియన్ సెల్వన్' మూవీ రివ్యూ

By:  Tupaki Desk   |   30 Sep 2022 11:50 AM GMT
పొన్నియన్ సెల్వన్ మూవీ రివ్యూ
X
'పొన్నియన్ సెల్వన్' మూవీ రివ్యూ
నటీనటులు: విక్రమ్-జయం రవి-కార్తి-ఐశ్వర్యా రాయ్-త్రిష-ప్రకాష్ రాజ్-శరత్ కుమార్-కిషోర్-పార్తీబన్-శోభిత దూళిపాళ-ఐశ్వర్యా లక్ష్మి-విక్రమ్ ప్రభు-లాల్ తదితరులు
సంగీతం: ఏఆర్ రెహమాన్
ఛాయాగ్రహణం: రవివర్మన్
మాటలు: తనికెళ్ల భరణి
నిర్మాతలు: సుభాస్కరన్-మణిరత్నం
స్క్రీన్ ప్లే: మణిరత్నం-జయమోహన్-కుమారవేల్
దర్శకత్వం: మణిరత్నం

తమిళ సినీ పరిశ్రమ నుంచి 'బాహుబలి'కి సమాధానంగా చెప్పుకున్న సినిమా 'పొన్నియన్ సెల్వన్'. దివంగత రచయిత కల్కి రాసిన 'పొన్నియన్ సెల్వన్' నవల ఆధారంగా సినిమా తీయాలని ఎన్నో ఏళ్ల నుంచి కలలు కంటున్న దిగ్గజ దర్శకుడు మణిరత్నం ఎట్టకేలకు మూడేళ్ల కిందట ఈ చిత్రాన్ని పట్టాలెక్కించి.. పార్ట్-1ను ఈ రోజే ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:

చోళరాజ్యాన్ని పాలించే సుందరచోళుడి (ప్రకాష్ రాజ్) కుమారులు ఆదిత్య కరికాలుడు (విక్రమ్).. అరుణ్మొళి (జయం రవి) తమ రాజ్య విస్తరణలో భాగంగా ఒక్కొక్కరు ఒక్కో దిక్కుకు సైన్యంతో కలిసి వెళ్లి.. ఒక్కో రాజ్యాన్ని చేజిక్కించుకుంటూ ఉంటారు. ఇంతలో పెద్ద పల్వేట్ట రాయుడు (శరత్ కుమార్) నేతృత్వంలో సామంత రాజులంతా కలిసి చోళ రాజ్యాన్ని చేజిక్కించుకోవడానికి కుట్ర పన్నుతారు. తమ వెనుక ఏదో జరుగుతోందని గ్రహించిన ఆదిత్య.. వల్లవరాయ వందిదేవుడు (కార్తి)ని వేగుగా పంపుతాడు. అతను సామంత రాజుల కుట్రను తెలుసుకుని తిరుగు ప్రయాణం మొదలుపెడతాడు. ఈలోపు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని అరుణ్మొళిని బంధించి తీసుకురావడానికి అతడి తండ్రే సైన్యాన్ని పంపే పరిస్థితి వస్తుంది. మరోవైపు చోళ రాజులకు తమ రాజ్యాన్ని కోల్పోయిన పాండ్య రాజులు అరుణ్మొళిని అంతమొందించడానికి పన్నాగం పన్నుతారు. మరి ఈ దాడుల నుంచి అరుణ్మొళి తప్పించుకున్నాడా.. వల్లవరాయుడు అతణ్ని కాపాడగలిగాడా.. చోళ రాజులకు వ్యతిరేకంగా జరిగిన కుట్ర ఎంత మేరకు ఫలించింది అన్న విషయాలు తెర మీదే చూసి తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

