ఏపీలో లేవ్ .. నైజాంలోనే అఖండ స్పెషల్ షోలు

Wed Dec 01 2021 21:17:45 GMT+0530 (IST)

Police permission for Akhanda special show

నటసింహా నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం అఖండ. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. డిసెంబర్ 2న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా రిలీజవుతోంది. అయితే ఏపీలో ప్రత్యేక షోలు బెనిఫిట్ షోలకు ఆస్కారం లేకపోవడంతో అత్యథిక థియేటర్లలో తక్కువ టికెట్ రేట్లకే షోలు వేయాల్సిన పరిస్థితి ఉంది.తెలంగాణలో అందుకు పూర్తి భిన్నమైన వాతావరణం ఉంది. ఇక్కడ స్పెషల్ షోల కోసం పోలీసుల అనుమతిని తీసుకున్నారు. కూకట్ పల్లి మల్లిఖార్జున - భ్రమరాంభ థియేటర్లలో అఖండ్ స్పెషల్ షోలకు పోలీసుల నుంచి అనుమతులు లభించాయి. ఆ మేరకు పోలీస్ కమీషనర్ ఉత్తర్వును జారీ చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అర్జీని పరిశీలించిన కమీషనర్ అనుమతుల్ని మంజూరు చేశారు.

హైదరాబాద్ సహా పలు నగరాల్లో స్పెషల్ షోల కోసం అఖండ బృందాలు ప్రయత్నాల్లో ఉన్నాయని తెలిసింది. స్పెషల్ షోలకు కొన్ని ప్రత్యేక ఏర్పాట్లను పోలీస్ శాఖ కోరింది. అన్ని థియేటర్లలో కోవిడ్ నియమావళిని పాటించాలి. ట్రాఫిక్ సమస్యలు రాకుండా నిలువరించే సెక్యూరిటీ బాధ్యత రిలీజ్ చేస్తున్నవారిదే. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అయినా థియేటర్ యాజమాన్యాలు బాధ్యత వహించాలని కమీషనర్ ఆర్డర్స్ జారీ చేశారు. ఓవర్సీస్ సహా చాలా చోట్ల అఖండ షోలకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఓపెనింగ్ డే రికార్డుల కోసం ఎన్బీకే ఫ్యాన్స్ దూకుడు ప్రదర్శించడం విశేషం.