వాస్తవ గాథలు కావచ్చు.. లేదా కల్పిత కథలు కావచ్చు.. చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రాల విషయంలో ప్రేక్షకుల ఆలోచన ధోరణి 'బాహుబలి'కి ముందు.. 'బాహుబలి'కి తర్వాత అని వేరుగా చూడాల్సిన పరిస్థితి. అంతకుముందు రాజులు.. రాజ్యాలు.. యుద్ధాలతో ముడిపడ్డ సినిమాలు అంటే.. ఒక రకమైన మైండ్ సెట్ తో థియేటర్లకు వెళ్లేవాళ్లు ప్రేక్షకులు. కాస్త భారీతనం ఉన్న సెట్టింగ్స్ వేసి విజువల్ గ్రాండియర్ చూపిస్తే.. ఓ వెయ్యిమందికి సైనికుల వేషం వేయించి చిన్నపాటి యుద్ధం జరిపిస్తే సరిపోయేది. కథలో కొంచెం బిగి ఉండి ఓ మోస్తరుగా ఎమోషన్లు పండితే బండి నడిచిపోయేది. కానీ 'బాహుబలి'తో ప్రేక్షకుల మైండ్ సెట్ మొత్తం మార్చి పడేశాడు మన రాజమౌళి. ఇంతకుముందెన్నడూ చూడని కళ్లు చెదిరే సెట్టింగ్స్.. రోమాలు నిక్కబొడుచుకునే యుద్ధ సన్నివేశాలు.. ఉర్రూతలూగించే ఎలివేషన్లు.. నమ్మశక్యంగా అనిపించకపోయినా వారెవా అనుకునే విన్యాసాలు.. ఇలా ఆ సినిమాతో రాజమౌళి ఇచ్చిన 'హై' అలాంటిలాంటిది కాదు. అంతకుముందే 'మగధీర'తో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన జక్కన్న.. 'బాహుబలి'తో దేశం మొత్తాన్ని ఊపేశాడు. ఇక అక్కడి నుంచి చారిత్రక నేపథ్యంతో తెరకెక్కే ఏ సినిమానైనా ప్రేక్షకులు చూసే కోణం మారిపోయింది. రాజమౌళి హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది ఉండొచ్చు.. ఆయన తీసింది కళాఖండం కాకపోవచ్చు.. ఓ వర్గం ప్రేక్షకులకు 'బాహుబలి' రుచించి ఉండకపోవచ్చు.. కానీ మెజారిటీ ప్రేక్షకులకు 'బాహుబలి'తో పతాక స్థాయి వినోదాన్నందించి.. ఈ నేపథ్యంలో తెరకెక్కే ప్రతి సినిమాలోనూ అలాంటి అంశాలే ఆశించేలా మైండ్ సెట్ ను మార్చేశాడు జక్కన్న. ఆ కళ్లతో తర్వాత ఏ భారీ చిత్రం చూసినా ప్రేక్షకులకు కిక్కు సరిపోవట్లేదు. ఈ జాబితాలో చేరిన తాజా చిత్రం 'పొన్నియన్ సెల్వన్'. ఎంత ఓపెన్ మైండ్ తో చూసినా కూడా సహనానికి పరీక్ష లాగే అనిపించే ఈ మణిరత్నం కలల చిత్రం.. 'బాహుబలి' కళ్లతో చూస్తే మాత్రం పూర్తిగా నీరసమే తెప్పిస్తుంది.

'పొన్నియన్ సెల్వన్' చిత్రంలో కార్తి హీరో కాదు. ఇందులో కథానాయక పాత్రలు చేసింది విక్రమ్.. జయం రవి. కార్తి చేసింది వల్లవరాయ వందిదేవుడు అనే సహాయ పాత్ర. మామూలుగా ఇలాంటి భారీ చిత్రంలో హీరోల పరిచయ సన్నివేశాల నుంచి ఎంతో ఆశిస్తాం. ఎలివేషన్లు కోరుకుంటాం. ఆ పాత్రలతో ట్రావెల్ అవ్వాలనుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం విక్రమ్.. జయం రవిల పాత్రలు నిస్సారంగా తయారై.. అవి కనిపించినపుడు కాస్తయినా ఎగ్జైట్మెంగ్ కలగదు. వాటికి ఒక ఎలివేషన్ లేదు. వాటితో ప్రేక్షకులకు కనీసం ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడదు. విక్రమ్ పాత్ర అప్పుడప్పుడూ ఏదో సహాయ పాత్రలాగా వచ్చి వెళ్తుంటుంది. జయం రవి క్యారెక్టర్ ద్వితీయార్ధంతో ఒక చప్పని యుద్ధ సన్నివేశంతో ఎంట్రీ ఇచ్చి చివరి వరకు అదే టెంపోలో నడుస్తుంది. ఈ పాత్రలు ఇలా నీరుగారిపోతే.. సహాయ పాత్ర చేసిన కార్తినే ప్రేక్షకుల పాలిట రక్షకుడిలా కనిపిస్తాడు. ఇలాంటి భారీ చిత్రంలో యుద్ధ సన్నివేశాలు.. ఎలివేషన్ల నుంచి మాగ్జిమం ఎంటర్టైన్మెంట్ ఆశిస్తే.. అవేమీ లేకపోగా.. కార్తి చేసే కామెడీతో రిలీఫ్ ఫీలవుతాం. ఆ పాత్ర కనిపించినపుడల్లా హమ్మయ్య అనుకుని అతను అమ్మాయిలను ఫ్లర్ట్ చేస్తుంటే.. జోకులేస్తుంటే నవ్వుకుని టైంపాస్ చేస్తాం. దీన్ని బట్టే 'పొన్నియన్ సెల్వన్' పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

'పొన్నియన్ సెల్వన్' తమిళంలో వచ్చిన అత్యుత్తమ నవలల్లో ఒకటిగా పేరున్న 'పొన్నియన్ సెల్వన్' ఆధారంగా తెరకెక్కిన సినిమా. ఆ నవల పేరెత్తితే.. దాన్ని చదివిన వాళ్లంతా చాలా ఎగ్జైట్ అయిపోతుంటారు. కానీ 'పొన్నియన్ సెల్వన్' సినిమా చూస్తున్నపుడు అలాంటి ఎగ్జైట్మెంట్ కలగడకపోవడాన్ని బట్టి లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం.. ఆయన టీం ఈ నవలను సినిమాకు తగ్గట్లు సరిగ్గా అడాప్ట్ చేయలేకపోయిందన్నది స్పష్టం. ఈ సినిమా కోసం మణిరత్నం అండ్ కో పడ్డ కష్టాన్ని తక్కువ చేయలేం కానీ.. సగటు ప్రేక్షకుడిలో ఉద్వేగం కలిగించే బలమైన ఎపిసోడ్ సినిమాలో ఒక్కటీ లేదనే విషయంలో మరో మాట లేదు. 'పొన్నియన్ సెల్వన్' చదివిన వాళ్లు ఇందులోని పాత్రలతో ముందు నుంచే ట్రావెల్ అవుతారేమో కొత్తగా ఈ సినిమా చూస్తున్న వారికి మాత్రం ప్రధాన పాత్రలు పెద్దగా రిజిస్టర్ కావు. ఐదు భాగాలుగా ఉన్న 'పొన్నియన్ సెల్వన్' నవలను కుదించి.. రెండు భాగాల సినిమాగా తెరకెక్కించే క్రమంలో సున్నా నుంచి మొదలుపెట్టకుండా.. కథను మధ్యలోంచి మొదలుపెట్టినట్లుగా అనిపిస్తుంది. ఆల్రెడీ పరిచయమున్న వాటిలా ఒక్కో పాత్రను పరిచయం చేశాడు మణిరత్నం. ఐతే ఆదిత్య కరికాలుడు (విక్రమ్).. అరుణ్మొళి (జయం రవి) మహా యోధులని.. నందిని (ఐశ్వర్యారాయ్) మహా జాదూ అని మాటల్లో చెప్పడమే తప్ప.. ప్రేక్షకులు అలా ఫీలయ్యేలా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ జరగలేదు తెరమీద. ఆరంభం నుంచి అంతో ఇంతో ఎంటర్టైన్ చేస్తూ సాగడం వల్ల కార్తి పాత్రతోనే అంతో ఇంతో ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడుతుంది తప్ప.. మరే పాత్ర కూడా ఇందులో బలమైన ముద్ర వేయకపోవడం పెద్ద మైనస్. పాత్రలతో కనెక్షన్ ఏర్పడనపుడు వాటి తాలూకు ఎమోషన్లను ఎలా ఫీలవుతాం? కథతో ఎలా ఇన్వాల్వ్ అవుతాం? 'పొన్నియన్ సెల్వన్'కు సంబంధించి అతి పెద్ద సమస్య ఇదే.

'పొన్నియన్ సెల్వన్' సినిమా అంతా అయ్యాక కూడా అసలు మనం చూసి కథ ఏంటి అంటే చెప్పడం కష్టం. మణిరత్నం కథను నరేట్ చేసిన విధానం అంత కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది. 'చోళ రాజులకు వ్యతిరేకంగా సామంతరాజుల కుట్ర' అనే ఔట్ లైన్ అర్థమైనా.. దీన్ని కథగా విస్తరించిన తీరులో.. స్క్రీన్ ప్లేలో మాత్రం చాలా గందరగోళం కనిపిస్తుంది. ప్రేక్షకులకు ప్రతిదీ విడమరిచి చెప్పడం మణిరత్నం స్టైల్ కాదు. అలా అని ఆయన ఒకప్పటి మేటి చిత్రాల మాదిరి ఏదో మర్మం ఉన్నట్లుగా కూడా ఇందులో సన్నివేశాలు అనిపించవు. చాలా వరకు ఎపిసోడ్లు ఒకదాంతో ఒకదానికి సంబంధం లేనట్లుగా సాగిపోతుంటాయి. పాత్రల సంగతి కూడా అంతే. కథ లోతుల్లోకి వెళ్లకపోవడం వల్ల.. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి వల్ల.. కార్తి పాత్ర పంచిన వినోదం వల్ల ప్రథమార్ధం ఒక మోస్తరుగా అనిపిస్తుంది. కానీ ద్వితీయార్ధం మాత్రం ప్రేక్షకులను నిద్ర పుచ్చేలా నీరసంగా సాగుతుంది. విక్రమ్-ఐశ్వర్యారాయ్ పాత్రలకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ నుంచి ఏదో ఆశిస్తే.. అదో పెద్ద అయోమయం లాగా అనిపిస్తుంది. దీంతో పాటుగా పాండ్య రాజుల పగకు సంబంధించిన సన్నివేశాలను కూడా పైపైన లాగించేశారు. అవసరం లేని సన్నివేశాలకు చాలా సమయం తీసుకుని ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిన మణిరత్నం.. కొంచెం విడమరిచి చెప్పాల్సిన దగ్గర మాత్రం ఎడిటింగ్ స్కిల్స్ చూపించడానికి ప్రయత్నించడం ఆశ్చర్యం. చివరి అరగంటలో కథ కొంచెం వేగం అందుకోవడం.. సముద్రంలో ఒక భారీ యాక్షన్ ఘట్టంతో సినిమాను ముగించడం వల్ల ప్రేక్షకుల్లో కొంచెం కదలిక వస్తుంది కానీ.. లేదంటే 'పొన్నియన్ సెల్వన్' పరిస్థితి ఘోరంగా ఉండేదే. కథను మధ్యలో ముగించి.. సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూడమని చెప్పారు కానీ.. దాన్ని చూడాలన్న కుతూహలం అయితే పార్ట్-1 కలిగించలేదు. తమ చరిత్రతో ముడిపడ్డ సినిమా కావడం, 'పొన్నియన్ సెల్వన్'తో తమిళులకు ఉన్న ఎమోషనల్ కనెక్షన్ కారణంగా వారిని ఈ సినిమా ఎగ్జైట్ చేస్తే చెయ్యొచ్చేమో కానీ.. మన వాళ్లను మాత్రం ఇది రుచించే అవకాశాలు తక్కువే.

నటీనటులు:

కథలో ఉన్న ప్రాధాన్యం ప్రకారం విక్రమ్ ముందు వరుసలో నిలుస్తాడు కానీ.. అతడి పాత్ర ఏమంత ఆసక్తికరంగా అనిపించదు. విక్రమ్ లుక్.. తన స్క్రీన్ ప్రెజెన్స్.. కనిపించిన తక్కువ సమయంలో తన హావభావాలు ఆకట్టుకుంటాయి కానీ.. తన పాత్ర మాత్రం గుర్తుంచుకునేలా లేదు. జయం రవి పరిస్థితి కూడా ఇంతే. తనకు అవకాశమున్నంత మేర ప్రతిభను చాటుకున్నాడు. సినిమా మొత్తంలో ప్రత్యేకంగా అనిపించి ప్రేక్షకులను ఆకట్టుకునే పాత్ర అంటే.. కార్తిదే. బేసిగ్గా అతడికి ఉన్న కామెడీ టైమింగ్.. ఈజ్ వల్ల ఈ పాత్ర పండింది. కార్తి తన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. ఐశ్వర్యారాయ్ నందిని పాత్రలో ఆకట్టుకుంది. నిగూఢంగా కనిపించే పాత్రకు అవసరమైన స్థాయిలో నటించింది. కానీ ఆమె పాత్రకు ఇచ్చిన బిల్డప్ కు తగ్గట్లు అయితే అది ఎలివేట్ కాలేదు. కుందేవి పాత్రలో త్రిష ఓకే అనిపించింది. శరత్ కుమార్ కీలక పాత్రలో రాణించాడు. జయరాం వైవిధ్యమైన ఆహార్యం.. నటనతో మెప్పించాడు. ప్రకాష్ రాజ్.. కిషోర్ కూడా బాగానే చేశారు. మిగతా చిన్న చిన్న పాత్రలకు కూడా పేరున్న నటులనే తీసుకున్నారు కానీ.. వాళ్ల ఇంపాక్ట్ పెద్దగా లేదు.

సాంకేతిక వర్గం:

'పొన్నియన్ సెల్వన్' సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కింది. ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం గొప్పగా అనిపిస్తుంది. కాకపోతే సినిమాలో బాహుబలి తరహా ఎలివేషన్లు, హై మూమెంట్స్ లేకపోవడం వల్ల రెహమాన్ కూడా మాస్ ప్రేక్షకులను ఉర్రూతూలగించేలా బీజీఎం ఇవ్వలేదు. దాన్ని పక్కన పెడితే సన్నివేశాల ప్రాధాన్యానికి తగ్గట్లు ఆర్ఆర్ సాగింది. ఐతే రెహమాన్ పాటలు మాత్రం తన స్థాయికి తగ్గట్లు లేవు. పాటల్లో తమిళ వాసనలు గుప్పుమన్నాయి. రవివర్మన్ ఛాయాగ్రహణం.. తోటతరణి ఆర్ట్ వర్క్ గొప్పగా ఉన్నాయి. నిర్మాణ విలువల విషయంలో ఢోకా లేదు. సినిమా అంతటా భారీతనం కనిపిస్తుంది. అన్ని వనరులూ గొప్పగా సమకూరినా.. దర్శకుడు మణిరత్నం వాటిని సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. కొన్ని సన్నివేశాలు.. డైలాగుల వరకు ఆయన ముద్ర కనిపించినా.. దశాబ్దాల నుంచి అందరూ కొనియాడుతున్న కథను ఆయన ఆసక్తికరంగా తెర మీద ప్రెజెంట్ చేయలేకపోయాడు. స్క్రీన్ ప్లే.. క్యారెక్టర్ల ఎస్టాబ్లిష్మెంట్లో ఒకప్పటి మణిరత్నం మ్యాజిక్ మిస్సయింది.

చివరగా: పొన్నియన్ సెల్వన్.. 'భారీ' నిరాశ

రేటింగ్-2.25/5